పెళ్లి అనే పవిత్ర బంధంలో అడుగుపెట్టిన ఒక ఆడపిల్ల.. అత్తింటిని తన సొంత ఇల్లుగా భావిస్తుంది. ఆ ఇంటి వంటగదిపై తనకంటూ ఒక హక్కు ఉంటుందని కలలు కంటుంది. కానీ, అదే వంటగదిలోకి వెళ్లకుండా ఆమెను అడ్డుకుంటే? కనీసం వండుకునే హక్కును లాగేసుకుని, పట్టెడన్నం పెట్టకుండా రాచిరంపాన పెడితే? సమాజంలో ఆడదాని గౌరవాన్ని దారుణంగా దెబ్బతీసే ఇలాంటి నీచమైన చర్యలు భౌతిక హింస కంటే ప్రమాదకరమైనవని, అది ముమ్మాటికీ 'మానసిక క్రూరత్వమే' అని బాంబే హైకోర్టు తన చారిత్రక తీర్పుతో కుండబద్దలు కొట్టింది.
మహారాష్ట్రలో 2022లో ఓ జంటకు వివాహమైంది. కొత్త జీవితంపై ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆ నవ వధువుకు కొద్ది రోజులకే ఊహించని నరకం మొదలైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలుకావడంతో అత్తింటి వారు ఆమెపై వేధింపుల పర్వానికి తెరలేపారు.
కట్టుకున్న భర్త, అత్తమామలు కలిసి తనను అత్యంత హీనంగా చూశారని, ఒక మనిషిగా తన ప్రాథమిక హక్కులను కాలరాశారని ఆమె న్యాయస్థానం ముందు కన్నీటి పర్యంతమైంది.
వంటగదికి నో ఎంట్రీ.. నరక ప్రాయంగా జీవితం!
కోడలు ఇంటి మహాలక్ష్మి అంటారు. కానీ, ఆ ఇంటి ఆడపడుచును ఏకంగా వంటగదిలోకే రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. ఇంట్లో తన ఇష్టప్రకారం వంట చేసుకునే కనీస హక్కును లాక్కున్నారు. కడుపు నిండా సరైన భోజనం కూడా పెట్టకుండా ఆమెను తీవ్రమైన గృహహింసకు, భయంకరమైన వేధింపులకు గురిచేశారు.
అంతటితో వారి పైశాచికత్వం ఆగలేదు. ఆమె తెచ్చుకున్న విలువైన నగలను సైతం ఇంటి నుంచి బయటకు విసిరేశారు. కన్నవారిని చూసేందుకు పుట్టింటికి వెళ్లకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.
ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని, విడాకులు ఇవ్వాలంటూ తీవ్ర స్థాయిలో మానసిక ఒత్తిడి తెచ్చారని ఆ బాధితురాలు కోర్టుకు వివరించింది. అయితే, ఇవన్నీ కట్టుకథలని, విడాకుల కోసం తాను ముందుగానే పిటిషన్ వేసినందుకే ప్రతీకారంగా తన భార్య ఈ వేధింపుల కేసు పెట్టిందని భర్త తరఫు న్యాయవాదులు వాదించారు.
అది మానసిక క్రూరత్వమే.. భర్తకు హైకోర్టు షాక్!
తన భార్య పెట్టిన ఈ వేధింపుల కేసును కొట్టివేయాలంటూ ఆ భర్త బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ చేపట్టిన నాగ్‌పూర్ ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఊర్మిళా జోషి-ఫాల్కే.. ఆ భర్తకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఆయనపై నమోదైన వేధింపుల కేసును కొట్టేయడానికి న్యాయమూర్తి నిర్మొహమాటంగా నిరాకరించారు.
ఒక మహిళను ఇంట్లో నిరంతరం వేధించడం, ఆమె స్వేచ్ఛను హరించి కదలికలను పరిమితం చేయడం, వంట చేసుకోనివ్వకుండా కనీస అవసరాలను దూరం చేయడం వంటివి అమానవీయ చర్యలని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవన్నీ ఒక మహిళ పట్ల ప్రదర్శించే మానసిక క్రూరత్వానికి అత్యంత స్పష్టమైన ఉదాహరణలని న్యాయమూర్తి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
భారత శిక్షాస్మృతి (ఐపీసీ) లోని సెక్షన్ 498-A ప్రధాన ఉద్దేశమే.. భర్త లేదా బంధువుల చేతిలో భార్య బలికాకుండా, హింసకు గురికాకుండా రక్షించడమేనని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అత్తగారికి ఊరట.. సరైన ఆధారాల్లేవన్న కోర్టు!
ఈ కేసులో భర్తకు కోర్టు షాక్ ఇచ్చినా, అత్తగారికి మాత్రం ఒక ఊరట దక్కింది. తన అత్త ప్రోత్సాహంతోనే భర్త తనను ఇంతలా వేధించాడని భార్య ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, దీనిపై అస్పష్టత ఉందని కోర్టు తేల్చి చెప్పింది.
కేవలం అతనికి తల్లి అయినంత మాత్రాన.. ప్రతి కేసులోనూ ఆమెను నిందితురాలిగా చూపిస్తూ శిక్షించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు అత్తగారిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఒక మహిళ స్వేచ్ఛను, గౌరవాన్ని హరించే హక్కు ఎవరికీ లేదని, నాలుగు గోడల మధ్య జరిగే మానసిక హింస కూడా చట్టం దృష్టిలో ఘోరమైన నేరమేనని ఈ సంచలన తీర్పు సమాజానికి ఒక కఠినమైన సందేశాన్ని పంపింది!
Also Read:
అమెరికాకు సాధ్యం కానిది సాధించిన భారత్.. కల్పక్కంలో అణు అద్భుతం!Income Tax Notice: ఇస్త్రీ కార్మికుడికి 598 కోట్ల ఐటీ నోటీసు
భార్యపై 80 కేసులు పెట్టిన భర్తకు సుప్రీంకోర్టు భారీ షాక్!
West Bengal Elections: పశ్చిమ్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు గల్లంతు!
Ghost Rumors In College: కాలేజీలో దెయ్యాలు.. పూజలు

