తమిళ రాజకీయ రణరంగం వేడెక్కింది. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపే లక్ష్యంగా ఒకవైపు అధికార డీఎంకే, మరోవైపు అన్నాడీఎంకే సైన్యాలు కత్తులు దూస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో, కోట్ల మంది అభిమానుల ఆశలను మోస్తూ రాజకీయ బరిలోకి దిగిన 'దళపతి' విజయ్, తన టీవీకే (TVK) పార్టీతో తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కానీ, క్లైమాక్స్‌కు చేరుకున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో ఊహించని ట్విస్ట్! పోలింగ్ సమయం దగ్గర పడుతుంటే ప్రచారంతో హోరెత్తించాల్సిన హీరో.. సడెన్‌గా తెర వెనుకకు ఎందుకు వెళ్లిపోతున్నాడు?
అన్నీ ఉన్నా.. అడుగు ముందుకు పడట్లేదేం?
మార్చి 15న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి టీవీకే చీఫ్ విజయ్ వేస్తున్న అడుగులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పోలీసులు అనుమతి ఇవ్వలేదనో, వేరే ఆటంకాలు ఉన్నాయనో కాదు.. ప్రచారానికి పక్కాగా అన్ని అనుమతులు ఉన్నప్పటికీ విజయ్ తన ఎన్నికల కార్యక్రమాలను, సభలను వరుసగా రద్దు చేసుకుంటుండటం ఇప్పుడు తమిళనాట తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
కొత్త ముఖాలకు దళపతే దిక్కు.. కానీ!
టీవీకే పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులలో మెజారిటీ శాతం రాజకీయాలకు బొత్తిగా కొత్త ముఖాలే. వారిని ప్రజలకు పరిచయం చేయాల్సిన, వాళ్లందరి తరఫున అలుపెరగకుండా ప్రచారం చేయాల్సిన బాధ్యత పూర్తిగా విజయ్ భుజాలపైనే ఉంది. ప్రచార పర్వం ముగియడానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న ఈ ఉత్కంఠభరిత పరిస్థితులలోనూ.. దళపతి ఇలా సభలు రద్దు చేసుకోవడం పార్టీ వర్గాల్లో కలవరం రేపుతోంది.
క్యాన్సిల్.. క్యాన్సిల్.. క్యాన్సిల్!
ఈ పొలిటికల్ సినిమా స్క్రీన్‌ప్లే చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. మార్చి 30వ తేదీన విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత పెరంబూరు, కొలాతూర్‌లలో దళపతి ప్రచార రథం పరుగులు పెట్టింది. కానీ ఆ తర్వాత విల్లివక్కమ్‌లో నిర్వహించాల్సిన సభ సడెన్‌గా రద్దు అయ్యింది. సెక్యూరిటీ సమస్యల వల్లే దీన్ని ఆపేశామని టీవీకే వర్గాలు తెలిపాయి.
మళ్లీ ఏప్రిల్ 2న తిరుచిరాపల్లి ఈస్ట్‌లో పర్యటించిన విజయ్, ఏప్రిల్ 4న పుదుచ్చేరి వెళ్లారు. కానీ ఏప్రిల్ 6న టి. నగర్, విళ్లివక్కమ్‌లలో జరగాల్సిన ప్రచారాన్ని సమయం లేదనే కారణంతో రద్దు చేసేశారు.
నాలుగు రోజుల సుదీర్ఘ విరామం తీసుకున్న తర్వాత ఏప్రిల్ 8వ తేదీన తిరునల్వేలి, తూత్తుకుడిలో విజయ్ రోడ్ షో అదరగొట్టింది. కానీ మళ్లీ బ్రేక్! ఏప్రిల్ 9, ఏప్రిల్ 11 తేదీల్లో కడలూరులో జరగాల్సిన కార్యక్రమాలు రద్దు అయ్యాయి. ఏప్రిల్ 13న తిరువళ్లూరులో జరగాల్సిన ఎన్నికల సమావేశం కూడా క్యాన్సిల్ అయ్యింది. అయితే ఏప్రిల్ 13న కన్యాకుమారి, ఏప్రిల్ 14న పుదుక్కొట్టైలలో మాత్రం విజయ్ ప్రచారం సాగనుంది. సభల రద్దుపై టీవీకే వర్గాలు మాత్రం అధికారికంగా నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఆ భయంకరమైన గతం వెన్నాడుతోందా?
ఈ వరుస రద్దుల వెనుక ఒక భయంకరమైన గతం దాగి ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ నెలలో కరూర్‌లో జరిగిన భారీ తొక్కిసలాట ఘటన విజయ్‌ను ఇంకా వెంటాడుతోందని తెలుస్తోంది. ఆ దుర్ఘటనలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. టీవీకే నిర్వహణా లోపమే ఈ మరణ మృదంగానికి కారణమనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆ చేదు అనుభవం వల్లే, జనసందోహాన్ని నియంత్రించలేక మరో ప్రమాదం జరగకూడదనే ఉద్దేశ్యంతోనే విజయ్ ఎన్నికల ప్రచార సభల విషయంలో అత్యంత ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్.
పాలిటిక్స్‌లో 'వర్క్ ఫ్రమ్ హోమ్'
విజయ్ వెనకడుగు ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రంలా దొరికింది. విజయ్ తీరుపై డీఎంకే, అన్నాడీఎంకే నేతలు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. "విజయ్ రాజకీయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు" అంటూ తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు.
తెర మీద సింహంలా గర్జించే దళపతి.. రాజకీయ క్షేత్రంలో మాత్రం ప్రత్యర్థులకు ఏమాత్రం దొరకకుండా సైలెంట్‌గా వ్యూహాలు రచిస్తున్నారా? లేక గత సంఘటనల భయంతో వెనకడుగు వేస్తున్నారా అన్నది ఏప్రిల్ 23న తమిళ ప్రజలు ఈవీఎంల సాక్షిగా తేల్చనున్నారు!

