ప్రజాస్వామ్యంలో సామాన్యుడికి ఉండే ఏకైక బ్రహ్మాస్త్రం.. ఓటు! అలాంటి ఓటు హక్కును ప్రయోగించి తమ తలరాతలను మార్చుకుందామని కలలు కంటున్న కోట్లాది మంది ఓటర్లకు.. పోలింగ్ కు సరిగ్గా రెండు వారాల ముందు కంటిమీద కునుకు లేకుండా పోయింది. రాత్రికి రాత్రే లక్షలాది మంది ఓట్లు గల్లంతయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమరశంఖం పూరించిన పశ్చిమ్ బెంగాల్ గడ్డపై ఇప్పుడు ఎక్కడ చూసినా ఓట్ల తొలగింపు మంటలే రగులుతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగుతున్న ఈ హోరాహోరీ పోరులో.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పెను సంచలనంగా, తీవ్ర వివాదాస్పదంగా మారింది. దాదాపు 90 లక్షల మందికి పైగా ఓట్లు ఆవిరైపోయాయన్న వార్త ఇప్పుడు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం (ఈసీ), కేంద్ర ప్రభుత్వంతో పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు.
కన్నీరు పెడుతున్న సామాన్యుడు.. ఆధారాలున్నా ఆవిరైన హక్కు!
ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన గృహిణి నదియా మోండల్ ఆవేదన చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. "నాకు పెళ్లై 27 ఏళ్లయింది. అప్పటి నుంచి ఇక్కడే జీవిస్తున్నాను. నా గుర్తింపును నిరూపించుకునేందుకు ఆధార్ కార్డు సహా అవసరమైన పత్రాలూ సమర్పించాను. అయినా నా ఓటును ఎలా తొలగిస్తారు?" అంటూ ఆమె రగిలిపోతున్నారు.
ఇది కేవలం ఒక నదియా పరిస్థితి మాత్రమే కాదు. అదే జిల్లాకు చెందిన చిరు వ్యాపారి బగ్‌బుల్ మల్లిక్ ది కూడా ఇదే దీనస్థితి. అధికారిక పత్రాలన్నీ అధికారులకు అందజేసినా, ఆయన కుటుంబం మొత్తానికి ఓటర్ల జాబితాలో స్థానం లేకుండా పోయింది. తమ గ్రామంలో ఎంతో మంది పేర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించారని, ఈసారి అసలు తాము ఓటేసే అవకాశమే లేకుండా పోయిందని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.
90 లక్షల ఓట్లు గల్లంతు.. ఈసీ సంచలన జాబితా!
తమ ప్రాణప్రదమైన ఓటు హక్కును కాపాడుకునేందుకు, ఓటర్ల జాబితాలో తిరిగి చేర్చేందుకు లక్షలాది మంది ప్రజలు అవసరమైన పత్రాలను, ఆధారాలను మళ్లీమళ్లీ సమర్పించారు. ఈ చేర్పుల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం రాత్రి 12వ విడత అనుబంధ జాబితాను విడుదల చేసింది.
అయితే ఇక్కడే అసలు బాంబు పేలింది. ఈ జాబితా సవరణ తర్వాత ఏకంగా 60.06 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడం గమనార్హం. వీరిలో కేవలం 32.6 లక్షల మందిని మాత్రమే చెల్లుబాటు అయ్యే ఓటర్లుగా నిర్ధారించగా, ఏకంగా 27.1 లక్షల మందిని 'అనర్హులు'గా ముద్రవేసి జాబితా నుంచి పీకేశారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత బెంగాల్‌లో మొత్తంగా 90.8 లక్షల మంది స్త్రీ, పురుషుల పేర్లు గల్లంతయ్యాయని అంచనా. దేశవ్యాప్తంగా చూసుకుంటే 97 లక్షల ఓట్ల తొలగింపుతో తమిళనాడు టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత అత్యధికంగా బెంగాల్‌లోనే ఓట్లు తొలగించారు. పోలింగ్‌కు సమయం మించిపోతున్నా.. కలకత్తా హైకోర్టు పర్యవేక్షణలోని ట్రైబ్యునళ్ల ముందు అప్పీల్ చేసుకునే అవకాశం మాత్రం బాధితులకు మిగిలి ఉంది. బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది.
రగులుతున్న బెంగాల్.. అధికారుల నిర్బంధం, సుప్రీంకోర్టు ఫైర్!
ఈ ఊహించని ఓట్ల గల్లంతు వ్యవహారం బెంగాల్‌లో అగ్గి రాజేసింది. సోమవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్‌హట్ ప్రాంతంలో భారీ నిరసనలు చెలరేగాయి. ఇది చాలదన్నట్లు గత వారం మాల్దా జిల్లాలో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. తొలగించిన ఓటర్ల అప్పీళ్లపై తీర్పులు ఇస్తున్న ఏడుగురు న్యాయాధికారులను స్థానికులు ఏకంగా నిర్బంధించారు.
ఈ ఘోరంతో తృణమూల్, బీజేపీ, ఎన్నికల సంఘం మధ్య కొత్త వివాదం చెలరేగింది. విధుల్లో ఉన్న అధికారులను రక్షించడంలో దారుణంగా విఫలమైన బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇక మంగళవారం అయితే ఉత్తర 24 పరగణాలతో పాటు బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లోని కేంద్రాలకు పేర్లు తొలగించిన ఓటర్లు భారీ సంఖ్యలో చేరుకుని అధికారులను నిలదీస్తున్నారు. ఇదే అదనుగా తృణమూల్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తోందని బీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తుండగా.. ఆ విమర్శలను తృణమూల్ అంతే దీటుగా ఖండించింది.
ఆ నాలుగు జిల్లాలే టార్గెట్.. పాలిటిక్స్‌లో అసలు ట్విస్ట్!
ఈ ఓట్ల తొలగింపు వెనుక ఒక పక్కా పొలిటికల్ స్కెచ్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం జనాభా గణనీయంగా ఉండే ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లోనే ఏకంగా 30.4 లక్షల ఓటర్ల జాబితా నిర్ధారణ కేసులు నమోదు కావడం సంచలనం రేపుతోంది. ఇక్కడే సుమారు 12.2 లక్షల పేర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించారు.
గత 2021 అసెంబ్లీ ఎన్నికల రికార్డులు చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఈ నాలుగు జిల్లాల్లోని ముర్షిదాబాద్‌లో 22కి 20, మాల్దాలో 12కి 8, ఉత్తర, దక్షిణ 24 పరగణాలలో 64కి 57 స్థానాలను తృణమూల్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్న మొత్తం 221 స్థానాల్లో.. ఏకంగా 75 సీట్లు ఈ జిల్లాల నుంచే రావడం విశేషం. అందుకే ఇప్పుడు ఈ జిల్లాల్లో ఓట్ల తొలగింపు పెను దుమారం రేపుతోంది.
మొత్తంగా బెంగాల్‌లో రెండు దశల్లో ఏప్రిల్ 23న 152 స్థానాలకు, ఏప్రిల్ 29న 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఉత్కంఠభరిత మహా సంగ్రామ ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
ప్రజాస్వామ్య పండుగలో పాలుపంచుకోవాల్సిన ఓటరు.. ఇప్పుడు తన ఓటు హక్కు కోసం రోడ్డెక్కి పోరాడుతున్న తీరు బెంగాల్ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో మే 4న తేలిపోనుంది!
Also Read:
Ghost Rumors In College: కాలేజీలో దెయ్యాలు.. పూజలుKerala Elections: పినరయి, మోదీలపై సీఎం రేవంత్ ఫైర్
Global Economic Crisis: కొవిడ్ కంటే పెద్ద ముప్పు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ఎఫెక్ట్
పెళ్లి ఇష్టం లేదు.. ప్రియుడే కావాలి: మధ్యప్రదేశ్ హైకోర్టు చారిత్రక తీర్పు
పనిమనిషికి థార్ కారు.. గర్ల్ ఫ్రెండ్‌కు ప్లాట్లు: బిహార్ డీఎస్పీ అవినీతి బాగోతం!

