మీ జేబులో పాన్ కార్డ్ ఉందా? అయితే మీరు ఏ క్షణమైనా వందల కోట్లకు రుణగ్రస్తులు కావొచ్చు! "నేను రోజూ కష్టపడితేనే ఇల్లు గడిచే సామాన్యుడిని కదా, నాకేం అవుతుందిలే" అని మీరు నిర్లక్ష్యంగా ఉంటే.. రేపు ఉదయం మీ గుమ్మం ముందు కూడా ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్లు వాలిపోవచ్చు. పోయిన మీ పాన్ కార్డు మిమ్మల్ని ఏకంగా వందల కోట్ల పన్ను ఎగవేతదారుడిగా మార్చేయగలదు అనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. మీ ప్రమేయం లేకుండానే మీ పేరు మీద వజ్రాల వ్యాపారం జరిగి, కోట్లల్లో పన్ను కట్టాలని ఐటీ శాఖ నోటీసులు ఇస్తే ఆ గుండెకోత ఎలా ఉంటుందో ఈ పేద వాడి కథ చదివితే అర్థమవుతుంది. ప్రతి సామాన్యుడూ ఈ వార్త ఎందుకు చదవాలో, ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో తెలుసుకోండి.
ఏప్రిల్ ఫూల్ అనుకున్నాడు.. కానీ 598 కోట్ల షాక్!
రాజస్థాన్‌లోని అజ్మీర్ నగరంలో ఉన్న రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన జితేంద్ర కుమార్ బడోలియా.. రోజూ బట్టలు ఇస్త్రీ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే ఒక నిరుపేద. కాయా కష్టం చేస్తే కానీ రోజుకు ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు కూడా రాని ఆ సగటు జీవికి.. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గుండెగిబేల్మనే షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1న ఆయన ఇంటికి ఒక కవర్ వచ్చింది. అందులో అక్షరాలా రూ. 598,50,27,726 (సుమారు రూ. 598 కోట్లు) పన్ను బకాయి ఉన్నట్లు నోటీసులో రాసి ఉంది.
మొదట దీన్ని చూసిన జితేంద్ర.. ఏప్రిల్ 1 కదా, ఎవరో కావాలనే తనను 'ఏప్రిల్ ఫూల్' చేయడానికి ఈ ఫేక్ లెటర్ పంపారని లైట్ తీసుకున్నాడు. కానీ, ఆ నోటీసులోని ప్రభుత్వ ముద్రలు, తీవ్రత చూసి ఆయన కుటుంబం ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది.
లాయర్‌తో ఐటీ ఆఫీస్‌కు.. వెలుగులోకి మహా కుట్ర!
కన్నీరుమున్నీరుగా విలపిస్తూ జితేంద్ర తన న్యాయవాది రాకేశ్ థాడాతో కలిసి నేరుగా ఐటీ కార్యాలయానికి పరుగులు తీశాడు. అక్కడ అధికారులను కలిసి విచారించగా ఆయన కాలి కింద భూమి కుంగిపోయే అసలు నిజం బయటపడింది.
కొన్ని ఏళ్ల క్రితం జితేంద్ర తన పాన్ కార్డును ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఆ పాన్ కార్డు.. పాలీ ప్రాంతానికి చెందిన శత్రుఘ్న సింగ్ అనే ఒక బడా వ్యాపారవేత్త కంటపడింది. కార్డును చేజిక్కించుకున్న ఆ కేటుగాడు భయంకరమైన కుట్రకు తెరలేపాడు. జితేంద్రకు కనీస సమాచారం కూడా లేకుండానే.. ఆ పాన్ కార్డు ఆధారంగా గుట్టుచప్పుడు కాకుండా జీఎస్టీ (GST) రిజిస్ట్రేషన్ పొందాడు.
ఇస్త్రీ కార్మికుడి పేరుతో వజ్రాల వ్యాపారం!
అంతటితో ఆగకుండా, ఏకంగా ఒక బ్యాంకులో జితేంద్ర పేరు మీద ఖాతాను కూడా తెరిచాడు. ఆ ఫేక్ ఖాతా ద్వారా రాత్రికి రాత్రే కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు, ఖరీదైన ఆభరణాల క్రయవిక్రయాలు జరిపినట్లు ఐటీ విచారణలో తేలింది. ఒక సామాన్యుడి పేరు మీద ఈ భారీ లావాదేవీలు నిర్వహించి, వందల కోట్ల పన్ను ఎగవేయడంతో.. పాన్ కార్డు లింక్ ఆధారంగా ఐటీ శాఖ నోటీసులు నేరుగా జితేంద్ర ఇంటికి వచ్చాయి.
బ్యాంక్‌పై చర్యలు.. రంగంలోకి పోలీసులు
తాను ఘోరంగా మోసపోయానని గ్రహించిన జితేంద్ర.. వెంటనే అజ్మీర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఆ వ్యాపారిపై ఫిర్యాదు చేశాడు. తన ఏకైక వృత్తి బట్టలను ఇస్త్రీ చేయడమేనని, తనకు రోజుకు రూ. 500 నుండి రూ. 700 లకు మించి ఆదాయం రాదని, అలాంటిది తాను వజ్రాల వ్యాపారం ఎలా చేస్తానని ఆయన పోలీసుల ముందు కన్నీళ్లపర్యంతమయ్యాడు.
బాధితుడి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంపై న్యాయవాది రాకేశ్ థాడా మాట్లాడుతూ.. ఐటీ నోటీసులకు అధికారికంగా, చట్టబద్ధంగా వివరణ ఇస్తామని చెప్పారు. అసలు సరైన ధృవీకరణ లేకుండా ఒక వ్యక్తి పాన్ కార్డుతో అక్రమంగా ఖాతా తెరిచిన సదరు బ్యాంకుపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
ఆధార్, పాన్ కార్డులు ఈ రోజుల్లో మన ఆస్తి పత్రాల కంటే అత్యంత విలువైనవి. జితేంద్ర చేసిన ఒకే ఒక్క తప్పు.. తన పాన్ కార్డు పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, కొత్త దాని కోసం బ్లాక్ చేయించకపోవడం! రేపు ఉదయం మీ పాన్ కార్డు ఎవరి చేతిలోనైనా పడితే మీ పేరు మీద లోన్లు తీసుకోవచ్చు, లేదా ఇలాంటి ఫేక్ కంపెనీలు పెట్టి కోట్లు ఎగవేయొచ్చు. మీ ఐడెంటిటీ కార్డులు ఎక్కడైనా పోతే వెంటనే పోలీసులకు రిపోర్ట్ చేయండి, అలాగే మీ పాన్ కార్డు మీద సిబిల్ స్కోర్‌ను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. జాగ్రత్తగా లేకపోతే ఇస్త్రీ చేసే వ్యక్తికి 598 కోట్ల నోటీసు వచ్చినట్లే, మీ ఇంటి తలుపు కూడా ఐటీ అధికారులు తట్టొచ్చు!
Also Read:
భార్యపై 80 కేసులు పెట్టిన భర్తకు సుప్రీంకోర్టు భారీ షాక్!West Bengal Elections: పశ్చిమ్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు గల్లంతు!
Ghost Rumors In College: కాలేజీలో దెయ్యాలు.. పూజలు
Kerala Elections: పినరయి, మోదీలపై సీఎం రేవంత్ ఫైర్
Global Economic Crisis: కొవిడ్ కంటే పెద్ద ముప్పు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ఎఫెక్ట్

