మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా మారుతుంటే.. హైదరాబాద్ లాంటి నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర ఎక్కడ సెంచరీ దాటి డబుల్ సెంచరీ కొడుతుందో అని సామాన్యుడు భయపడుతున్నాడు. కానీ, ఈ పెట్రోల్ కష్టాలకు చెక్ పెడుతూ భారత ఆయిల్ కంపెనీలు (రిలయన్స్, ఇండియన్ ఆయిల్) ఒక మాస్టర్ స్ట్రోక్ వేశాయి. అమెరికా ఇచ్చిన మినహాయింపును వాడుకుని ఏకంగా 3 కోట్ల (30 మిలియన్) బ్యారెళ్ల రష్యా ముడి చమురును రాత్రికి రాత్రే ఆర్డర్ చేశాయి. అసలు సముద్రంలో దారి మళ్లి మన వైపు వస్తున్న ఆ ట్యాంకర్ల కథేంటి? డిస్కౌంట్ పోయి ప్రీమియం (అదనపు) రేటుకు రష్యా ఆయిల్ ఎందుకు కొనాల్సి వస్తోంది? దీనివల్ల మన జేబులకు పొంచి ఉన్న ముప్పు ఎలా తప్పిందో ఇప్పుడు చూద్దాం.
హోర్ముజ్ బ్లాక్.. ఇండియా వేసిన మాస్టర్ స్కెచ్!
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి 'హోర్ముజ్ జలసంధి' దగ్గర తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక్కడి నుంచి గల్ఫ్ ఆయిల్ సప్లై ఏ క్షణమైనా ఆగిపోయే పరిస్థితి వచ్చింది.
ఈ పెను సంక్షోభాన్ని ముందే పసిగట్టిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), రిలయన్స్ ఇండస్ట్రీస్.. వెంటనే స్పాట్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. గల్ఫ్ ఆయిల్ రిస్క్ ఎందుకని రష్యా ముడి చమురును భారీగా కొనుగోలు చేశాయి.
ఇండియన్ ఆయిల్ దాదాపు 10 మిలియన్ బారెల్స్ కొనుగోలు చేయగా, రిలయన్స్ కూడా అదే స్థాయిలో ఆర్డర్ పెట్టింది. మొత్తంగా ఇండియా 30 మిలియన్ బారెల్స్ ముడి చమురుతో తన రిజర్వ్స్ ను ఫుల్ చేసుకుంటోంది. దీనివల్ల మన దేశంలో చమురు కొరత రాకుండా బ్రేక్ పడింది.
డిస్కౌంట్ పోయింది.. ప్రీమియంతో రష్యా ఆయిల్!
2022 ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా మనకు భారీ డిస్కౌంట్ తో ఆయిల్ అమ్మేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
రష్యాకు చెందిన 'యురల్స్, ఈఎస్‌పీఓ, వరండే' గ్రేడ్ ఆయిల్స్ ఇప్పుడు లండన్ బ్రెంట్ మార్కెట్ ధర కంటే బ్యారెల్‌కు $2 నుండి $8 డాలర్ల 'ప్రీమియం' (ఎక్కువ రేటు) పలుకుతున్నాయి. అయినా సరే, గల్ఫ్ ఆయిల్ ఆగిపోతుందన్న భయంతో కొంచెం ఎక్కువ రేటైనా సరే ఇండియా వెనక్కి తగ్గకుండా ఈ కొనుగోళ్లు చేస్తోంది.
దారి మళ్లుతున్న షిప్పులు.. మార్చి 5 డెడ్‌లైన్ ఎఫెక్ట్
మార్చి 5వ తేదీ కంటే ముందు ఓడల్లో లోడ్ చేసిన రష్యా చమురు లావాదేవీలకు అమెరికా ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ లూప్ హోల్ ను ఇండియా కరెక్ట్ గా వాడుకుంటోంది.
దీంతో మొదట సింగపూర్ వైపు వెళ్లాల్సిన 'మెలో, సారా' అనే రెండు భారీ ఆయిల్ ట్యాంకర్లు సముద్రంలో రాత్రికి రాత్రే తమ రూట్ మార్చుకుని ఇండియా వైపు దూసుకొస్తున్నాయి.
కెప్లర్ (Kpler) డేటా ప్రకారం.. 2024 మధ్యలో రికార్డు స్థాయిలో రష్యా ఆయిల్ తెచ్చుకున్న ఇండియా, ఆ తర్వాత తగ్గించింది. ఇప్పుడు తాజా పరిస్థితుల్లో (ఫిబ్రవరిలో 1.06 మిలియన్ బారెల్స్) ఈ దిగుమతులను మళ్లీ రికార్డు స్థాయిలో పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒక సామాన్యుడిగా ఈ గ్లోబల్ పాలిటిక్స్ మనకు చెబుతున్నది ఒకటే.. రేటు కాస్త ఎక్కువైనా సరే రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుని బంకుల్లో పెట్రోల్ కొరత రాకుండా ప్రభుత్వం ప్రస్తుతానికి మనల్ని సేవ్ చేసింది. ఒకవేళ ఇండియా ఈ 30 మిలియన్ బారెల్స్ ఆర్డర్ చేయకపోయి ఉంటే, ఈపాటికే మన దగ్గర పెట్రోల్ ధరలు భగ్గుమనేవి. అయితే, అమెరికా ఇచ్చిన ఈ మినహాయింపు కేవలం మార్చి 5 కంటే ముందు లోడ్ చేసిన ఆయిల్‌కే! అంటే ఇది తాత్కాలిక ఊరట మాత్రమే. మిడిల్ ఈస్ట్ యుద్ధం ఇలాగే ముదిరితే రెండు నెలల తర్వాత ఇండియాలో కూడా ఇంధన రేట్లు పెరిగే ముప్పుంది.

