Pakistan PM Shehbaz Sharif Reduces Petrol Prices By 80 PKR After Public Backlash : పశ్చిమాసియాలో పేలుతున్న బాంబుల మోత.. ప్రపంచ దేశాలకు ఇంధన సంక్షోభం అనే సరికొత్త సినిమా చూపిస్తోంది! ఎక్కడో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లులు పొడుస్తూ, పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల రూపంలో దడ పుట్టిస్తోంది. ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి, అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న దాయాది పాకిస్థాన్‌లో అయితే ఈ పెట్రోల్ మంటలు అక్షరాలా సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తున్నాయి. సామాన్యుల ఆగ్రహ జ్వాలలు రగులుకోవడంతో, రాత్రికి రాత్రే ఊహించని ట్విస్ట్ ఇస్తూ షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలోని ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై ఏకంగా 80 రూపాయలు తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
గురువారం బాదుడు.. శుక్రవారం ఊరట!
పాకిస్థాన్ ప్రభుత్వం గురువారం రోజున తీసుకున్న నిర్ణయం సామాన్యుల పాలిట మరణశాసనంగా మారింది. పెట్రోల్‌పై ఏకంగా 43 శాతం, హైస్పీడ్ డీజిల్ (HSD)పై 55 శాతం మేర ధరలను పెంచుతూ ప్రజల నెత్తిన పెద్ద బండరాయి వేసింది. ఈ ఊహించని పెంపుతో ఒక్కసారిగా లీటర్ పెట్రోల్ ధర 458 పాకిస్థాన్ రూపాయలకు, డీజిల్ ధర ఏకంగా 520 రూపాయలకు చేరుకుని రికార్డు సృష్టించింది.
దీంతో పాక్ వీధుల్లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. సర్కారు తీరుపై సామాన్యులు తీవ్ర స్థాయిలో మండిపడటంతో, పరిస్థితి చేయిజారిపోతుందని గ్రహించిన ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గి దిగిరాక తప్పలేదు.
జాతినుద్దేశించి షెహబాజ్ సంచలన ప్రసంగం
ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను, విమర్శలను చల్లార్చేందుకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ శుక్రవారం రాత్రి హుటాహుటిన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ఉత్కంఠభరిత ప్రసంగంలో ఇంధన ధరల తగ్గింపుపై ఆయన కీలక ప్రకటన చేశారు.
సామాన్యులకు ఉపశమనం కలిగించేలా పెట్రోల్‌పై ఏకంగా 80 రూపాయలు తగ్గిస్తున్నామని, ఇకపై లీటర్ పెట్రోల్ 378 రూపాయలకే లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కనీసం రాబోయే నెల రోజుల పాటు ఈ సవరించిన ధరలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన ప్రజలకు గట్టి హామీ ఇచ్చారు. హైస్పీడ్ డీజిల్‌పై కూడా ప్రభుత్వం లెవీని పూర్తిగా తొలగించిందని ఆయన వెల్లడించారు.
నాలుగు రోజులకే బాదుడు.. ఐఎంఎఫ్ వార్నింగ్
పశ్చిమాసియాలో రగులుకున్న ఈ సంఘర్షణ వల్లే దేశంలో పెట్రోల్ ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయని ప్రధాని షెహబాజ్ అంగీకరించారు. అయితే, ధరల నియంత్రణకు తమ ప్రభుత్వం అన్ని రకాల కఠిన చర్యలు చేపడుతోందని ఆయన భరోసా ఇచ్చారు.
వాస్తవానికి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన కేవలం నాలుగు రోజులకే పాకిస్థాన్ పెట్రోల్, డీజిల్ ధరలను 20 శాతం మేర పెంచేసింది. మళ్లీ గురువారం ఆ బాదుడును ఏకంగా రెట్టింపు చేసి ప్రజల నడ్డి విరిచింది. ఇప్పటికే అధిక పేదరికంతో అల్లాడుతున్న పాకిస్థాన్ లాంటి దేశాల్లో, ఈ స్థాయి ఇంధన ధరల పెరుగుదల భయంకరమైన ఆహార సంక్షోభానికి దారితీస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ట్విస్టుల వెనుక ఐఎంఎఫ్ కండిషన్లు
పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న పాకిస్థాన్.. తమను ఆదుకోవాలంటూ ఐఎంఎఫ్ నుంచి భారీగా అప్పులు తీసుకుంది. ఇందుకోసం ఆ సంస్థ విధించే అత్యంత కఠినమైన షరతులకు తలొగ్గక తప్పని దయనీయ పరిస్థితి ఎదురైంది.
ఇంధన ధరల పెంపు, ప్రజలపై పన్నుల భారం మోపడం వంటి నిర్ణయాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఐఎంఎఫ్ ఖరాఖండిగా తేల్చిచెప్పడంతో పాక్‌కు మరో గత్యంతరం లేకుండా పోయింది.
పొదుపు మంత్రం.. బడులకు సెలవులు!
చమురు మంటలను తట్టుకునేందుకు పాకిస్థాన్ ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తోంది. దేశంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆఫీసుల పనిదినాలను వారానికి కేవలం నాలుగు రోజులకు మాత్రమే కుదించి సంచలనం సృష్టించింది.
ఇక విద్యా సంస్థలకైతే ఏకంగా సెలవులు పొడిగించడమే కాకుండా, విద్యార్థుల ప్రయాణాలను తగ్గించేందుకు ఆన్‌లైన్ తరగతులకు మార్చేసింది.
ఒకవైపు అప్పుల కుప్ప, మరోవైపు ఐఎంఎఫ్ కఠిన షరతులు, ఇంకోవైపు అంతర్జాతీయ యుద్ధం.. ఈ మూడింటి మధ్య నలిగిపోతున్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందా లేక కుప్పకూలుతుందా అన్నది కాలమే తేల్చాలి!
Also Read:
అమెరికా vs ఇరాన్: శాంతి చర్చలు ఫ్లాప్.. ఇరాన్ వంతెన నేలమట్టం!రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ట్రంప్ రికార్డ్ బడ్జెట్ ప్రతిపాదన
చమురు సంక్షోభం వేళ భారత్‌కు అండగా నిలిచిన రష్యా
యుద్ధం ఎఫెక్ట్: సామాన్యుడి దాహానికి చమురు సెగ.. వాటర్ బాటిళ్ల ధరలు పెంపు
జేడీ వాన్స్‌కు ఫ్రాడ్ జార్ పోస్ట్: ట్రంప్ మాస్టర్‌ప్లాన్ ఇదేనా?

