వైద్యో నారాయణో హరిః.. భూమిపై ప్రాణాలు కాపాడే వైద్యుడిని దేవుడితో సమానంగా పూజిస్తాం. కానీ అదే వైద్యుడు ఆసుపత్రిని కాసుల కోసం కబేళాగా మారిస్తే? మన దేశం నుంచి వెళ్లి అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడిన ఒక డాక్టర్.. పచ్చ నోట్ల కోసం కక్కుర్తి పడి అమాయక రోగుల శరీరాలను తన ప్రయోగశాలలుగా మార్చేశాడు. అవసరం లేని సర్జరీలు, భయంకరమైన టెస్టులతో వారి ప్రాణాలతో చెలగాటమాడాడు. చివరకు పాపం పండి ఎఫ్‌బీఐ చేతికి చిక్కడంతో, ఏకంగా రూ.130 కోట్లు జరిమానా కట్టి తప్పించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆ కీచక వైద్యుడి కళ్లు చెదిరే దారుణాల స్టోరీ ఇది!
అట్లాంటాలో వైద్య మాఫియా.. ప్రయోగశాలగా ప్రాణాలు!
అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) వెల్లడించిన వివరాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. భారత సంతతికి చెందిన డాక్టర్ జితేష్ పటేల్.. అమెరికాలోని అట్లాంటా నగరంలో 'అడ్వాన్స్‌డ్ యూరాలజీ' అనే కేంద్రాన్ని నడుపుతున్నాడు. అయితే వైద్యం ముసుగులో ఈయన చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు. తన క్లినిక్‌కు నమ్మకంతో వచ్చే ప్రతి రోగికి, వారికి అసలు అవసరం ఉందో లేదో కూడా చూడకుండా అత్యంత దారుణంగా అనవసరమైన చికిత్సలు చేశాడు.
శాశ్వత ప్రాతిపదికన 'శాక్రల్ నర్వ్ స్టిమ్యులేటర్' అనే ప్రమాదకర పరికరాలను రోగుల శరీరంలో ఇష్టానుసారంగా అమర్చాడు. అంతటితో ఆగకుండా అమాయక రోగులకు మత్తుమందు ఇచ్చి.. మూత్రనాళం ద్వారా లోపలికి స్కోప్‌లను పంపే 'సిస్టోస్కోపీ' వంటి బాధాకరమైన పరీక్షలను, ఏమాత్రం అవసరం లేకపోయినా పదే పదే చేసి పైశాచిక ఆనందం పొందాడు.
విద్యుత్ షాక్‌లు.. నకిలీ బిల్లులతో కోట్ల దోపిడీ!
ఈ కీచక వైద్యుడి అరాచకాలు ఇక్కడితో ఆగిపోలేదు. సాధారణంగా యూరాలజీ వైద్యంలో ఎప్పుడో అత్యవసరమైతే గానీ వాడని 'ఎలక్ట్రోమయోగ్రఫీ' అనే పరీక్షలను దాదాపు తన దగ్గరకు వచ్చిన ప్రతి రోగికి చేసి నరకం చూపించాడు. ఇందులో భాగంగా అమాయక రోగుల జననేంద్రియాలకు ఎలక్ట్రోడ్లు తగిలించి మరీ విద్యుత్ సంకేతాలను పంపేవాడని డోజ్ అధికారులు గుట్టు రట్టు చేశారు.
ప్రాణాలతో ఇలా ఆడుకోవడమే కాకుండా.. కేవలం చిన్నపాటి సర్జరీ చేసి, అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్ చేసినట్లుగా నకిలీ రికార్డులు సృష్టించాడు. ఆ నకిలీ బిల్లులను ప్రభుత్వానికి పంపి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకున్నాడని అధికారులు తీవ్ర ఆరోపణలు చేశారు.
గుట్టు రట్టు చేసిన ఉద్యోగులు.. 130 కోట్ల జరిమానా!
ఎన్నాళ్లనో సాగదు ఈ దోపిడీ అన్నట్లు.. జితేష్ పటేల్ చేసిన ఈ అమానుష నేరాన్ని బయట పెట్టింది స్వయంగా అతని వద్దే పని చేసిన మాజీ ఉద్యోగిని లోరైన్ పెరుమాల్, మాజీ ఫిజీషియన్ డాక్టర్ హిమాన్షు అగర్వాల్. ఒకప్పుడు జితేష్ పటేల్ వద్ద పని చేసిన వీళ్లే.. తమ క్లినిక్‌లో జరుగుతున్న ఈ చీకటి దందా గురించి, జితేష్ పటేల్ చేస్తున్న అరాచకాల గురించి ఆధారాలతో సహా నేరుగా ఎఫ్‌బీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్‌బీఐ అధికారులు రంగంలోకి దిగి లోతైన విచారణ చేపట్టగా.. ఈ మెడికల్ మాఫియా మోసం అక్షరాలా నిజమేనని తేలింది. అడ్డంగా దొరికిపోయిన డాక్టర్ జితేష్.. జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు సివిల్ సెటిల్‌మెంట్‌కు అంగీకరించక తప్పలేదు. సర్కారు విధించిన ఏకంగా 14 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 130 కోట్లు) భారీ జరిమానాను చెల్లించేందుకు డాక్టర్ జితేష్ ఓకే చెప్పాడు.
ఈ చీకటి దందాను సాహసోపేతంగా వెలుగులోకి తెచ్చిన లోరైన్ పెరుమాల్, డాక్టర్ హిమాన్షు అగర్వాల్‌లకు.. ఆ జరిమానాలోంచి ఏకంగా 2.94 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 27 కోట్లు) రివార్డుగా ఇవ్వబోతున్నట్లు సర్కారు సగర్వంగా ప్రకటించింది.
లాభం కోసమే రోగుల బలి.. అధికారుల ఫైర్!
ఈ దారుణమైన మెడికల్ స్కామ్ గురించి యూఎస్ అటార్నీ థియోడర్ హెర్ట్జ్‌బర్గ్ తీవ్రంగా స్పందించారు. వైద్యులు చేయని సేవలకు బిల్లులు వేయడం, అమాయకుల ప్రాణాలతో అనవసరమైన ప్రయోగాలు చేయడం క్షమించరాని నేరం అని ఆయన మండిపడ్డారు.
ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ పీటర్ ఎల్లిస్ మాట్లాడుతూ.. ఈ దందా మొత్తం రోగి సంరక్షణను గాలికి వదిలేసి, కేవలం లాభానికే పెద్ద పీట వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అత్యంత హేయమైన చర్య అని, ఇలాంటి దారుణాలకు పాల్పడిన వైద్యులకు భవిష్యత్తులో కఠిన శిక్షలు పడేలా చేయాలని ఆయన హెచ్చరించారు.
దేవుడి స్థానంలో ఉండాల్సిన డాక్టర్, రాక్షసుడిలా మారితే జరిగే వినాశనానికి జితేష్ పటేల్ ఉదంతం ఒక సజీవ సాక్ష్యంగా మిగిలిపోతుంది!
Also Read:
ఒక్క రాత్రిలో ఇరాన్ ఖతం: ట్రంప్ సంచలన వార్నింగ్!రాలిపోతున్న ఇరాన్ అగ్ర నేతలు: ఇజ్రాయెల్ దాడుల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ బలి
US Iran Conflict: జలసంధి ఆదాయంలో వాటా ఇస్తేనే.. హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త షరతు!
US Iran Conflict: మంగళవారం దాడులు తప్పవు: ఇరాన్‌కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్
US Iran Conflict : ఇస్ఫహాన్‌లో అమెరికా విమానాల కూల్చివేత!

