పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' ట్విస్ట్.. దేశంలో నిజంగానే చమురు అయిపోయిందా?

naveen
By -

పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' భయం


పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' భయం.. జనం గుండెల్లో రైళ్లు: అసలు ఇదంతా ఫేక్ వార్తా? లేక నిజంగానే చమురు అయిపోయిందా?


సస్పెన్స్ థ్రిల్లర్‌ను మించిన టెన్షన్ ఇప్పుడు సగటు వాహనదారుడిని వెంటాడుతోంది! ఒక పక్క ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం మొదలై దాదాపు నెల రోజులు కావొస్తోంది. మరో పక్క ఫిలిప్పీన్స్ లాంటి దేశాల్లో అయితే ఏకంగా పెట్రోల్ దొరక్క 'చమురు అత్యవసర పరిస్థితి' (Oil Emergency) ప్రకటించి చేతులెత్తేశారు. 


కానీ మన దేశంలో మాత్రం.. ఇప్పటివరకు ధరల పెంపూ లేదు, కొరత అన్న మాటా వినిపించలేదు. అంతా ప్రశాంతంగా సినిమా సాగిపోతున్నట్లు అనిపించింది. కానీ.. అనూహ్యంగా కథలో ఒక బిగ్ ట్విస్ట్! గడిచిన మూడు రోజులుగా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆదివారం తర్వాత నుంచి సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. కొన్ని పెట్రోల్ బంకుల్లో హఠాత్తుగా దర్శనమిచ్చిన 'నో స్టాక్' (No Stock) బోర్డులు.. సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ కావడంతో సోమవారానికి పరిస్థితి చేయిజారిపోయింది.


బంకులకు తాళాలు.. ప్రభుత్వానికి చెమటలు! 


మంగళవారం వచ్చేసరికి ఈ టెన్షన్ పీక్స్‌కు చేరింది. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెక్కిరిస్తూ కనిపించాయి. ఇక బుధవారం నాటికి ఇదొక జాతీయ స్థాయి సెన్సేషన్‌గా మారిపోయింది. దీంతో ఉలిక్కిపడ్డ కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు, బంక్ యజమానుల సంఘాలు, పౌర సరఫరా శాఖ అధికారులు.. అందరూ ఆగమేఘాల మీద సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. "అరె బాబూ.. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదు, ఎవరూ ఆందోళన చెందొద్దు" అని మైకులు పట్టుకుని పదే పదే మొత్తుకుంటున్నారు. అయినా సరే.. జనం భయం ముందు, పరిస్థితుల్లో ఏ మార్పూ రాని పరిస్థితి!


మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎందుకు? 


దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల సంగతి కాసేపు పక్కన పెడితే.. మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ, విజయవాడ లాంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లోని పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద ఈ 'నో స్టాక్' బోర్డులు ఎందుకు దర్శనమిస్తున్నాయి? అసలు దీని వెనుక ఉన్న క్రైమ్ స్టోరీ ఏంటి? లోపలికి వెళ్లి విశ్లేషిస్తే.. మైండ్ బ్లాంక్ అయ్యే పలు ఆసక్తికరమైన కారణాలు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం..


కార్పొరేట్ మైండ్ గేమ్! 


తాజాగా కనిపిస్తున్న ఈ కృత్రిమ పెట్రోల్ కొరతకు అసలు కారణం.. చమురు సంస్థలు, బ్యాంకులు అనుసరిస్తున్న 'బ్యాలెన్స్ షీట్' (Balance Sheet) వ్యూహాలేనని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మార్చి నెల వచ్చి, ఆర్థిక సంవత్సరం (Financial Year) ముగింపు దగ్గర పడుతున్న కొద్దీ.. దేశంలోని సంస్థలన్నీ తమ వార్షిక లెక్కల్ని సరిచేసుకునే పనిలో పడతాయి. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లోనూ వాళ్లు ఎప్పటిలానే లెక్కలు తేల్చాలన్న పట్టుదలతో ఉండటమే.. ఈ ఇంధన సరఫరా వ్యవస్థలో తీవ్ర అంతరాయానికి దారితీసిందని చెప్పాలి.


నిజంగానే చమురు కొరత ఉందా? 


వందకు వంద శాతం దేశంలో చమురు నిల్వల కొరత ఏమాత్రం లేదన్న మాటను అటు ప్రభుత్వం, ఇటు చమురు సరఫరా సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. యుద్ధం కారణంగా నౌకలకు చెల్లించే బీమా ప్రీమియాలు అమాంతం 30 నుంచి 50 శాతం పెరిగిపోయాయి. దీంతో మనకు చమురు దిగుమతి ఖర్చు భారీగా పెరిగింది. 


అదే సమయంలో సాధారణ రోజుల్లో కేవలం వారంలో మనకు చేరుకోవాల్సిన ముడి చమురు నిల్వలకు.. ఇప్పుడు సముద్రంలో ఆంక్షల వల్ల 15 నుంచి 20 రోజుల సుదీర్ఘ సమయం పడుతోంది. ఈ ఆలస్యం దేశీయ రిఫైనరీల (Refineries) మీద స్టాక్ ఒత్తిడి పెంచుతోంది. అయితే.. ఇప్పటికిప్పుడు ఇది మన బండ్లలో పెట్రోల్ ఆగిపోయేంత ప్రభావం చూపే పరిస్థితి లేదు. ఇలాగే దీర్ఘకాలంగా యుద్ధం సాగి, సరఫరా మరింత లేట్ అయితే తప్పితే.. మనకు ఎలాంటి ఇబ్బందులు రావు.


మరి.. ఆ 'నో స్టాక్' బోర్డుల కథేంటి? 


పెట్రోల్ బంకుల్లో నిల్వలు లేకపోవటానికి అసలు కారణం.. చమురు కంపెనీల వద్ద స్టాక్ లేకపోవడం కాదు! ఇదే విషయాన్ని చమురు సంస్థలు పదే పదే గొంతు చించుకుని స్పష్టం చేస్తుండటమే దీనికి నిదర్శనం. అదే సమయంలో పెట్రోల్ బంకుల యజమానుల సంఘాల నేతలు కూడా ఇదే సీక్రెట్ చెబుతున్నారు.


అసలు సమస్య ఎక్కడ మొదలైంది? క్లైమాక్స్ ట్విస్ట్ ఇదే! 


అసలు సమస్య అంతా ఈ ఆర్థిక సంవత్సరం (ప్రతి ఏడాది మార్చి 31 నాటికి ముగిసేది) ముగింపునకు వర్తించే కఠినమైన నిబంధనల్లోనే ఉండిపోయింది. మామూలు రోజుల్లో బంక్ డీలర్లకు చమురు మార్కెటింగ్ సంస్థలు కొన్ని రోజుల 'రుణ పరిమితి' (Credit) ఇస్తాయి. అంటే ముందు డబ్బులు కట్టకపోయినా పెట్రోల్ పంపుతాయి. కానీ.. మార్చి నెల చివర వచ్చేసరికి మాత్రం ఈ క్రెడిట్‌ను నిర్దాక్షిణ్యంగా తగ్గిస్తాయి. మార్చి రెండో వారం తర్వాత నుంచి ముందస్తుగా డబ్బులు (Cash) చెల్లిస్తేనే స్టాక్ రిలీజ్ చేస్తాయి.


నిజానికి ఈ రూల్ కొత్తదేం కాదు. చాలామంది బంక్ డీలర్లు వెంటనే అంత నగదు సర్దుబాటు చేసుకోలేక కొత్త ఆర్డర్లు పెట్టలేకపోతారు. మామూలు రోజుల్లో అయితే ఇది పెద్ద సమస్యే కాదు. కానీ, ఎక్కడో యుద్ధం జరుగుతోందన్న భయాందోళనలు ఉన్న ఇలాంటి టైమ్‌లో మాత్రం.. ఈ చిన్న టెక్నికల్ ఇష్యూ ఒక భూతంలా మారి, లేని కొరతను సృష్టిస్తోంది. ఇప్పుడు జరిగింది కూడా అక్షరాలా అదే! పెట్రోల్ బంకు యజమానులు సకాలంలో క్యాష్ సర్దుబాటు చేయటంలో జరిగిన తప్పులే.. బయట 'నో స్టాక్' బోర్డులు దర్శనమిచ్చేలా చేశాయి.


ప్యానిక్ బయ్యింగ్.. జనం చేసిన అతిపెద్ద తప్పు! 


ఇక ఈ స్టోరీలో మన జనం చేసిన పని కూడా ఏమాత్రం తక్కువ కాదు. సాధారణ రోజుల్లో అయితే బంక్‌కు వెళ్లి వంద రూపాయలకు పెట్రోల్ కొట్టించుకునే టూవీలర్ వ్యక్తి.. ఎప్పుడైతే రేపు 'పెట్రోల్ దొరకదు' అన్న పుకారు విన్నాడో, వెంటనే బంక్‌కు వెళ్లి ఫుల్ ట్యాంక్ (రూ. వెయ్యి) కొట్టిస్తాడు. ఒకళ్లు, ఇద్దరు అలా చేస్తే ఫర్లేదు. కానీ లక్షలాది మంది జనం ఒకేసారి బంకుల మీద పడి అలా ట్యాంకులు ఫుల్ చేస్తే ఏమవుతుంది? బంకుల్లో ఉన్న నిల్వలన్నీ క్షణాల్లో ఖాళీ అవుతాయి. ఇప్పుడు జరిగింది కూడా అచ్చం అదే. దీన్నే ఆర్థిక పరిభాషలో 'ప్యానిక్ బయ్యింగ్' (Panic Buying) అంటారు. తక్షణమే అవసరం లేకున్నా.. భవిష్యత్తులో దొరకదేమోనన్న భయంతో ముందుగానే కొనేసి ఉంచుకోవడం!


బ్యాంకుల చేతివాటం.. డీలర్లకు తలనొప్పి! 


ఈ హై-డ్రామాలో బ్యాంకుల పాత్ర కూడా ఒక రేంజ్‌లో ఉంది. మామూలుగా చమురు డీలర్లు బ్యాంకుల నుంచి స్వల్పకాలిక రుణాలు (Short term loans) తీసుకుని, చమురు సంస్థలకు ఆ డబ్బు చెల్లిస్తూ వ్యాపారం నడుపుతూ ఉంటారు. కానీ.. మార్చి నెల ఆర్థిక సంవత్సరం చివర్లో బ్యాంకులు సైతం తమ రుణాలను బ్యాలెన్స్ షీట్‌లో వీలైనంత తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తాయి. ఇందులో భాగంగా పాత బకాయిలన్నీ క్లియర్ అయ్యేలా చూసుకోవడంతో పాటు.. బంకులకు కొత్త రుణాలు ఇవ్వకుండా తాత్కాలికంగా బ్రేక్ వేస్తాయి. ఈ పరిస్థితి చివరకు ఆ పెట్రోల్ బంకు యజమానులకు ఊపిరిసలపని తలనొప్పిగా మారింది.


ఇలాంటి టెక్నికల్ కారణాలు అన్నీ ఒకేసారి కలగలిసి.. చివరకు సామాన్యుడిని భయపెట్టేలా బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిచ్చేలా చేశాయి. 


దేశంలో చమురు నిల్వలకు ఢోకా లేదు.. టెన్షన్ పడి ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవాల్సిన పనీ లేదు! రిలాక్స్ బాస్!!