మన విశాఖపట్నంలో పని ముగించుకుని వెళ్తున్న ఒక ఇరాన్ యుద్ధ నౌకను.. శ్రీలంక తీరం సమీపంలో అమెరికా జలాంతర్గామి పేల్చేయడం ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సముద్రం ఏ ఒక్క దేశం సొత్తు కాదు కదా.. మరి అమెరికా అంతర్జాతీయ జలాల్లోకి వచ్చి ఈ దాడి ఎలా చేసింది? అసలు సముద్రాలపై పెత్తనం ఎవరిది? ఐక్యరాజ్యసమితి చట్టాలు ఏం చెబుతున్నాయి? మన పొరుగునే హిందూ మహాసముద్రంలో జరుగుతున్న ఈ దాడులతో సరుకుల రవాణా ఆగిపోయి.. రేపు మన నిత్యావసరాలు, పెట్రోల్ రేట్లు ఎలా భగ్గుమంటాయో సామాన్యులు కచ్చితంగా తెలుసుకోవాలి.
అసలు సముద్రాలపై ఎవరి కంట్రోల్ ఉంటుంది?
సముద్రాలపై ఆధిపత్యం గురించి ఐక్యరాజ్యసమితి (UNCLOS - United Nations Convention on the Law of the Sea) చట్టాలు చాలా స్పష్టమైన నిబంధనలు పెట్టాయి. దీని ప్రకారం సముద్ర జలాలను మూడు రకాలుగా వర్గీకరించారు:
- ప్రాదేశిక జలాలు (Territorial Waters): ఒక దేశ తీరం నుంచి సముద్రంలోకి 12 నాటికల్ మైళ్ల (సుమారు 22 కి.మీ) వరకు ఇది ఉంటుంది. ఇక్కడ ఆ దేశానిదే పూర్తి ఆధిపత్యం. గగనతలం, సముద్ర గర్భం అన్నీ వాళ్లవే. విదేశీ నౌకలు కేవలం 'ఇన్నోసెంట్ ప్యాసేజ్' (ఎలాంటి హాని తలపెట్టకుండా) కింద మాత్రమే ఇక్కడి నుంచి వెళ్లాలి.
- ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (EEZ): దేశ తీరం నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు ఈ జోన్ ఉంటుంది. ఇక్కడ సముద్ర సంపదను (చేపలు, ఖనిజాలు తవ్వకాలు) వాడుకునే హక్కు ఆయా దేశానికే ఉంటుంది. కానీ విదేశీ నౌకలు ఇక్కడి నుంచి స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు.
- అంతర్జాతీయ జలాలు (High Seas): పైన చెప్పిన సరిహద్దులు దాటాక ఉండే సముద్రాన్ని అంతర్జాతీయ జలాలు అంటారు. ఇవి ఏ ఒక్క దేశానికీ చెందవు. చట్టాలకు లోబడి ఏ దేశమైనా ఇక్కడ ప్రయాణించవచ్చు. దీన్నే 'గ్లోబల్ కామన్స్' అని కూడా పిలుస్తారు. సరిగ్గా ఇక్కడే ఇరాన్ నౌక 'ఐరిస్ డెనా'ను అమెరికా పేల్చేసింది.
శ్రీలంక తీరంలో టెన్షన్.. 148 మంది గల్లంతు!
మన విశాఖపట్నంలో జరిగిన మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొని తిరిగి ఇరాన్ వెళ్తున్న 'ఐరిస్ డెనా' నౌక.. శ్రీలంక (కొలంబో) సెర్చ్ అండ్ రెస్క్యూ జోన్ పరిధిలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా జలాంతర్గామి దాడికి గురైంది.
నౌక మునిగిపోవడంతో 32 మందిని శ్రీలంక నేవీ రక్షించింది. కానీ ఇంకా 148 మంది నావికుల ఆచూకీ దొరకకపోవడంతో వారు బతికి ఉండే అవకాశాలు చాలా తక్కువని అధికారులు భావిస్తున్నారు.
అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ దాడిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా మండిపడ్డారు. ఇది సముద్రంపై జరిగిన "దారుణమైన దాడి" అని అభివర్ణించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అమెరికా చేసిన ఈ ద్రోహానికి తీవ్ర మూల్యం (Bitterly Regret) చెల్లించుకోక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇక ఈ దాడి దెబ్బకు భయపడిన శ్రీలంక ప్రభుత్వం.. ఆ ప్రాంతంలో ఉన్న మరో ఇరాన్ నౌకలోని 208 మంది సిబ్బందిని ముందుజాగ్రత్త చర్యగా ట్రింకోమలి పోర్టుకు సురక్షితంగా తరలించింది.
అంతర్జాతీయ జలాల్లో (High Seas) స్వేచ్ఛగా ప్రయాణిస్తున్న ఒక దేశ యుద్ధ నౌకను మరో దేశం పేల్చేయడం అంటే.. ప్రపంచ వాణిజ్య నియమాలను, సముద్ర చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కడమే! ఇండియాకు అత్యంత కీలకమైన వాణిజ్య మార్గమైన హిందూ మహాసముద్రంలో ఈ మారణహోమం జరగడం కచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పే. సముద్ర మార్గాల్లో ఇలాంటి దాడులు పెరిగితే.. ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఆగిపోయి, కంటైనర్ల రవాణా ఖర్చు వందల రెట్లు పెరిగిపోతుంది. ఆ భారం పడేది సామాన్యుడి జేబు మీదే.

