తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్! మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారా? సొంతగూటికి.. అంటే తిరిగి కారెక్కబోతున్నారా? కరీంనగర్‌లో వెలసిన పోస్టర్లు రేపిన ఈ పొలిటికల్ సునామీకి ఇప్పుడు ఈటల స్వయంగా బ్రేక్ వేశారు. పుకార్ల మేఘాలను చీల్చుకుంటూ.. తనదైన శైలిలో సింహగర్జన చేశారు.
బట్టలు మార్చినంత ఈజీ కాదు!
శామీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ ఈ పార్టీ మార్పు పుకార్లపై నిప్పులు చెరిగారు. తాను పార్టీ మారే పరిస్థితే లేదని కుండబద్దలు కొట్టారు. రాజకీయాల్లో పార్టీలు మారడం అంటే.. రోజువారీ దుస్తులు మార్చినంత సులభం కాదని ఆయన ఘాటుగా స్పందించారు. కరీంనగర్‌లో కొందరు తనపై పోస్టర్లు వేసి, పనికట్టుకుని ఆరోపణలు చేయడం తన మనసును తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మెడబట్టి గెంటేసిన వాళ్ల దగ్గరికే మళ్లీ వెళ్తానా?
కేసీఆర్ తనను బీఆర్ఎస్ నుంచి గెంటేసి ఐదేళ్లు అవుతోందని ఈటల గుర్తుచేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా.. ఆనాడు తనను బీఆర్ఎస్ మెడలు పట్టి బయటకు గెంటేసిందని ఆయన ఆవేదనగా చెప్పారు. తనతో పాటు జీవన్ రెడ్డి, బొడిగె శోభా కూడా బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటూ కొందరు పోస్టర్లు అంటించడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణ సమాజానికి తన గురించి పూర్తిగా తెలుసన్న ఈటల.. ఇరవై ఏళ్ల పాటు తాను ఆ పార్టీలో ఉన్నానని, అక్కడి నేతలతో సహజంగానే పరిచయాలు ఉంటాయని తెలిపారు. పాత మిత్రులతో మాట్లాడితే.. పార్టీ మారడానికి రెడీ అయ్యానని రాతలు రాయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
"నన్ను బర్తరఫ్ చేయడమే కాకుండా.. నన్ను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. నా కోళ్ల ఫారాలు కూల్చారు. లీగల్‌గా కొన్న భూములు కూడా దౌర్జన్యంగా గుంజుకున్నారు. అలాంటి పార్టీలోకి మళ్లీ వెళ్తానని పిచ్చి ప్రచారాలు చేయొద్దు.. అక్కడికి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు" అని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్‌లోకి వెళ్లి ఉంటే డిప్యూటీ సీఎం అయ్యేవాడిని!
రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఈటల విశ్లేషించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే మీడియాను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరగబోయే ఎన్నికలపై తాము సర్వేలు చేస్తున్నామని, అవన్నీ బీజేపీకి పూర్తి అనుకూలంగా, పాజిటివ్‌గా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం అధికారం, ఆధిపత్యం కోసం మాత్రమే కొందరు నాయకులు పక్క పార్టీల్లోకి దూకుతారని ఆయన విమర్శించారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం తనను పార్టీలోకి రావాలని కోరారని.. అడిగిన మంత్రి పదవి ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారని ఈటల గుర్తుచేశారు. కానీ, తాను కమిట్‌మెంట్‌తో తెలంగాణ ఉద్యమంలోనే కొనసాగానని స్పష్టం చేశారు.
"మనందరి ఉమ్మడి లక్ష్యం కేసీఆర్‌ను ఓడగొట్టడమే కాబట్టి.. రాజగోపాల్ రెడ్డి, తుమ్మల, జూపల్లి, వివేక్ లాంటి వాళ్లు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి పోదాం అని పిలిచారు. ఒకవేళ నేను ఆనాడు కాంగ్రెస్‌లోకి వెళ్లి ఉంటే.. ఈపాటికి మంత్రినో, డిప్యూటీ సీఎంనో అయ్యేవాడిని. కానీ నేను ఏనాడూ పదవుల కోసం పాకులాడను" అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
అధికార వ్యామోహానికి తలొగ్గని తన వ్యక్తిత్వాన్ని, నిబద్ధతను మరోసారి చాటిన ఈటల తాజా వ్యాఖ్యలు.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Also Read:
HYDRAA Updates : యూఎల్సీ ఖాళీ ప్లాట్ల జోలికి వెళ్లం.. సామాన్యులకు హైడ్రా తీపికబురు!Singareni Workers : సింగరేణిపై ఏసీబీ విచారణా? భట్టి విక్రమార్కపై కవిత ఫైర్!
Fridge Blast: నిర్మల్‌లో ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి
Greenfield Highway: కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేతో ఇక సూపర్ ఫాస్ట్ జర్నీ!
TGSRTC Bus Terminal: గాజులరామారంలో 100 ఎకరాల టెర్మినల్

