Iran Israel War: ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ 15 మంది భారతీయులు

naveen
By -

ఎక్కడో ఇరాన్, ఇజ్రాయెల్ కొట్టుకుంటే మనకేంటిలే అని లైట్ తీసుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. గల్ఫ్ దేశాల్లో రగులుతున్న యుద్ధం.. రేపు ఉదయం మీరు కొట్టించే పెట్రోల్ ధరను అమాంతం పెంచేయబోతోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడంతో.. ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి 'హర్మూజ్ జలసంధి'ని (Strait of Hormuz) ఇరాన్ మూసివేసింది. అంతటితో ఆగకుండా ఒక ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో 15 మంది భారతీయులు చిక్కుకోవడం కలకలం రేపుతోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఈ పరిణామం సామాన్యుడి జేబుకు ఎలా చిల్లు పెట్టబోతోందో చూద్దాం.


Iran Israel War


చమురు గుండెకాయ బంద్.. ఇరాన్ ప్రతీకారం!


ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోవడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారంగా ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా ఉన్న వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ సాయుధ బలగాలు సంచలన ప్రకటన చేశాయి.


ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే హర్మూజ్ జలసంధి సమీపంలో దాడులు మొదలయ్యాయి. పలావు దేశ జెండాతో వెళ్తున్న 'స్కైలైట్' అనే ఆయిల్ ట్యాంకర్‌పై ఒమన్‌లోని ఖసాబ్ పోర్టు (ముసాండమ్ ద్వీపకల్పం) వద్ద ఇరాన్ బలగాలు దాడి చేశాయి.


ప్రాణాలతో బయటపడ్డ 15 మంది భారతీయులు


ఈ దాడి జరిగిన సమయంలో ఆ నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా, అందులో 15 మంది మన భారతీయులే కావడం గమనార్హం. మిగిలిన ఐదుగురు ఇరాన్ జాతీయులు. ఈ ఘటనలో నలుగురు గాయపడగా, ఒమన్ అధికారులు స్పందించి వారందరినీ సురక్షితంగా రక్షించారు.


అయితే, అమెరికా వాదన మరోలా ఉంది. దాడికి గురైన ఆ నౌక ఇరాన్ చమురును దొంగచాటుగా రవాణా చేసే 'షాడో ఫ్లీట్'లో భాగమని, దానిపై ఇప్పటికే తాము ఆంక్షలు విధించామని అమెరికా (USA) చెబుతోంది.


తటస్థ దేశం ఒమన్‌పైనా దాడులు.. ట్రంప్ వార్నింగ్


సాధారణంగా గల్ఫ్ గొడవల్లో ఒమన్ చాలా తటస్థంగా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఒమన్ భూభాగంపై కూడా దాడులు జరగడం (దుక్మ్ పోర్టుపై డ్రోన్ దాడులు) పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘటనతో గల్ఫ్‌లో ఉన్న వేలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళన మొదలైంది.


ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ఏమాత్రం ఎదురుదాడికి దిగినా.. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భయంకరమైన ప్రతిస్పందన ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే ఇరాన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.


పెట్రోల్ రేట్లకు రెక్కలు.. భారతీయులకు టెన్షన్!


హర్మూజ్ జలసంధి మూసివేత అంటే ప్రపంచ చమురు మార్కెట్ గొంతు నొక్కడమే! ఇది ఇలాగే మరో వారం రోజులు కొనసాగితే.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఆ ప్రభావంతో ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమనడం, నిత్యావసరాల రేట్లు పెరగడం ఖాయం. ఒక సామాన్యుడిగా రాబోయే రోజుల్లో ఆర్థిక భారానికి సిద్ధపడక తప్పదు. అలాగే భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి, మిడిల్ ఈస్ట్‌లో ఉన్న మన భారతీయుల భద్రతకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది!