క్రికెట్ మైదానంలో మరోసారి దొంగదెబ్బ! పాకిస్థాన్ క్రికెట్‌ను మళ్లీ కుదిపేస్తున్న పాత జాఢ్యం... బాల్ టాంపరింగ్! జెంటిల్మన్ గేమ్ అని పిలుచుకునే ఈ క్రీడలో అడ్డదారులు తొక్కిన ఒక స్టార్ బ్యాటర్‌పై ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గెలుపు కోసం పాక్ క్రికెటర్లు ఆడిన ఆట ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) లో ఆదివారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కు (బంతి ఆకారాన్ని మార్చడం) పాల్పడినట్లు తేలడంతో, లాహోర్ ఖలందర్స్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన చర్యలు తీసుకుంది. అతడిని తదుపరి రెండు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.14ను ఉల్లంఘించినందుకు గాను ఫఖర్‌పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎస్ఎల్ ఒక అధికారిక మీడియా ప్రకటనలో స్పష్టం చేసింది. దీన్ని 'లెవల్ 3' నేరంగా నిర్ధారించారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఫఖర్ తీవ్రంగా ఖండించాడు. కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం జరిగిన పూర్తి స్థాయి క్రమశిక్షణా విచారణలో తనపై మోపిన ఛార్జీలను అతడు సవాలు చేశాడు.
మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ అన్ని ఆధారాలను, వీడియో ఫుటేజీలను నిశితంగా పరిశీలించిన తర్వాతే ఈ కఠినమైన తీర్పును వెలువరించారు. తన ఆరోపణలను నిరాకరిస్తున్న ఫఖర్ జమాన్‌కు.. మ్యాచ్ రిఫరీ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి ఇప్పుడు కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉంది.
ఆఖరి ఓవర్లో అసలు నాటకం!
మ్యాచ్ అప్పటికే రసవత్తర దశకు చేరుకుంది. లాహోర్ ఖలందర్స్ విజయానికి ఆఖరి ఓవర్లో కరాచీ జట్టు 14 పరుగులు చేయకుండా ఆపాలి. సరిగ్గా ఆ ఉత్కంఠభరితమైన సమయంలోనే మైదానంలో హైడ్రామా మొదలైంది. కెప్టెన్ షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్ సహా పలువురు లాహోర్ ఆటగాళ్లు గుంపుగా ఒక్కచోట చేరారు.
అంపైర్ చూస్తుండగానే బంతిని తమ చేతుల్లోకి పదేపదే తీసుకుంటూ అనుమానాస్పదంగా వ్యవహరించారు. ఈ వింత ప్రవర్తనను పసిగట్టిన ఆన్-ఫీల్డ్ అంపైర్ వెంటనే రంగంలోకి దిగి పాత బంతిని పక్కనపెట్టి, రీప్లేస్‌మెంట్ బంతిని తీసుకురావాలని ఆదేశించాడు. ఈ గందరగోళం మధ్య ఫోర్త్ అంపైర్ కూడా మైదానంలోకి అడుగుపెట్టాడు.
బంతి ఆకారాన్ని, దాని సహజత్వాన్ని ఉద్దేశపూర్వకంగానే మార్చారని అధికారులు నిర్ధారించారు. దానికి శిక్షగా లాహోర్ జట్టుకు ఏకంగా ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. ఇక్కడే అసలు ఆట తలకిందులైంది! ఆఖరి ఓవర్లో 14 పరుగులు డిఫెండ్ చేసుకోవాల్సిన లాహోర్ ముందు, ఈ పెనాల్టీ దెబ్బతో ఇప్పుడు కేవలం 9 పరుగుల లక్ష్యం మాత్రమే మిగిలింది. ఈ నిర్ణయంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయి, కరాచీ కింగ్స్ ఎంతో సులభంగా ఛేజింగ్‌ను పూర్తి చేసి అద్భుత విజయాన్ని అందుకుంది.
గతంలోనూ ఫఖర్ బాగోతం?
ఈ తాజా వివాదంతో ఫఖర్ జమాన్ గతం కూడా ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తోంది. 2024లో డల్లాస్ వేదికగా జరిగిన ఐసీసీ (ICC) పురుషుల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, అమెరికా మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ మ్యాచ్‌లో ఫఖర్ తన జెర్సీ కింద బంతిని విచిత్రంగా దాచుకోవడం తీవ్ర కలకలం రేపింది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం, ఆ సమయంలో అమెరికా ఆటగాళ్లు వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. అప్పట్లో ఎలాంటి అధికారిక చర్య తీసుకోలేదు. కానీ తాజా ఉదంతంతో ఆ పాత ఆరోపణలు మళ్లీ అతడిని వెంటాడుతున్నాయి.
పాకిస్థాన్ క్రికెట్‌లో..
పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో మ్యాచ్ ఫిక్సింగ్ ఎంతటి దుమారం రేపిందో, ఈ బాల్ టాంపరింగ్ కూడా అంతే స్థాయిలో మచ్చలు మిగిల్చింది. మ్యాచ్ ఫిక్సింగ్ అంత ప్రాచుర్యం పొందకపోయినా, ఈ రుగ్మత పాక్ క్రికెట్‌లో దశాబ్దాలుగా పాతుకుపోయింది. 1980ల నుంచి 2000ల దశాబ్దం వరకు ఎంతోమంది ప్రముఖ పాకిస్థాన్ క్రికెటర్లపై ఈ బాల్ టాంపరింగ్ చేసే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆశ్చర్యకరంగా, అప్పట్లో ఈ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో కేవలం కొద్ది మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి.
క్రీడాస్ఫూర్తితో గెలవాల్సిన ఆటలో, ఇలా దొంగదెబ్బలు తీసి బాల్ టాంపరింగ్‌కు పాల్పడటం కేవలం ఒక ఆటగాడి కెరీర్‌నే కాదు.. యావత్ దేశ క్రికెట్ ప్రతిష్ఠను ఎలా మసకబారుస్తుందో ఫఖర్ జమాన్ ఉదంతం మరోసారి క్రికెట్ ప్రపంచానికి కళ్లకు కట్టింది!
Also Read:
రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం: చెన్నై సూపర్ కింగ్స్ కకావికలం!నసీమ్ షాకు పీసీబీ భారీ షాక్: రూ. 68 లక్షల జరిమానా!
పీఎస్ఎల్లో బాల్ టాంపరింగ్ కలకలం.. ఫఖర్ జమాన్‌పై సంచలన ఆరోపణలు!
13 ఏళ్ల శాపవిమోచనం.. రోహిత్ వీరవిహారంతో ముంబైకి రికార్డు విజయం!
ముంబైకి షాక్.. వాంఖడేలో కేకేఆర్ పరుగుల సునామీ! 220 టార్గెట్

.webp)