అమెరికా-ఇరాన్ మధ్య రగులుతున్న ఈ యుద్ధ జ్వాలలు ఏమాత్రం శృతి మించినా అది నేరుగా మూడో ప్రపంచ యుద్ధానికే దారితీస్తుంది. పెట్రోల్ ధరలు భగ్గుమంటాయి, గ్యాస్ సరఫరా నిలిచిపోతుంది, నిత్యావసరాల రేట్లు ఆకాశాన్ని తాకి సామాన్యుడి జేబుకు చిల్లులు పడతాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన భయంకరమైన హెచ్చరికలు చూస్తుంటే ఈ మహా సంగ్రామం ఏ క్షణమైనా పెను విధ్వంసానికి దారితీసేలా కనిపిస్తోంది. ఇది కేవలం రెండు దేశాల పోరు కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దహించివేసే ఆటంబాంబు!
ఒక్క రాత్రిలో ఇరాన్ నామరూపాల్లేకుండా చేస్తాం!
పశ్చిమాసియాలో కాలుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు తీవ్రరూపం దాల్చాయి. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఏమాత్రం లెక్కచేయకుండా తిరస్కరించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోయారు. "ఒక్క రాత్రిలో ఇరాన్‌ను పూర్తిగా మట్టుబెట్టగలం.. ఈ ధిక్కారానికి ఆ దేశం అత్యంత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు" అని ఆయన భీకర హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం నాటికి ఇరాన్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంటామని, ఆ దేశం ఒక్క రోజులోనే ప్రపంచ పటం మీద నుంచి తుడిచి పెట్టుకుపోవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
బూతులతో రెచ్చిపోయిన ట్రంప్.. టార్గెట్ ఫిక్స్!
హార్మూజ్ జలసంధిని బేషరతుగా తిరిగి తెరవడంలో లేదా అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడంలో టెహ్రాన్ నాయకత్వం గనక విఫలమైతే.. పరిణామాలు ఊహకందవని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ లోని కీలకమైన విద్యుత్ కేంద్రాలు, భారీ వంతెనలు, ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాలపై కనికరం లేకుండా దాడి చేస్తామని ఆయన ఆవేశపూరిత ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేస్తున్న సమయంలో ట్రంప్ ఏకంగా బూతులు వాడుతూ రెచ్చిపోవడం గమనార్హం. ఈ తీవ్ర హెచ్చరికలు చేసిన కొన్ని గంటలకే.. ఇరాన్‌ను తుడిచి పెట్టేస్తామంటూ ఆయన మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఎఫ్-15 పైలట్ రెస్క్యూ.. లీకువీరుడికి ఉరి ఖాయం!
ఇరాన్ గడ్డపై కుప్పకూలిపోయిన అమెరికా ఎఫ్-15 యుద్ధ విమాన పైలట్‌ను ప్రాణాలతో రక్షించిన ఉత్కంఠభరిత ఆపరేషన్ గురించి ట్రంప్ తొలిసారి పూర్తి వివరాలను బయటపెట్టారు. అయితే ఈ ఆపరేషన్ సమయంలో అమెరికాకు చెందిన అత్యంత గోప్యమైన అంతర్గత సమాచారాన్ని ఎవరో తమ శత్రువులకు లీక్ చేశారని ఆయన సంచలన ఆరోపణ చేశారు.
"మా పైలట్ ఎక్కడ ఉన్నాడో, మా రెస్క్యూ టీమ్ ఎప్పుడు వస్తుందో ఎవరో ఇరాన్‌కు ముందే చేరవేశారు. ఈ సమాచారం లీక్ కావడం వల్లే మా పైలట్‌ను పట్టుకోవడానికి ఇరాన్ ఏకంగా 200 మందిని రంగంలోకి దించింది. ఆ సమాచారం ఇచ్చిన అధికారికెవరికైనా సరే కచ్చితంగా శిక్ష పడి తీరుతుంది" అని ట్రంప్ హెచ్చరించారు. ఈ ద్రోహం కారణంగా కుప్పకూలిన పైలట్‌తో దాదాపు గంట పాటు కమ్యూనికేషన్ తెగిపోయిందని, పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆయన వివరించారు.
ఆకాశంలో అమెరికా విశ్వరూపం.. చరిత్రలోనే భారీ ఆపరేషన్!
శత్రు దేశంలో చిక్కుకున్న తమ పైలట్‌ను ప్రాణాలతో వెలికి తీసేందుకు అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాలను, విమానాలను ఏకకాలంలో రంగంలోకి దించింది. ఈ భారీ ఆపరేషన్ కోసం మునుపెన్నడూ లేని విధంగా 55 ఎయిర్ క్రాఫ్టులను, 64 ఫైటర్ జెట్లను, 4 భారీ బాంబర్లను, 13 రెస్క్యూ ఎయిర్‌క్రాఫ్ట్టులను, 48 ట్యాంకర్లను వినియోగించారు.
"అమెరికా సైనిక చరిత్రలోనే ఇది అత్యంత భారీ, సంక్లిష్టమైన ఆపరేషన్. మాకున్న అత్యాధునిక ఆయుధ సంపద ప్రపంచంలో మరే దేశానికీ లేదు. శత్రు భూభాగంలోకి వెళ్లి మా యోధుడిని రక్షించుకోవడం మాకు గర్వకారణం. ముఖ్యంగా ఈ ఆపరేషన్ కోసం ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు మాకు అద్భుతంగా సాయం చేశారు" అని ట్రంప్ కొనియాడారు. వేల విమానాల్లో ఒక విమానం కూలడం పెద్ద విషయం కాదని, కానీ తమ సైనికుడి ప్రాణం మాత్రం తమకు అత్యంత విలువైనదని ఆయన పునరుద్ధాటించారు.
అమెరికా వేస్తున్న ఈ అడుగులు చూస్తుంటే పశ్చిమాసియా ముఖచిత్రం పూర్తిగా మారిపోయేలా ఉంది. ఒక పైలట్‌ను రక్షించుకోవడానికి అమెరికా మోహరించిన ఆయుధ సంపదను చూస్తే.. ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి ట్రంప్ ఎంతలా ఆరాటపడుతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. భవిష్యత్తులో హార్మూజ్ జలసంధి తెరుచుకోకపోతే మాత్రం ఇరాన్ మౌలిక వ్యవస్థలన్నీ శిథిలాలుగా మారడం ఖాయం. అగ్రరాజ్యం వర్సెస్ ఇరాన్ పోరులో గెలుపెవరిదైనా.. చమురు ధరల మంటలతో అంతిమంగా నష్టపోయేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్యులే!
Also Read:
రాలిపోతున్న ఇరాన్ అగ్ర నేతలు: ఇజ్రాయెల్ దాడుల్లో ఇంటెలిజెన్స్ చీఫ్ బలిUS Iran Conflict: జలసంధి ఆదాయంలో వాటా ఇస్తేనే.. హోర్ముజ్‌పై ఇరాన్ కొత్త షరతు!
US Iran Conflict: మంగళవారం దాడులు తప్పవు: ఇరాన్‌కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్
US Iran Conflict : ఇస్ఫహాన్‌లో అమెరికా విమానాల కూల్చివేత!
Pet Dog Murder: కుక్క కోసం ఉద్యోగం వదిలేసి.. చైనా మహిళ చారిత్రక పోరాటం

