పశ్చిమాసియాలో మరో భారీ యుద్ధం తప్పదా? అమెరికా, ఇరాన్ మధ్య మాటల తూటాలు పేలుతుంటే ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఒకవైపు సముద్రంలో యుద్ధ నౌకలను మోహరిస్తూనే.. మరోవైపు చర్చల పేరుతో దౌత్యం నడుపుతున్న అమెరికా అసలు ప్లాన్ ఏంటి? తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ఇరాన్ పాలకులకు ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. "మా సైనిక చర్యలను జోక్‌గా తీసుకోవద్దు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి?
చెత్త పాలకుల చేతుల్లో అణ్వాయుధాలా?
ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ ఇరాన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "చెత్త పాలకుల చేతుల్లో అణ్వాయుధాలు ఉండటం ప్రపంచానికే అతిపెద్ద ప్రమాదం" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మేము చర్చలకు పిలుస్తున్నాం కదా అని దాన్ని బలహీనతగా చూడొద్దని ఇరాన్‌ను హెచ్చరించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నారని, కానీ అవసరమైతే సైనిక పరమైన 'ఆప్షన్స్' (Military Actions) వాడటానికి వెనుకాడబోమని వాన్స్ స్పష్టం చేశారు. పరిస్థితి చేయి దాటితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని టెహ్రాన్‌కు అల్టిమేటం జారీ చేశారు.
జెనీవాలో కీలక చర్చలు.. భవిష్యత్తు ఏంటి?
ఇంత ఉద్రిక్తతల మధ్య కూడా ఇరు దేశాలు దౌత్య మార్గాలను మాత్రం మూసివేయలేదు. అణు ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే రెండు రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి. నేడు (గురువారం) జెనీవాలో అత్యంత కీలకమైన మూడో రౌండ్ చర్చలు ప్రారంభం కానున్నాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ (Abbas Araghchi) తన బృందంతో ఇప్పటికే జెనీవా చేరుకున్నారు. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ నేతృత్వంలోని అమెరికా బృందంతో వీరు భేటీ కానున్నారు. యుద్ధ నౌకల నీడలో జరుగుతున్న ఈ చర్చలు సఫలమవుతాయా? లేక విఫలమై యుద్ధానికి దారితీస్తాయా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఒప్పందం సాధ్యమేనా?
టెహ్రాన్‌తో ఒక మంచి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఇంకా ఉందని జేడీ వాన్స్ అభిప్రాయపడ్డారు. కానీ, ఇరాన్ తన అణ్వాయుధ ఆకాంక్షలను పక్కనపెట్టి, అమెరికా షరతులకు తలొగ్గితేనే ఇది సాధ్యమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. లేదంటే పశ్చిమాసియా మరో రావణకాష్టంలా మారడం ఖాయం.
బంతి ఇరాన్ కోర్టులో ఉంది!
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాటల్లో మెతకదనం ఉన్నా చేతల్లో మాత్రం కఠినంగా ఉంటుందన్న విషయం ఇరాన్‌కు బాగా తెలుసు. ఆర్థిక ఆంక్షలతో ఇప్పటికే సతమతమవుతున్న ఇరాన్, ఇప్పుడు అమెరికా సైనిక చర్యను తట్టుకునే శక్తి ఉందా? అన్నది ఆలోచించుకోవాలి. ఈ రోజు జెనీవాలో జరిగే చర్చలే పశ్చిమాసియా శాంతికి చివరి అవకాశం కావచ్చు. ఇరాన్ మొండికేస్తే.. ప్రపంచం మరో యుద్ధాన్ని చూడక తప్పదు!

