US Iran Conflict: జలసంధి ఆదాయంలో వాటా ఇస్తేనే.. హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త షరతు!

naveen
By -
US And Iran Conflict Escalates Over Strait Of Hormuz Closure


ఇజ్రాయెల్, అమెరికా ఒకవైపు.. ఇరాన్ మరోవైపు.. మధ్యలో ప్రపంచ చమురు రవాణాకు ఏకైక ప్రాణాధారమైన 'హోర్ముజ్ జలసంధి'. ఈ జలసంధి మూసుకుపోతే ప్రపంచం ఆర్థిక అంధకారంలోకి వెళ్లడం ఖాయం. ఇరుదేశాలు పంతానికి పోతుండటంతో ఇప్పుడు ఈ వివాదం గల్ఫ్ యుద్ధాన్ని తారాస్థాయికి చేర్చి, మరో ప్రపంచ వినాశనానికి దారితీసేలా కనిపిస్తోంది.


ట్రంప్ డెడ్‌లైన్.. మంగళవారం మహా విధ్వంసం?


హోర్ముజ్ జలసంధిని తెరవడానికి అమెరికా విధించిన గడువు అత్యంత వేగంగా ముగుస్తోంది. ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాధారణ హెచ్చరికలతో ఆగలేదు. సోషల్ మీడియా వేదికగా ఏకంగా పచ్చి బూతులతో ఇరాన్ మీద విరుచుకుపడ్డారు.


సమయం మించిపోతోందని, మంగళవారం నాటికి జలసంధికి దారి ఇవ్వకపోతే ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, కీలక వంతెనలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తామని ఆయన భీకర హెచ్చరికలు జారీ చేశారు.


అమెరికా పరిస్థితి నరకమే.. ఇరాన్ సింహగర్జన


అమెరికా బెదిరింపులకు ఇరాన్ ఏమాత్రం భయపడటం లేదు. ట్రంప్ వార్నింగ్‌పై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎంబీ ఘలిబఫ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్‌పై దాడులకు దిగితే.. అమెరికాతో పాటు యావత్ పశ్చిమాసియా అగ్నిగుండంగా మారుతుందని, దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.


ట్రంప్ కేవలం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాటలు విని, ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే గల్ఫ్ ప్రాంతాన్ని తగలబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ట్రంప్ తన నిర్లక్ష్యపు అడుగులతో అస్థిరతను సృష్టిస్తున్నారని.. ఇవన్నీ కలిసి చివరకు అమెరికా పరిస్థితిని నరకంలా మారుస్తాయని ఘలిబఫ్ 'ఎక్స్' వేదికగా నిప్పులు చెరిగారు. యుద్ధ నేరాలతో అమెరికా ఏమీ సాధించలేదని, ఇరాన్ ప్రజల హక్కులను గౌరవించి ఈ ప్రమాదకర యుద్ధాన్ని ముగించడమే సమస్యకు ఏకైక పరిష్కారమని ఆయన తేల్చి చెప్పారు.


ఇరాన్ కొత్త షరతు.. వాటా ఇస్తేనే రూట్ క్లియర్!


ఇప్పుడు హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే టెహ్రాన్ ఒక మైండ్ బ్లాంక్ అయ్యే కొత్త షరతు పెట్టింది. ఈ యుద్ధం వల్ల తమ దేశానికి జరిగిన భారీ నష్టానికి పరిహారంగా.. హోర్ముజ్ మార్గం ద్వారా వచ్చే వాణిజ్య ఆదాయంలో కొంత భాగాన్ని ఇరాన్‌కు కచ్చితంగా కేటాయించాలని ఇరాన్ అధ్యక్షుడి అధికార ప్రతినిధి సయ్యద్ మహ్మద్ మెహదీ తబాతబెయ్ కుండబద్దలు కొట్టారు. ఆ పర్సంటేజ్ ఇస్తేనే సముద్ర రవాణాకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.


బాబ్ ఎల్ మాండేబ్‌పై కన్ను.. స్తంభించనున్న వాణిజ్యం!


అమెరికా గనక మూర్ఖంగా మళ్లీ అవే తప్పులు చేస్తే.. కేవలం ఒక్క సిగ్నల్‌తో ప్రపంచదేశాలకు వెళ్లే చమురు, గ్యాస్ సరఫరాను, వాణిజ్యాన్ని పూర్తిగా స్తంభింపజేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మాజీ విదేశాంగ సలహాదారు అలీ అక్బర్ వెలాయటి హెచ్చరించారు.


అవసరమైతే తమ 'రెసిస్టెంట్ ఫ్రంట్' దళాలు ఎర్ర సముద్రంలోని అత్యంత కీలకమైన 'బాబ్ ఎల్ మాండేబ్' జలసంధిని కూడా టార్గెట్ చేస్తాయని వార్నింగ్ ఇచ్చారు. యావత్ ప్రపంచ వాణిజ్యంలో ఏకంగా 12 శాతం కేవలం ఈ మార్గం గుండానే జరుగుతుంది. గతంలో ఇరాన్ అనుకూల యెమెన్ హౌతీ బలగాలు ఇక్కడే దాడులు చేసి ప్రపంచాన్ని వణికించాయి.


కౌంట్‌డౌన్ షురూ!


ఇప్పటికే హోర్ముజ్ గుండా రవాణా దాదాపుగా ఆగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు బాబ్ ఎల్ మాండేబ్ ద్వారా కూడా నౌకల రాకపోకలు నిలిచిపోతే దాని ప్రభావం దారుణంగా ఉంటుంది. నా అంచనా ప్రకారం.. ఈ పశ్చిమాసియా పంతం కేవలం ఆ దేశాలకే పరిమితం కాదు. మంగళవారం ట్రంప్ గడువు ముగిసిన తర్వాత ఇరుదేశాలు కయ్యానికి కాలు దువ్వితే, రాబోయే పది రోజుల్లో ముడి చమురు ధరలు చారిత్రక గరిష్టానికి చేరుకునే ప్రమాదం ఉంది. పెట్రోల్ ధరల మంట సామాన్యుడి బతుకును దహించివేయడం తథ్యం. గల్ఫ్ పరిణామాలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద అగ్నిపరీక్ష!