పశ్చిమాసియా రణరంగంలో ఒక ఊహించని మలుపు! అగ్రరాజ్యాల దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. ఇరాన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా, అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరుగుతున్న ఈ భీకర యుద్ధాన్ని కావాలనే మరింత సుదీర్ఘంగా లాగుతూ గ్లోబల్ టెన్షన్ పెంచుతోంది.
ఆర్థిక ఆంక్షలు, సైనిక దాడులతో ఇరాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, అయినా సరే పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయాలను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకే ఈ యుద్ధాన్ని పొడిగిస్తోందని ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ (CNN) ఒక సంచలన నివేదికలో వెల్లడించింది. భారీ నష్టాలు చవిచూస్తున్నప్పటికీ, ఈ మహా సంగ్రామాన్ని తన దీర్ఘకాలిక వ్యూహాలకు, స్వప్రయోజనాలకు వాడుకోవాలని టెహ్రాన్ పక్కా స్కెచ్ వేసింది. ఇరాన్ ఈ నెత్తుటి యుద్ధాన్ని కావాలనే ఎందుకు పొడిగిస్తోందో చెప్పే ఐదు సంచలన కారణాలు ఇవే.
1. సరికొత్త సామ్రాజ్య స్థాపన.. పశ్చిమాసియాలో పవర్ గేమ్
పశ్చిమాసియాలో ఇన్నాళ్లూ ఉన్న బలాబలాల సమీకరణాలను సమూలంగా మార్చేయాలని ఇరాన్ నాయకత్వం కంకణం కట్టుకుంది. గల్ఫ్ దేశాలకు, అమెరికాకు మధ్య ఉన్న దశాబ్దాల నాటి పొత్తులకు బీటలు వారేలా చేయడమే వారి అసలు లక్ష్యం. ప్రపంచ ఇంధన, ఆర్థిక భద్రత అనేది తమ దేశ స్థిరత్వంతోనే ముడిపడి ఉందని నిరూపించుకోవాలని టెహ్రాన్ పావులు కదుపుతోందని నిపుణులు చెప్పారు. యుద్ధం ముగిసిన తర్వాత ఇరాన్ ఒంటరిగా కాకుండా, పశ్చిమాసియాను శాసించే ఒక ప్రధాన కేంద్ర బిందువుగా మారాలన్నదే వారి అసలు వ్యూహం.
2. చర్చల్లో పైచేయి.. డిమాండ్ల మీద డిమాండ్లు
ఈ యుద్ధాన్ని మరింత కాలం సాగదీయడం ద్వారా, భవిష్యత్తులో జరిగే కాల్పుల విరమణ చర్చల్లో తమ చేతికి ఎదురులేకుండా చూసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఇప్పటికే ఇరాన్ అధికారులు తమ కఠినమైన డిమాండ్ల చిట్టాను సిద్ధం చేశారు. యుద్ధ నష్టపరిహారం, హార్మూజ్ జలసంధిపై కొత్త నియమావళి, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత లాంటి భారీ షరతులను వారు తెరపైకి తెస్తున్నారు. అంతేకాదు, సముద్ర మార్గాల్లో వెళ్లే నౌకలపై 'టోల్ పన్ను' విధించడం లేదా విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడం లాంటి వ్యూహాలకు సైతం పదును పెడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
3. ఆర్థిక దిగ్బంధనమే అతిపెద్ద ఆయుధం
తన శత్రువులకు ఈ యుద్ధం ఒక తలకు మించిన భారంగా మారాలన్నదే ఇరాన్ ప్లాన్. ఇందుకోసం ప్రపంచ ఇంధన మార్కెట్లను ఛిన్నాభిన్నం చేయడమే ప్రధాన ఆయుధంగా ఎంచుకుంది. షిప్పింగ్ మార్గాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై పదేపదే దాడులు చేస్తూ హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఆయిల్ సరఫరాను ఇప్పటికే దారుణంగా దెబ్బతీసింది. ఇరాన్ యుద్ధ వ్యూహం సైనికంగా గెలవడం కాదని, ఈ యుద్ధాన్ని శత్రువులు ఇక భరించలేరు అన్నంత ఖరీదైనదిగా మార్చడమే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీన్నే 'అసమాన యుద్ధం' (asymmetric warfare) అని పిలుస్తారు.
4. శత్రువుల సహనానికి అగ్నిపరీక్ష
యుద్ధం సుదీర్ఘంగా సాగితే అమెరికా, దాని మిత్రదేశాల సహనం నశించిపోతుందని ఇరాన్ బలంగా నమ్ముతోంది. ముఖ్యంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం, గల్ఫ్ ప్రాంతంలో అస్థిరత పెరగడం వల్ల ఆయా దేశాల రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయని అంచనా వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలు ఈ సుదీర్ఘ షాక్‌లను శాశ్వతంగా తట్టుకోలేవని, కాలక్రమేణా ఇది ఇరాన్ చేతికి ఒక బ్రహ్మాస్త్రంలా మారుతుందని నిపుణులు స్పష్టం చేశారు.
5. ప్రాణభయంతోనే ఈ పైశాచిక వ్యూహం
ఈ మొత్తం వ్యూహం వెనుక ఉన్న అంతిమ కారణం.. ఇరాన్ పాలకుల మనుగడ! అగ్ర నాయకుల వరుస హత్యలు, అంతర్గతంగా పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత మధ్య.. ఈ యుద్ధాన్ని సాగదీయడం ద్వారా తమ ఉనికిని, బలాన్ని కాపాడుకోవాలని పాలకులు చూస్తున్నారు. సైనికంగా వికేంద్రీకృత ప్రణాళికలతో (decentralised military plans) సుదీర్ఘ యుద్ధం కోసం ఇరాన్ ముందే సిద్ధమైందని సీఎన్ఎన్ నివేదించింది. నేరుగా విజయం సాధించడం వారి లక్ష్యం కాదు, శత్రువుల గుండెల్లో భయం పుట్టించి, వారిని దారిన పడేలా చేయడమే అసలు స్కెచ్.
ఓడటం ఇష్టం లేదు.. గెలవాల్సిన పనీ లేదు!
ఇరాన్ సైనిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని అమెరికా పదేపదే చెబుతున్నా, టెహ్రాన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దాడులు కొనసాగిస్తూనే ఉంది. నిపుణులు చెప్పినట్లు.. "ఈ యుద్ధంలో ఇరాన్ సైనికంగా గెలవాల్సిన అవసరం లేదు. కానీ మిగతా ప్రపంచం ఈ యుద్ధాన్ని ఇక కొనసాగించలేము అని చేతులెత్తేసేలా చేయడమే ఇరాన్ అసలైన, అంతిమ వ్యూహం!"
Also Read:
H-1B లాటరీ రాలేదా? టెన్షన్ వద్దు.. అమెరికా వెళ్లే 4 మార్గాలివే!హార్మూజ్ మూసుకున్నా డోంట్ కేర్: ఇరాన్‌తో ట్రంప్ సరికొత్త వ్యూహం
దుబాయ్ ఆకాశంలో డ్రోన్ దాడులు: నలుగురికి గాయాలు!
అణుబాంబుల లెక్క ఇదీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చట్టం ఏం చెబుతోంది?
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్: భారత్ ముందస్తు ప్లాన్ ఇదే!

