Hyderabad Techie Loses 2.36 Crores In Facebook Trading Cyber Scam : స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే మన గుప్పిట్లో ఉన్నట్లు ఫీల్ అవుతుంటాం. కానీ అదే ఫోన్ మన పాలిట మృత్యుపాశం అవుతుందని ఎవరూ ఊహించరు! పోలీసులు మొత్తుకుంటున్నారు.. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.. స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు యాడ్స్ ద్వారా వేడుకుంటున్నారు. అయినా సరే జనం గుడ్డిగా నమ్మి మోసాల బారిన పడుతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు గీసిన వలలో చిక్కుకుని, జీవితకాలం సంపాదించిన కష్టార్జితాన్ని క్షణాల్లో ఆవిరి చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఫేస్‌బుక్‌లో వచ్చిన ఒక 'అందమైన' ఫ్రెండ్ రిక్వెస్ట్‌కు ఆకర్షితుడై ఏకంగా రూ.2.36 కోట్లు సమర్పించుకున్న భయంకరమైన ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఆ ఒక్క ఫ్రెండ్ రిక్వెస్ట్.. ప్రాణసంకటంగా మారింది!
హైదరాబాద్‌లోని కొండాపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వీరభద్రరావు గతేడాది ఆగస్టు నెలలో తన ఫేస్‌బుక్ ఖాతా చూసుకుంటున్నాడు. అకస్మాత్తుగా ఒక మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. చూడటానికి అమాయకంగా ఉండటంతో దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అంతే, ఆ ఒక్క క్లిక్ అతడి భవిష్యత్తును తలకిందులు చేసింది. ఆ సైబర్ మాయలాడి తన పేరు 'కోరా' అని పరిచయం చేసుకుని తియ్యటి మాటలు కలపడం ప్రారంభించింది. తన సొంతూరు సింగపూర్ అని, కానీ ప్రస్తుతం ఉద్యోగ రీత్యా ముంబైలో నివసిస్తున్నానని నమ్మించింది.
బుట్టలో వేసేందుకు సెంటిమెంట్ డ్రామా..
కొన్నిరోజుల పాటు చాటింగ్ చేసుకున్న తర్వాత ఇద్దరూ ఏకంగా ఫోన్ నంబర్లు మార్చుకునే స్థాయికి చనువు పెరిగింది. వీరభద్రరావును పూర్తిగా బుట్టలో వేసుకునేందుకు కోరా ఒక సెంటిమెంట్ కథ అల్లింది. తన తల్లి ప్రస్తుతం తన సవతి తండ్రితో కలిసి హైదరాబాద్‌లోనే నివసిస్తోందని చెప్పి అతడిలో మరింత నమ్మకం పెంచింది. అంతేకాదు, జర్మనీ సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో తనకు స్నేహితులు ఉన్నారని బిల్డప్ ఇచ్చి, వీరభద్రరావును ఒక ఫేస్‌బుక్ గ్రూపులో యాడ్ చేసింది. ఆ ఒక్క గ్రూపే తన పాలిట మృత్యు బిలం అవుతుందని అతను అప్పుడు గ్రహించలేకపోయాడు.
ఏపీకే ఫైల్.. నిండా ముంచిన నకిలీ యాప్!
ఆ గ్రూపులో ఉన్న సభ్యులంతా 'ఫేస్‌బుక్ స్టోర్'లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని, ఊహించని స్థాయిలో లాభాలు ఆర్జిస్తున్నారని కోరా మెల్లగా ఆశలు రేపింది. నీ దగ్గర డబ్బులు ఉంటే ఇందులో ట్రేడింగ్ చేయాలని, క్షణాల్లో కోటీశ్వరుడివి అయిపోతావని బుజ్జగించింది. మొదట వీరభద్రరావు ఇందుకు ససేమిరా వద్దన్నాడు. కానీ ఆ సైబర్ కిలాడీ వదిలిపెట్టలేదు. పదే పదే ఊరించి.. చివరకు అతడితో ఓకే చెప్పేలా చేసింది. దీంతో ఫేస్‌బుక్ స్టోర్ పేరుతో అతడికి ఒక లింక్‌ను పంపించింది. అది ఓపెన్ కాకపోవడంతో, అత్యంత తెలివిగా ఒక ఏపీకే (APK) ఫైల్‌ను వాట్సాప్ చేసింది.
ఏమాత్రం అనుమానం రాని ఆ టెకీ.. ఆ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయగానే అచ్చం ఫేస్‌బుక్ లాంటి నకిలీ యాప్ ఒకటి ఓపెన్ అయింది. ఆ యాప్‌లోని స్టోర్‌లో వస్తువులు కొనడం, అమ్మడం ద్వారా లక్షలు సంపాదించవచ్చని ఆమె నమ్మబలికింది. ట్రేడింగ్‌లో ఏదైనా అనుమానాలు, సలహాలు కావాలంటే తన జర్మనీ ఫ్రెండ్ 'బెల్లా'తో మాట్లాడాలని ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది.
క్రిప్టో ఖాతాలోకి 2.36 కోట్లు.. గాల్లో కలిసిన కష్టం!
ఇక అక్కడి నుంచి బ్రెయిన్ వాష్ మొదలైంది. జర్మనీ ఫ్రెండ్ బెల్లా చెప్పినట్లు గుడ్డిగా ఫాలో అవుతూ వీరభద్రరావు ఏకంగా లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టాడు. గతేడాది సెప్టెంబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 12వ తేదీ మధ్యకాలంలో క్రిప్టో వ్యాలెట్ ద్వారా ఏకంగా రూ.2.36 కోట్లను ఆ సైబర్ నేరగాళ్ల అకౌంట్లలోకి కుమ్మరించాడు.
విత్‌డ్రా బటన్ నొక్కితే.. దిమ్మతిరిగే నిజం!
తాను పంపించిన ఆ రెండు కోట్లకు పైగా సొమ్ము.. ఆ నకిలీ యాప్‌లో కొనుగోళ్లు, అమ్మకాల ద్వారా భారీ లాభాలు తెచ్చిపెడుతున్నట్లు స్క్రీన్ మీద మాయాజాలం సృష్టించారు. ఆ డిజిటల్ నంబర్లు చూసుకుని వీరభద్రరావు సంబరపడిపోయాడు. కానీ, ఆ డబ్బును ఒక్క రూపాయి కూడా విత్‌డ్రా చేసుకునే అవకాశం వాళ్లు ఇవ్వలేదు. మొదట్లో సర్వర్ సమస్య ఏమో అని ఓపిక పట్టిన వీరభద్రరావు.. గత కొన్ని నెలలుగా వాళ్లను బతిమాలుతూనే ఉన్నాడు. వచ్చిన లాభాలు పక్కనపెడితే.. కనీసం తాను పెట్టిన రెండున్నర కోట్ల పెట్టుబడి అయినా వెనక్కి ఇవ్వాలని వేడుకున్నాడు. అప్పుడు కానీ అతనికి తాను ఎంత దారుణంగా మోసపోయానో అర్థం కాలేదు!
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. లబోదిబోమంటూ సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ కళ్లు చెదిరే భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఎంతో చదువుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే ఇలాంటి ఫేక్ ప్రొఫైల్స్ కు ఆకర్షితులై కోట్ల రూపాయలు పోగొట్టుకుంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన గుర్తుతెలియని వ్యక్తి కోసం మీ కష్టార్జితాన్ని ధారబోసే ముందు వందసార్లు ఆలోచించండి.. వర్చువల్ ప్రపంచంలో కనపడే ప్రతి అందమైన చిరునవ్వు వెనుక ఒక సైబర్ రాబందు పొంచి ఉందని మర్చిపోవద్దు!
Also Read:
Bhadrachalam Villages: భద్రాచలం ఆ ఐదు గ్రామాలు తెలంగాణకే.. అమిత్ షాకు తుమ్మల లేఖ!Etela Rajender News: పార్టీ మార్పుపై ఈటల రాజేందర్ క్లారిటీ!
HYDRAA Updates : యూఎల్సీ ఖాళీ ప్లాట్ల జోలికి వెళ్లం.. సామాన్యులకు హైడ్రా తీపికబురు!
Singareni Workers : సింగరేణిపై ఏసీబీ విచారణా? భట్టి విక్రమార్కపై కవిత ఫైర్!
Fridge Blast: నిర్మల్‌లో ఫ్రిడ్జ్ పేలి ఇద్దరు మృతి

