India Achieves Historic Milestone In Nuclear Power With Kalpakkam Fast Breeder Reactor : ఒకప్పుడు అగ్రరాజ్యాలు మనల్ని చూసి నవ్వాయి.. అణు సాంకేతికత మీకెందుకని వెక్కిరించాయి. కానీ నేడు, ఆ అగ్రరాజ్యాలే మన ముందు తలవంచి నిలబడుతున్నాయి! అమెరికా, ఫ్రాన్స్, జపాన్ వంటి దిగ్గజ దేశాలు చేతులెత్తేసిన ఓ అద్భుతమైన టెక్నాలజీని.. మన భారతీయ శాస్త్రవేత్తలు సునాయాసంగా సాధించి ప్రపంచ చరిత్రను తిరగరాశారు. అవును, ఇది మన భారతదేశం గర్వించదగ్గ మహా అద్భుతం. రాబోయే 400 ఏళ్ల పాటు మన దేశంలో కరెంట్ కష్టాలు లేకుండా, ప్రపంచ ఇంధన ధరలతో పనే లేకుండా, మన ముంగిట్లోనే అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే మహా యజ్ఞం విజయవంతమైంది. కల్పక్కం అణు కేంద్రంలో ఆవిష్కృతమైన ఈ అద్భుత విజయం పూర్తి కథ ఇదిగో మీకోసం!
ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 'క్రిటికాలిటీ' విజయం!
తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) ఏప్రిల్ 6న తొలిసారిగా 'క్రిటికాలిటీ'ని సాధించి చరిత్ర సృష్టించింది. ఇది భారత పౌర అణు శక్తి ప్రయాణంలో ఒక మహా మలుపు.
"క్రిటికాలిటీని సాధించడం ద్వారా మన సత్తా ఏంటో ప్రపంచానికి చాటామని, ఇది భారతదేశం గర్వించదగ్గ సమయం" అని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్టు చేస్తూ ఈ అరుదైన విజయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు.
అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (IEA) కూడా భారత్ సాధించిన ఈ ఘనతను చూసి ప్రశంసల వర్షం కురిపించింది. “ఈ రియాక్టర్ ఇతర రియాక్టర్లతో పోలిస్తే అత్యల్ప ఇంధనంతో పనిచేస్తుంది. అంతేకాదు, క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ వైపు వెళ్లేందుకు కీలకమైన మార్గాన్ని చూపుతుంది” అంటూ ఐఈఏ ‘ఎక్స్’లో పేర్కొంది. అయితే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించిందంటే అసలు అర్థమేంటి? దీని వల్ల సాధారణ ప్రజల ఖర్చులపై, అలాగే దేశ ఆర్థిక-శక్తి భద్రతపై ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి?
2047 నాటికి 900 గిగావాట్ల డిమాండ్.. పరిష్కారం అణుశక్తే!
భారతదేశం ప్రస్తుతం రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతోంది. దీంతో భవిష్యత్తులో మనకు విద్యుత్, ఇంధన అవసరాలు విపరీతంగా పెరగనున్నాయి. ఒక అంచనా ప్రకారం, 2047 నాటికి భారత్‌లో విద్యుత్ డిమాండ్ అక్షరాలా 900 గిగావాట్లకు చేరుతుంది.
ప్రస్తుతం మనదేశ విద్యుత్ అవసరాల్లో సింహభాగం బొగ్గుతో నడిచే థర్మల్ ప్లాంట్లే తీరుస్తున్నాయి. జలవిద్యుత్, సౌరవిద్యుత్, పవన్ విద్యుత్ లాంటి పునరుత్పాదక మార్గాలు ఉన్నప్పటికీ.. వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తి చాలా తక్కువ. పైగా వాతావరణ పరిస్థితుల వల్ల వాటికి పరిమితులు ఉన్నాయి.
భవిష్యత్తులో ఈ రాక్షస డిమాండ్‌కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే అణువిద్యుత్ ఒక్కటే ఏకైక మార్గం. అణు విద్యుత్ కేంద్రాలు అత్యంత చౌకగా, నిరంతరాయంగా, ఎలాంటి కాలుష్యం లేకుండా కరెంటును ఉత్పత్తి చేయగలవు. సరిగ్గా ఈ సత్యాన్నే భారత అణుశక్తి పితామహుడైన డాక్టర్ హోమీ జహంగీర్ భాభా ఎప్పుడో పసిగట్టారు!
హోమీ భాభా మాస్టర్ ప్లాన్.. థోరియంతో మ్యాజిక్!
మన దేశంలో యురేనియం నిల్వలు చాలా తక్కువ. దానికోసం విదేశాల ముందు చెయ్యి చాచాల్సిందే. కానీ, మన గడ్డపై విరివిగా లభించే 'థోరియం' నిక్షేపాలను ఉపయోగించుకొని సొంతంగా అణువిద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం, 1950ల్లోనే హోమీ భాభా ఒక అద్భుతమైన 'మూడంచెల అణుశక్తి వ్యూహానికి' రూపకల్పన చేశారు.
ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ తీరాల్లో థోరియం ఇసుక పుష్కలంగా ఉంది. ప్రపంచంలోని థోరియం నిల్వల్లో ఏకంగా 25 శాతం మన దగ్గరే ఉండటం మన అదృష్టం. ఆయన హఠాన్మరణం, ఆ తర్వాత ఎదురైన రాజకీయ, భౌగోళిక అవాంతరాల వల్ల ఈ లక్ష్య సాధనలో ఆశించినంత వేగంగా ముందుకు వెళ్లలేకపోయాం. కానీ, ఇన్నాళ్ల తర్వాత కల్పక్కంలో ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్ట్ క్రిటికాలిటీ సాధించడం ద్వారా ఆ కల నిజమవడానికి ఒక బలమైన ముందడుగు పడింది.
ఏంటి ఆ మూడంచెల వ్యూహం?
తొలి దశ: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సహజసిద్ధమైన యురేనియంగా సాధారణ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లలో మండించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఈ అద్భుతమైన ప్రక్రియలో ఉప ఉత్పత్తి (బైప్రొడక్ట్)గా మనకు ప్లుటోనియం-239 ఉచితంగా లభిస్తుంది.
రెండో దశ (ఇక్కడే మన మ్యాజిక్): ఇలా ఫ్రీగా వచ్చిన ప్లుటోనియంను 'ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో' ప్రధాన ఇంధనంగా ఉపయోగిస్తారు. ఆ రియాక్టర్ కోర్ చుట్టూ మన దేశంలో దొరికే థోరియం-232 పొరలను అమర్చుతారు. ప్లుటోనియం విచ్ఛిత్తి చెందినప్పుడు వెలువడే శక్తివంతమైన న్యూట్రాన్లను ఆ థోరియం గ్రహిస్తుంది. ఈ ఆశ్చర్యకరమైన ప్రక్రియలో థోరియం కాస్తా విలువైన 'యురేనియం-233'గా మారుతుంది.
మూడో దశ (మన కలల ప్రాజెక్ట్): ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌లో అద్భుతంగా తయారైన యురేనియం-233ని, మన దగ్గర ఉన్న థోరియం నిల్వలను కలిపి మూడో దశలో ఇంధనంగా వాడతారు. ఈ దశలో యురేనియం మండుతూ నిరంతరాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో థోరియం మళ్లీ కొత్తగా యురేనియంగా మారుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా నిరంతరాయంగా, అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే ఉండొచ్చు. ఇదొక అక్షయపాత్ర లాంటిదన్నమాట!
అమెరికా ఫెయిల్.. ఫ్రాన్స్ ఫెయిల్.. భారత శాస్త్రవేత్తల గెలుపు!
కల్పక్కంలోని ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడం ద్వారా.. భారత్ ఈ అద్భుతమైన 'రెండో దశలోకి' అత్యంత విజయవంతంగా అడుగుపెట్టింది. క్రిటికాలిటీ అంటే.. ఒక రియాక్టర్ బయటి నుంచి ఎలాంటి సహాయం లేకుండానే, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ద్వారా దానంతట అదే నిరంతరాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే స్థితికి చేరడం! సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే.. సాధారణ రియాక్టర్లు ఇంధనాన్ని మండిస్తే, ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు మండించిన ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని పుట్టిస్తాయి!
అయితే, ఈ రియాక్టర్లలో న్యూట్రాన్లు అత్యంత భయంకరమైన వేగంతో ప్రయాణిస్తాయి. ఆ వేగం వల్ల పుట్టే విపరీతమైన వేడిని అదుపు చేయడానికి ఇందులో నీటికి బదులు 'ద్రవ సోడియం'ను కూలెంట్‌గా ఉపయోగిస్తారు. కానీ ఈ ద్రవ సోడియం గాలితో లేదా నీటితో కలిసినా మండిపోతుంది. అందుకే వీటి నిర్వహణ అత్యంత ప్రమాదకరమైనది, కష్టంతో కూడుకున్నది.
ఈ క్లిష్టమైన టెక్నాలజీ ద్వారా అణువిద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం ఇప్పటి వరకూ అమెరికా, ఫ్రాన్స్, జపాన్ లాంటి అగ్ర దేశాలు లక్షల కోట్లు ఖర్చు చేసి బొక్కబోర్లా పడ్డాయి. ప్రపంచం మొత్తం మీదా వాణిజ్య స్థాయిలో దీనిని నడుపుతోన్న ఏకైక దేశం రష్యా మాత్రమే. ఇక ఇప్పుడు వారి సరసన సగర్వంగా మన భారతదేశం చేరిపోయింది!
ఆ అగ్రరాజ్యాలు ఎందుకు చేతులెత్తేశాయి?
అమెరికా 1960ల్లోనే డెట్రాయిట్ సమీపంలో ఫెర్మి 1 రియాక్టర్‌ను నిర్మించింది. కానీ 1966లో కూలెంట్ సరఫరా ఆగిపోయి రియాక్టర్ దెబ్బతినడంతో ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టింది. ఆ తర్వాత 1983లో ఖర్చు తట్టుకోలేక, భద్రతా సమస్యలతో మరో ప్రాజెక్టును కూడా రద్దు చేసింది.
ఫ్రాన్స్ సైతం 1200 మెగావాట్ల సూపర్‌ఫినిక్స్ రియాక్టర్ ఏర్పాటు చేసి అబాసుపాలైంది. దశాబ్దాలపాటు ఇది ఉన్నా, కేవలం కొన్ని నెలలపాటే పని చేసింది. సోడియం లీకేజీలు, మంటల వల్ల 1998లో దీన్ని మూసివేసింది. జపాన్ కూడా 'మొంజు' రియాక్టర్‌ను నిర్మించి ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంది. రెండు దశాబ్దాల్లో కేవలం 250 రోజులు మాత్రమే పనిచేసిన ఆ రియాక్టర్‌ను 2016లో జపాన్ ప్రభుత్వం శాశ్వతంగా మూసివేసింది.
"మన కాళ్ల కింద ఉన్న మట్టి మన పాలిట కల్పవృక్షం"
మన దగ్గర పుష్కలంగా ఉన్న థోరియంతో అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగితే.. విదేశాల నుంచి ఇంధనం కొనాల్సిన పనే ఉండదు. పశ్చిమాసియా యుద్ధాలు, ఇరాన్ టెన్షన్లు, క్రూడాయిల్ ధరల భయాల నుంచి భారతదేశం శాశ్వతంగా విముక్తి పొందుతుంది. ప్రస్తుతం 8 గిగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి చేస్తున్న మనం, 2047 నాటికి 100 గిగావాట్లకు చేరుకోవాలి. కల్పక్కం రియాక్టర్ ఒక్కటే దాదాపు 30 లక్షల ఇళ్లకు కరెంట్ ఇస్తుంది. భవిష్యత్తులో ఈ థోరియం రియాక్టర్లు పూర్తి స్థాయిలో వస్తే.. వచ్చే 300-400 ఏళ్లపాటు భారత్ కరెంటు కోసం ఎవరి వంకా చూడాల్సిన అవసరమే ఉండదు. ఇది కదా నిజమైన విశ్వగురు విజయం!

