మీ పిల్లలకు తొలిసారి పలకా బలపం పట్టించి అక్షరాభ్యాసం చేయించాలంటే ముందుగా గుర్తొచ్చే పుణ్యక్షేత్రం బాసర. కానీ ఇరుకు ప్రాంగణం, పండుగ వేళల్లో గంటల తరబడి క్యూలైన్లు, సామాన్య భక్తులు పడుతున్న ఇబ్బందులకు ఇక శాశ్వత చెక్ పడబోతోంది! అవును, అక్షరాభ్యాసాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణలోని ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయమైన బాసరకు మునుపెన్నడూ చూడని మహర్దశ పట్టింది. భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న ఈ ప్రాచీన దేవాలయాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక అడుగు వేసింది.
వచ్చే ఏడాది పుష్కరాల టార్గెట్.. నేడే భూమి పూజ!
బాసర ఆలయ పునర్వైభవానికి ఏకంగా రూ. 225 కోట్లతో బృహత్తర పునరాభివృద్ధి పనులకు రంగం సిద్ధమైంది. దీనికోసం ఇప్పటికే కళ్లు చెదిరే మాస్టర్ ప్లాన్ రెడీ కాగా, ఆలయ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నమూనాను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
వచ్చే ఏడాది రానున్న గోదావరి పుష్కరాల నాటికి సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ మాస్టర్ ప్లాన్‌లోని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చారిత్రక ఘట్టంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు బాసర ఆలయ పునరభివృద్ధి పనులకు స్వయంగా భూమి పూజ చేయనున్నారు.
శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో.. ఆగమ శాస్త్రబద్ధంగా!
బాసరలో ఏటా వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో భక్తుల రద్దీ ఊహకు అందదు. అయితే ఆలయం ఎంతో ప్రాచీనమైనది కావడంతో, రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సరైన సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి.. మన సంప్రదాయాలు, ఆచారాలకు ఏమాత్రం భంగం కలగకుండా ఒక గొప్ప మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
దీనికోసం ఏకంగా శృంగేరి పీఠాధిపతులను సంప్రదించి, వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారం నిర్మాణాలకు సంబంధించి వారి నుంచి పూర్తి అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ బృహత్తర మాస్టర్ ప్లాన్‌ను ఫైనల్ చేయడం విశేషం.
మూడింతలు పెరగనున్న ఆలయం.. కృష్ణ శిలలతో నిర్మాణాలు!
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ మార్పులు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే! ప్రస్తుతం కేవలం 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని ఏకంగా 5 వేల చదరపు అడుగులకు విశాలంగా మార్చనున్నారు. ఉత్తరం వైపున ఆకాశాన్ని తాకేలా 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన మూడు దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు బ్రహ్మాండంగా నిర్మించబోతున్నారు.
అంతేకాకుండా, నాలుగు దిక్కుల్లో 33 అడుగుల వెడల్పుతో విశాలమైన మాడ వీధులు, ఒక సరికొత్త ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు 20 వేల చదరపు అడుగుల్లో ఉన్న బాసర ఆలయ విస్తీర్ణం.. ఏకంగా 62 వేల చదరపు అడుగులకు అంటే గతం కంటే మూడు రెట్లు విశాలంగా పెరగనుంది. పైగా గుడిలోని ప్రతి నిర్మాణాన్ని పవిత్రమైన శిలలతోనే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడం అతిపెద్ద హైలైట్!
భక్తులకు సకల సదుపాయాలు.. సోలార్ పార్కింగ్ టు పుష్పవనం!
ఈ మాస్టర్ ప్లాన్‌లో భక్తుల కనీస అవసరాలు, సౌకర్యాల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి 6 వేల మంది భక్తులు సౌకర్యవంతంగా వేచి ఉండేలా ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ వంటి సకల వసతులతో 70 వేల చదరపు అడుగుల భారీ క్యూ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ప్రశాంతత కోసం ఒకేసారి 200 మంది కూర్చునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో మెగా వంట శాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం రాబోతున్నాయి.
ఆలయానికి ఈశాన్య దిక్కున పవిత్ర కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుతమైన తోరణాలు, అత్యాధునిక సమాచార కేంద్రం రాబోతున్నాయి. ఉత్తర, తూర్పు దిక్కుల్లో కొత్త రోడ్ల నిర్మాణం, దేవాలయం నుంచి రోడ్డు అవతలి వైపు వెళ్లేందుకు సురక్షితమైన అండర్ పాస్ నిర్మించనున్నారు. అలాగే రోడ్డు అవతలి వైపున సోలార్ రూప్‌టాప్‌తో సరికొత్త వాహనాల పార్కింగ్, ఆలయ ప్రాంగణమంతా ఆహ్లాదకరమైన మొక్కలతో ఒక అద్భుతమైన పుష్పవనాన్ని పెంచబోతున్నారు.
ఈ మాస్టర్ ప్లాన్‌తో కేవలం ఒక ఆలయంగానే కాకుండా, భారతదేశంలోనే ఒక అగ్రగామి విద్యా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు! వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఈ కృష్ణ శిలల కట్టడాలు ఆవిష్కృతమైతే.. అటు తెలంగాణ పర్యాటక ఆదాయం పెరగడంతో పాటు, ఇటు సామాన్య భక్తులకు కనీస ఇబ్బందులు లేని అద్భుతమైన, ప్రశాంతమైన దర్శన భాగ్యం కలుగుతుంది.
Also Read:
Cyber Crime Hyderabad: టెకీకి 2.36 కోట్ల కుచ్చుటోపీBhadrachalam Villages: భద్రాచలం ఆ ఐదు గ్రామాలు తెలంగాణకే.. అమిత్ షాకు తుమ్మల లేఖ!
Etela Rajender News: పార్టీ మార్పుపై ఈటల రాజేందర్ క్లారిటీ!
HYDRAA Updates : యూఎల్సీ ఖాళీ ప్లాట్ల జోలికి వెళ్లం.. సామాన్యులకు హైడ్రా తీపికబురు!
Singareni Workers : సింగరేణిపై ఏసీబీ విచారణా? భట్టి విక్రమార్కపై కవిత ఫైర్!

