Dacoit Telugu Movie Review : ఎప్పుడూ మైండ్ బ్లాంక్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్లతో థియేటర్లను షేక్ చేసే అడివి శేష్.. ఈసారి రూట్ మార్చాడు! గన్ పట్టుకుని యాక్షన్ చేస్తూనే, గుండెను పిండేసే ఒక ఇంటెన్స్ ప్రేమకథతో ఏప్రిల్ 10న 'డెకాయిట్'గా మన ముందుకు వచ్చేశాడు. పక్కా కమర్షియల్ హంగులతో, మృణాల్ ఠాకూర్ గ్లామర్, యాక్షన్ తో రూపొందిన ఈ సినిమాపై ఎప్పటినుంచో భారీ అంచనాలు ఉన్నాయి. శేష్-మృణాల్ కెమిస్ట్రీ ఎలా పండింది? ఈ 'డెకాయిట్' నిజంగానే బాక్సాఫీస్ వద్ద దోపిడీ మొదలుపెట్టాడా? ఈ కంప్లీట్ రివ్యూ చదివి మీరే డిసైడ్ అవ్వండి!
కథా నేపథ్యం.. విడిపోయిన ప్రేమ, అనుకోని మలుపులు
హరిదాస్ అలియాస్ హరి (అడివి శేష్), జూలియట్ అలియాస్ సరస్వతి (మృణాల్ ఠాకూర్) ప్రాణంగా ప్రేమించుకుంటారు. కష్టసుఖాల్లో జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలని కలలు కంటారు.
కానీ విధి వాళ్ళతో ఓ భయంకరమైన ఆట ఆడుతుంది. అనుకోని పరిస్థితుల్లో హరి జైలు పాలవుతాడు. అదే సమయంలో సరస్వతికి వేరొకరితో బలవంతంగా పెళ్లి జరిగిపోతుంది.
అలా పూర్తిగా విడిపోయిన ఈ ఇద్దరు మాజీ ప్రేమికులు మళ్లీ ఎలా కలుసుకున్నారు? ఒక ఉమ్మడి లక్ష్యం కోసం వీళ్లిద్దరూ మళ్లీ ఎందుకు ఒక్కటయ్యారు? అన్నదే ఈ 'డెకాయిట్' అసలు కథ.
శేష్ మార్క్ ట్విస్టులు.. అదిరిపోయే యాక్షన్
అడివి శేష్ గత సినిమాల్లాగా ఇందులో మెదడుకు పనిచెప్పే సంక్లిష్టమైన కథేమీ ఉండదు. కథ చాలా సింపుల్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా సాగుతుంది. కానీ తనదైన మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను ఎంగేజింగ్‌గా మలిచారు.
ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ రెండు సాలిడ్ ట్విస్టులు మాత్రం మీ మైండ్ బ్లాంక్ చేస్తాయి. కథ చాలా సింపుల్ గా ముగుస్తుందేమో అనుకునే టైంలో, ఈ ట్విస్టులు మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తాయి.
సెకండ్ హాఫ్ లో డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్స్, ఛేజ్ సీక్వెన్సులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇక 'కన్నెపెట్టారో' సాంగ్ రీమిక్స్ కు తోడుగా పడే టైటిల్ కార్డ్ సీక్వెన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.
అదరగొట్టిన శేష్, మృణాల్ మ్యాజిక్
ఈ సినిమాను అడివి శేష్, మృణాల్ ఠాకూర్ తమ భుజాలపై వేసుకుని నడిపించారని చెప్పాలి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రాణం పోశాయి.
ఎప్పటిలాగే తన ట్రేడ్ మార్క్ స్టైల్ తో ఆకట్టుకున్న శేష్.. ఎమోషనల్ సీన్స్ లోనూ తన నటనలో ఎంతో మెరుగుదల చూపించాడు. ఇక మృణాల్ ఠాకూర్ తన పాత్రలో ఒదిగిపోయింది. సందర్భాన్ని బట్టి రూట్ మార్చే పాత్రలో అద్భుతంగా నటించి, తాను కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదు, గొప్ప పర్ఫార్మర్ అని మళ్లీ నిరూపించింది.
సహాయ నటుల పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, నటి కామాక్షి భాస్కర్ల తమదైన ముద్ర వేసి ప్రేక్షకులకు గట్టి ఇంపాక్ట్ ఇస్తారు.
నెమ్మదించిన ఫస్ట్ హాఫ్
అయితే ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. శేష్ సినిమాల నుంచి ప్రేక్షకులు ఆశించే అవుట్-ఆఫ్-ది-బాక్స్ కాన్సెప్ట్ ఇందులో మిస్సయ్యింది. విడిపోయిన ఇద్దరు ప్రేమికులు ఒక లక్ష్యం కోసం కలిసే రొటీన్ ఫార్ములా కథే కావడం కాస్త నిరాశపరుస్తుంది.
అక్కడక్కడా నెమ్మదించిన కథనం సినిమా ఓవరాల్ ఫీల్ ను తగ్గిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో పాత్రలను, అసలు కాన్‌ఫ్లిక్ట్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఇక్కడ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది.
భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్, సింగర్ జోనితా గాంధీ కాంబినేషన్‌లో ఎంతో హైప్ క్రియేట్ చేసిన స్పెషల్ సాంగ్ ఆశించిన స్థాయిలో పేలలేదు. అలాగే శేష్ చెప్పిన రాయలసీమ యాస అంతగా ఆకట్టుకోలేదు, దానికి తోడు కొన్ని డైలాగ్స్ డబ్బింగ్ సరిగ్గా సెట్ కాలేదు.
టెక్నికల్ బ్రిలియన్స్..
భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు డీసెంట్ గా ఉన్నాయి. కానీ యాక్షన్ ఘట్టాల్లో గ్యాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్లింది.
దనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్. ఛేజ్, యాక్షన్ సీక్వెన్సులను తెరకెక్కించిన విధానం ఎక్సలెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.
తొలి సినిమానే అయినా దర్శకుడు షనీల్ డియో పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. శేష్ తో కలిసి తను రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాను కాపాడింది. అయితే కొన్ని సీన్స్ కు సరైన ముగింపు లేనట్లుగా, క్లారిటీ మిస్సయినట్లుగా అనిపిస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే 'డెకాయిట్' మంచి మూమెంట్స్ తో నిండిన ఒక బలమైన రొమాంటిక్ యాక్షన్ డ్రామా. కథలో కొత్తదనం లేకపోయినా.. శేష్-మృణాల్ పర్ఫార్మెన్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులు మిమ్మల్ని సీట్లకు కట్టిపడేస్తాయి. కొన్ని స్లో మూమెంట్స్, డబ్బింగ్ లోపాలు ఉన్నప్పటికీ.. థియేటర్లలో ఒక ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేయాలనుకునే ప్రతి సగటు ప్రేక్షకుడికి 'డెకాయిట్' కచ్చితంగా పైసా వసూల్ ఎంటర్టైనర్!
రేటింగ్: 3.25/5
Also Read:
Dacoit Pre Release Event: మృణాళ్‌కు సుమంత్ సారీRenu Desai Cyber Crime: సైకో ట్రోలర్స్‌కు రేణు వార్నింగ్
Bhanupriya Health Condition: మతిస్థిమితం కోల్పోయారన్నది అబద్ధం..
టోక్యోలో రష్మిక మందానా రికార్డ్: యానిమే అవార్డ్స్‌లో సత్తా!
Raakasa Telugu Movie Review | రాకాస మూవీ రివ్యూ: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కామెడీ!

