పాతబస్తీలో హైడ్రా భూకంపం: రూ. 100 కోట్ల ఆస్తికి విముక్తి!

naveen
By -
పాతబస్తీలో హైడ్రా భూకంపం: రూ. 100 కోట్ల ఆస్తికి విముక్తి!

పాతబస్తీలో హైడ్రా భూకంపం: రూ. 100 కోట్ల ఆస్తికి విముక్తి!


హైదరాబాద్ గుండెల్లో కబ్జాకోరుల గుండెదడ మొదలైంది! ఒకప్పుడు ప్రభుత్వ ఆస్తులంటే ఎవరైనా మింగేయొచ్చనే ధీమా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. చెరువులు, కుంటలు, పార్కులను చెరబడుతున్న భూబకాసురుల సామ్రాజ్యాలను కూకటివేళ్లతో పెకిలించడానికి 'హైడ్రా' (HYDRAA) బుల్డోజర్లు గర్జిస్తున్నాయి! తాజాగా పాతబస్తీ గుండెకాయలో హైడ్రా చేసిన సర్జికల్ స్ట్రైక్ కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.


పాతబస్తీలో హైడ్రా భూకంపం.. వంద కోట్ల ఆస్తికి విముక్తి! 


గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్న హైడ్రా.. ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు ఏకంగా వేల కోట్ల రూపాయల విలువైన ప్రజా ఆస్తులను రాబందుల నోటి నుంచి లాక్కుంది. 


ఎన్నో చెరువుల్లో ఉన్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి, వాటికి సరికొత్త జీవం పోసి సుందరీకరణ పనులు చేపట్టింది. తాజాగా పాతబస్తీలో (Old City) ఎవరూ ఊహించని విధంగా ఒక మెగా ఆపరేషన్‌కు తెరతీసింది. 


మైలర్‌దేవ్‌పల్లిలో కబ్జాకోరుల పంజాలో చిక్కుకున్న 6,500 గజాల భారీ క్రీడామైదానాన్ని (Playground) హైడ్రా తన ఉక్కుపాదం కింద విడిపించింది. దీని మార్కెట్ విలువ అక్షరాలా రూ. 100 కోట్లు ఉంటుందని అంచనా! హెచ్ఎండీఏ (HMDA) పక్కాగా స్పోర్ట్స్ గ్రౌండ్ అని ప్లాన్‌లో రాసిచ్చినా సరే.. దాన్ని ఆక్రమించుకుని పబ్బం గడుపుకోవాలని చూసిన వారి భవనాలను హైడ్రా బుల్డోజర్లు మట్టికరిపించాయి.


శాస్త్రిపురంలో అక్రమ కోటల కూల్చివేత! 


శాస్త్రిపురం కాలనీలో 188 ఎకరాల హుడా (HUDA) అనుమతి ఉన్న బృహత్తర లేఅవుట్ ఉంది. ఇందులో 1,800 కు పైగా ప్లాట్లు ఉన్నాయి. పక్కా నిబంధనల ప్రకారం ఇక్కడ 6,500 గజాల స్థలాన్ని పిల్లల ఆటల కోసం, క్రీడా మైదానం కోసం కేటాయించారు. 


ఇది స్పోర్ట్స్ గ్రౌండ్ అని కబ్జాదారులకు పక్కాగా తెలుసు. అయినా సరే, గత మూడేళ్లుగా కేవలం నోటరీ పత్రాలు సృష్టించి దర్జాగా ప్లాట్లు చేసి అమ్మేసుకుంటున్నారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా భారీ భవనాలు నిర్మిస్తున్నారు.


జీహెచ్ఎంసీ అధికారులు గతంలో ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చారు. ఆఖరికి 2024 లో ఈ అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని అధికారిక ఆర్డర్లు కూడా జారీ చేశారు. కానీ, కబ్జాదారులు ఆ నోటీసులను చెత్తబుట్టలో పడేసి తమ నిర్మాణాలను నిర్భయంగా కొనసాగించారు. విసిగిపోయిన స్థానికులు చివరి అస్త్రంగా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 


రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది.. రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో అణువణువూ సర్వే చేశారు. అది పక్కాగా క్రీడా మైదానమేనని డాక్యుమెంట్ల ఆధారంగా నిర్ధారించుకున్నారు. "ఇక ఒక్క ఇటుక కూడా పేర్చవద్దు" అని ముందుగానే వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే వినకపోవడంతో.. బుల్డోజర్లకు పనిచెప్పారు. 


నిర్మాణ దశలో ఉన్న ఐదు భారీ G+3 భవనాలతో పాటు, మరో రెండు సింగిల్ రూమ్ నిర్మాణాలను పునాదులతో సహా పీకేశారు. అయితే, ఇప్పటికే రెండు భవనాల్లో కుటుంబాలు నివాసం ఉంటుండటంతో మానవతా దృక్పథంతో వాటిని మాత్రం వదిలేశారు.


చంపేస్తామన్నారు.. హైడ్రానే మమ్మల్ని కాపాడింది! 


వంద కోట్ల క్రీడా మైదానం తిరిగి తమ సొంతం కావడంతో శాస్త్రిపురం కాలనీ వాసుల ఆనందానికి అవధులు లేవు. హైడ్రాకు ఒక్క ఫోన్ చేయగానే క్షణాల్లో వాలిపోయి తమ ఎన్నో ఏళ్ల పోరాటాన్ని గెలిపించారని వారు ఆనందభాష్పాలు రాల్చారు. "ఈ కబ్జాకోరులు సామాన్యులు కారు.. వాళ్లను అడ్డుకుంటే మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టమని దారుణంగా బెదిరించారు. మా పిల్లలు ఆడుకునే గ్రౌండ్‌ను మింగేయాలని చూశారు. కానీ హైడ్రా రాకతో మా స్థలం మాకు దక్కింది" అని కాలనీ వాసులు ధైర్యంగా చెబుతున్నారు.


ఐటీ కారిడార్ నుంచి పల్లెల దాకా.. హైడ్రా జాతర! 


హైడ్రా ఆపరేషన్ కేవలం పాతబస్తీకే పరిమితం కాలేదు. మంగళవారం నాడు నగరం నలుమూలలా హైడ్రా బుల్డోజర్లు విశ్వరూపం చూపించాయి. ఐటీ కారిడార్‌కు ఆనుకుని ఉన్న మంచిరేవుల వద్ద 8.24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 'నాగిరెడ్డి కుంట'ను ఆక్రమణదారుల నుంచి విడిపించింది.


ఘట్‌కేసర్ పరిధిలోని అవుషాపూర్‌లో 1,440 గజాల పార్కు స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. దుండిగల్-గండిమైసమ్మ పరిధిలోని బౌరంపేటలో ప్రధాన రహదారిపై అక్రమంగా వెలిసిన షెడ్లను నిర్దాక్షిణ్యంగా తొలగించింది.


నగరంలో ఎక్కడ చూసినా ఇప్పుడు హైడ్రా నామస్మరణే వినిపిస్తోంది! పేదవాడి ఆస్తి అయినా, ప్రభుత్వ ఆస్తి అయినా అన్యాయంగా ఆక్రమించుకుంటే.. ఆ కోటలు బీటలు వారడం ఖాయమని హైడ్రా చేస్తున్న ఈ దాడులు కబ్జాకోరులకు ఇస్తున్న అసలైన వార్నింగ్!


Tags: