ఢిల్లీ పీఠం పునాదులు కదులుతున్నాయి! నిన్నటి దాకా ఒకే కంచంలో తిన్న ఆత్మీయుడే.. నేడు పార్టీ గుండెల్లో బల్లెం దించితే ఆ అధినేత ఆవేదన ఎలా ఉంటుంది? ఆమ్ ఆద్మీ పార్టీలో చెలరేగిన రాజకీయ సునామీపై తొలిసారిగా అరవింద్ కేజ్రీవాల్ మౌనం వీడారు. తన నమ్మినబంటు రాఘవ్ చద్దా ఏకంగా ఢిల్లీ పీఠానికే ఎసరు పెడుతుంటే, కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
పంజాబీలకు వెన్నుపోటు.. కేజ్రీవాల్ సంచలన ట్వీట్!
తనతో పాటు ఏడుగురు రాజ్యసభ ఎంపీలతో కలిసి రాఘవ్ చద్దా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం ఢిల్లీ రాజకీయాలను కుదిపేసింది. ఈ మహా పరిణామంపై ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. బీజేపీ మరోసారి పంజాబీలకు తీరని ద్రోహం చేసిందని, ఇది ముమ్మాటికీ పంజాబ్ ప్రజల నమ్మకానికి వెన్నుపోటు అని కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
రాజ్యసభ చైర్మన్‌కు లేఖ.. కమలం గూటికి ఉద్దండులు!
తాను, అశోక్ మిట్టల్, విక్రమ్ సింగ్ సాహ్ని, స్వాతి మలివాల్, హర్బజన్ సింగ్, సందీప్ పాఠక్, రాజిందర్ గుప్తాలు కమలం గూటికి చేరుతున్నామని చద్దా మీడియా సాక్షిగా కుండబద్దలు కొట్టారు. కేవలం పార్టీ మారడమే కాదు, ఏకంగా ఆప్ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ వీరంతా కలిసి రాజ్యసభ ఛైర్మన్‌కు అధికారికంగా లేఖ సమర్పించడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
మంత్రి పదవికి ఆశపడే.. అమిత్ షా స్కెచ్!
ఇదంతా బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని ఆప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాఘవ్ చద్దాను కేవలం ఒక పావుగా వాడుకుని తమ పార్టీలో చీలిక తెచ్చేందుకు కమలనాథులు కుట్ర పన్నారని ఆరోపించింది. ఏడుగురు రాజ్యసభ సభ్యులను తీసుకొస్తే.. చద్దాను ఏకంగా కేంద్ర మంత్రిని చేస్తానని స్వయంగా అమిత్ షా ఆఫర్ ఇచ్చినట్లు తమకు పక్కా సమాచారం ఉందని ఆప్ నేతలు బాంబు పేల్చారు. అయితే, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని బీజేపీ వెంటనే తోసిపుచ్చింది.
దూరం పెంచిన లిక్కర్ కేసు.. డిప్యూటీ పదవి ఊస్ట్!
ఏప్రిల్ నెల మొదట్లో రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను కేజ్రీవాల్ అర్థాంతరంగా తొలగించడం ఈ రాజకీయ భూకంపానికి దారితీసింది. పార్లమెంట్‌లో సామాన్యుల సమస్యలపై సింహంలా గర్జించిన ఆయనను ఉన్నట్టుండి ఎందుకు తొలగించారో ఎవరికీ స్పష్టంగా తెలియదు.
కానీ, ఆ నిర్ణయానికి ముందే పార్టీలో ఆయన ప్రాధాన్యతను అధిష్టానం క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలకు సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. చద్దా కనీసం స్పందించకపోవడమే ఈ గ్యాప్‌కు అసలు కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నమ్మిన బంటే.. నట్టేట ముంచాడు!
ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పటి నుంచి రాఘవ్ చద్దా కేజ్రీవాల్‌కు నీడలా ఉన్నాడు. అధినేతకు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరిగా ముద్ర పడ్డాడు. ఆ నమ్మకంతోనే 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి, 2022లో పంజాబ్ నుంచి ఏకంగా రాజ్యసభకు పంపారు. కానీ, అదే నమ్మకం నేడు కమలం గూటికి చేరి ఆప్ పునాదులనే పెకిలించే స్థాయికి చేరింది!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని రాఘవ్ చద్దా జంప్ నిరూపించింది. నమ్మినబంటే వెన్నుపోటు పొడిస్తే దశాబ్దాల కష్టం పేకమేడలా ఎలా కూలిపోతుందో చెప్పడానికి.. ఢిల్లీలో జరుగుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లరే అతిపెద్ద ఉదాహరణ. రాబోయే ఎన్నికల్లో ఈ విలీన పర్వం ఆప్‌కు సమాధి కడుతుందా? లేక సానుభూతి పవనాలతో మళ్లీ నిలబెడుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి!

