కన్నవారి కన్నీళ్లు తుడుద్దామని, భార్యాబిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇద్దామని ఏడు సముద్రాలు దాటి వెళ్లిన ఆ బతుకులు.. నెత్తుటి మడుగులో నిశ్శబ్దంగా ముగిసిపోయాయి. పండుగ పూట ఆనందంగా దేవుడి దర్శనం చేసుకుని వస్తున్న ఆ అమాయకులపై ఏకంగా మృత్యువే తూటాల వర్షం కురిపించింది. పరాయి దేశంలో, అర్ధరాత్రి పూట జరిగిన ఈ భయంకరమైన హత్యల వెనుక ఉన్న ఆ కిరాతకుడు ఎవరు? అసలు ఇటలీలోని ప్రశాంత వాతావరణంలో ఈ నెత్తుటి క్రీడ ఎందుకు జరిగింది?
పండుగ పూట పగబట్టిన మృత్యువు.. నెత్తురోడిన గురుద్వారా!
ఇటలీలోని బెర్గామో ప్రావిన్స్ పరిధిలో ఉన్న కోవో పట్టణంలో వందలాది మంది ప్రవాస భారతీయులు ఎంతో భక్తిశ్రద్ధలతో వైశాఖి పండుగ జరుపుకుంటున్నారు. అక్కడి ఒక వేర్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక గురుద్వారాలో ఈ వేడుకలు అత్యంత ఘనంగా సాగుతున్నాయి. వేడుకలన్నీ ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ప్రశాంతంగా బయటకు వస్తున్నారు 48 ఏళ్ల రాజిందర్ సింగ్, 48 ఏళ్ల గుర్మిత్ సింగ్.
కానీ, అప్పటికే చీకట్లో వాళ్ల ప్రాణాలను బలితీసుకునేందుకు ఒక మృత్యుదూత పొంచి ఉన్నాడు. ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా తూటాల వర్షం కురిపించాడు. శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోవడం, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ ఇద్దరు భారతీయులు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ భయంకరమైన కాల్పుల్లో మరో వ్యక్తికి కూడా బుల్లెట్ గాయాలు కాగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. అత్యంత రద్దీగా ఉండే ప్రార్థనా స్థలం వెలుపల జరిగిన ఈ దారుణ కాండ స్థానిక ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పక్కా స్కెచ్‌తో టార్గెట్.. వణికిస్తున్న పోలీసుల దర్యాప్తు!
మొదట ఈ ఘోరకలిని చూసి ఎదో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ అనుకున్నారంతా! కానీ, ఇటలీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మైండ్ బ్లాంక్ అయ్యే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఏమాత్రం క్షణికావేశంలో జరిగిన గొడవ కాదని, పక్కా ప్రణాళికతో, పగతో రగిలిపోతూ చేసిన మర్డర్ అని అధికారులు నిర్ధారించారు.
నెత్తురుతో తడిసిన ఆ ఘటనా స్థలం నుంచి పోలీసులు సుమారు పది బుల్లెట్ షెల్ కేసింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పక్కా స్కెచ్‌తో ముందుగానే అక్కడికి చేరుకుని, కాల్పులు జరిపిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిద్ధంగా ఉంచుకున్న కారులో పారిపోయినట్లు విచారణలో తేలింది.
కిరాతకుడు మనోడేనా.. ప్రత్యక్ష సాక్షుల గుండెకోత!
ఈ కాల్పులను కళ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆ దారుణానికి ఒడిగట్టిన కిరాతకుడు కూడా భారత సంతతికి చెందినవాడేనని తెలుస్తోంది. అతను తరచూ అదే గురుద్వారాకు వస్తుంటాడని, మరణించిన రాజిందర్, గుర్మిత్‌లతో అతనికి ముందు నుంచే ఏవైనా పాత కక్షలు ఉండి ఉండొచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.
"అతను పక్కా గురితో వాళ్ల మీదే కాల్పులు జరిపాడు. వారికి కనీసం తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు" అని అక్కడే ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి వణికిపోతూ మీడియాకు వివరించారు.
సీసీటీవీల ఆధారంగా వేట.. స్వగ్రామాల్లో విషాద ఛాయలు!
ఈ సంచలన ఘటనతో అప్రమత్తమైన ఇటలీ పోలీసులు ఘటనా స్థలాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ దుర్మార్గుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అక్కడున్న సీసీటీవి ఫుటేజీలను జల్లెడ పడుతూ.. కారు నంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఇటలీలో జరిగిన ఈ నెత్తుటి వార్త, అటు భారత్‌లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులకు చేరడంతో వారి స్వగ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
కుటుంబాల కోసం వలస వెళ్లిన వారి ఉజ్వల భవిష్యత్తు కలలు ఇలా పరాయి గడ్డపై తుపాకీ తూటాలకు బలికావడం.. యావత్ మానవత్వాన్ని తీవ్రంగా కలచివేస్తోంది!

