పశ్చిమాసియా అగ్నిగుండంలో ఇరాన్ కాలిపోతున్న వేళ... తెరవెనుక అసలు సిసలైన రాజకీయ భూకంపం సృష్టిస్తోంది! బాంబుల మోతను మించిన నిశ్శబ్ద విప్లవం టెహ్రాన్ వీధుల్లో జరుగుతోంది. శత్రువుల దాడులతో అల్లాడుతున్న ఇరాన్ ప్రభుత్వ పగ్గాలు ఇప్పుడు పూర్తిగా ఆ దేశ సైన్యం గుప్పిట్లోకి వెళ్లిపోయాయి!
చేతులెత్తేసిన అధ్యక్షుడు.. సైన్యం చేతికి పవర్!
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇరాన్ ప్రభుత్వాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుంది. ఇరాన్ ఇంటర్నేషనల్ సంచలన నివేదిక ప్రకారం.. పాలకవర్గానికి, సైనిక నాయకత్వానికి మధ్య రగులుతున్న ఆధిపత్య పోరు చివరకు అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్‌ను ఊపిరాడని రాజకీయ సంక్షోభంలోకి నెట్టేసింది.
అధ్యక్షుడికి ఉన్న కనీస అధికారాలను, ఆయన తీసుకునే నిర్ణయాలను, నియామకాలను ఐఆర్జీసీ అడుగడుగునా అడ్డుకుంటోంది. ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ చేతుల్లోంచి పాలనా పగ్గాలను లాగేసుకుని, ఏకఛత్రాధిపత్యంగా అధికారాన్ని దర్జాగా చేజిక్కించుకుంది.
మంత్రిగారి నియామకానికి బ్రేక్.. వాహిది వార్నింగ్!
కొత్త ఇంటెలిజెన్స్ మంత్రిని (నిఘా మంత్రి) నియమించాలని అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిది దారుణంగా అడ్డుపడ్డారు.
హుస్సేన్ దేహ్‌ఘాన్‌తో సహా అధ్యక్షుడు ప్రతిపాదించిన అభ్యర్థులందరి పేర్లను వాహిది నిర్మొహమాటంగా చెత్తబుట్టలో వేశారు. దేశం భీకరమైన యుద్ధ పరిస్థితుల్లో ఉన్నందున.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దేశ రక్షణ, ఇంటెలిజెన్స్ లాంటి అత్యంత సున్నితమైన పదవుల నియామకాలన్నీ నేరుగా సైన్యమే స్వయంగా చేపడుతుందని వాహిది అత్యంత కఠినంగా తేల్చిచెప్పారు.
ఖమేనీ మరణంతో మారిన సీన్.. గుప్పిట్లో అధ్యక్షుడు
ఒకప్పుడు ఇరాన్ రాజకీయ ముఖచిత్రం వేరు. ఏ నిఘా మంత్రిని నియమించాలన్నా.. ముందు సుప్రీం లీడర్ ఆమోద ముద్ర పడాలి. దేశ భద్రతా విభాగాలపై అంతిమ నిర్ణయం ఆయనదే.
కానీ యుద్ధం మొదలైన తొలి రోజే సాక్షాత్తూ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ దారుణ హత్యకు గురికావడం ఇరాన్ పునాదులను కదిపేసింది. ఆయన వారసుడిగా వచ్చిన కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ హోదాపై ఇంకా ఎటూ తేలని అనిశ్చితి కొనసాగుతోంది.
ఇదే అదనుగా భావించిన ఐఆర్జీసీ.. ఏకంగా దేశ అధ్యక్షుడినే తమ కీలుబొమ్మగా మార్చేసుకుంది. ప్రభుత్వ యంత్రాంగంపై తమ ఉక్కుపాదాన్ని మరింత కఠినంగా మోపింది.
మోజ్తాబా చుట్టూ ఇనుప కోట.. కరువైన దర్శనం!
పరిస్థితులు చేజారిపోతుండటంతో కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని అత్యవసరంగా కలిసేందుకు అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా.. కనీస స్పందన లేదు!
ఎందుకంటే, ఐఆర్జీసీ సీనియర్ అధికారులతో ఏర్పడిన ఒక 'మిలటరీ కౌన్సిల్' ఇప్పుడు కీరోల్ పోషిస్తోంది. ఆ కౌన్సిల్ మోజ్తాబా చుట్టూ ఒక కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ఆయనను బంధించినంత పని చేసింది.
దేశంలో అసలేం జరుగుతుందో తెలియజేసే ప్రభుత్వ నివేదికలు ఏవీ ఆయన చెవిన పడకుండా ఆ మిలటరీ కౌన్సిల్ పక్కాగా అడ్డుకుంటోంది.
అనారోగ్యమా? అంతర్గత కుమ్ములాటలా?
ఇదంతా చూస్తుంటే మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం కూడా ఏమైనా క్షీణించిందా అన్న ఊహాగానాలు సైతం బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు, ఆయన సన్నిహితుల మధ్యే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అంతర్గత విబేధాలు రగులుతున్నాయి.
సుప్రీం లీడర్ ఆఫీసులో అత్యంత కీలక పాత్ర పోషించే 'అలీ అస్గర్ మీర్ హిజాజీ'ని ఎలాగైనా పదవి నుంచి పీకేయాలని మోజ్తాబా సహాయకులు కుట్రలు పన్నుతున్నారు. ఎందుకంటే.. మోజ్తాబాను సుప్రీం లీడర్‌గా కూర్చోబెట్టడాన్ని హిజాజీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
హిజాజీ వార్నింగ్.. టార్గెట్ చేసిన ఇజ్రాయెల్!
సుప్రీం లీడర్ పీఠం ఎక్కే అర్హతలు మోజ్తాబాకు ఏమాత్రం లేవని, ఇలా వంశపారంపర్యంగా రావడం ఆయతుల్లా అలీ ఖమేనీ సిద్ధాంతాలకే విరుద్ధమని 'ఎక్స్‌పర్ట్ అసెంబ్లీ' (Expert Assembly) కి హిజాజీ ముందే గట్టిగా హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ మోజ్తాబాను ఎంపిక చేస్తే.. దేశం మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోతుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ శాశ్వతంగా సమాధి అవుతాయని హిజాజీ అప్పుడే కుండబద్దలు కొట్టారు.
ఆశ్చర్యకరంగా, యుద్ధం మొదలైన మొదటి వారంలోనే హిజాజీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ అత్యంత భయంకరమైన వైమానిక దాడి చేసిందని ఇజ్రాయెల్ మీడియా కోడై కూసింది. అయితే, ఆ దాడుల నుంచి ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారని ఆ తర్వాతి రిపోర్టులు వెల్లడించాయి.
బయట ఇజ్రాయెల్ బాంబుల దాడులు.. లోపల సైన్యం సైలెంట్ ఆపరేషన్! మొత్తానికి ఒకనాటి శక్తివంతమైన ఇరాన్ దేశం ఇప్పుడు మిలిటరీ బూట్ల కింద నలిగిపోతూ, చీకటి భవిష్యత్తు వైపు పరుగులు తీస్తోంది!
Also Read:
ఇరాన్ యుద్ధం మాకొద్దు: డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ ప్రధాని షాక్!ఖర్గ్ దీవిపై ట్రంప్ కన్ను.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న అమెరికా!
బతికున్నాడా.. చనిపోయాడా? ఇరాన్ సుప్రీం లీడర్ అదృశ్యం వెనుక మిస్టరీ!
తెరవెనుక రహస్య సందేశాలు.. ఇరాన్-అమెరికా వార్‌లో కొత్త ట్విస్ట్
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలనం: 2 వారాల్లో ముగింపు!

