ప్రభుత్వ కార్యాలయం అంటే మనకు గుర్తొచ్చేది.. అంతులేని క్యూ లైన్లు, పేరుకుపోయిన ఫైళ్లు, ఒక చిన్న పని కోసం ప్రతిరోజూ తిరగాల్సిన పరిస్థితి! కానీ, మీరు ఏ ఆఫీసుకు వెళ్లకుండానే, ఏ అధికారి సంతకం కోసం వేచి చూడకుండానే.. కేవలం ఒక్క మాట చెబితే మీ పనంతా ఒక 'యంత్రం' చేసి పెడితే ఎలా ఉంటుంది? ఇది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు.. రేపు జరగబోయే వాస్తవం.
భవిష్యత్తును శాసించే ఈ సరికొత్త టెక్నాలజీ యుగానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నాంది పలికింది. అసలు మనుషుల ప్రమేయం లేకుండా దేశాన్ని ఏలే ఈ 'ఏజెంటిక్ ఏఐ' (Agentic AI) వస్తే సామాన్యుడి జీవితం ఎలా మారబోతోంది? ఇది ప్రపంచానికి ఇస్తున్న అతిపెద్ద సంకేతం ఏమిటో ఒక సామాన్యుడిగా మీరు కచ్చితంగా తెలుసుకోవాలి!
సగం దేశం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతిలోకి!
దార్శనికతకు మారుపేరైన యూఏఈ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రభుత్వ సేవలు, కార్యకలాపాల్లో ఏకంగా 50 శాతాన్ని స్వయంప్రతిపత్తి గల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చేతుల్లోకి అప్పగించబోతున్నట్లు ఖలీజ్ టైమ్స్ నివేదిక ద్వారా సగర్వంగా ప్రకటించింది.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అత్యున్నత ఆదేశాల మేరకు ఈ మహా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో ప్రభుత్వ రంగాన్ని సగం మేర 'ఏజెంటిక్ ఏఐ' ద్వారా నడిపించనున్నామని యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధికారికంగా ప్రకటించారు. ఇలా ఒక దేశాన్ని ఏఐతో ఏలబోతున్న ప్రపంచంలోని మొట్టమొదటి ప్రభుత్వంగా యూఏఈ చరిత్ర పుటల్లోకెక్కనుంది.
ఏజెంటిక్ ఏఐ.. మనిషి కాదు, యంత్రమే బాస్!
ఇప్పటివరకు మనం చూసిన ఏఐ టెక్నాలజీ వేరు.. ఈ 'ఏజెంటిక్ ఏఐ' వేరు! సాధారణ ఏఐ మనుషులకు కేవలం సాయం మాత్రమే చేస్తుంది. కానీ, ఈ ఏజెంటిక్ ఏఐ ఏకంగా మనిషి ప్రమేయం లేకుండానే పనులను పూర్తి చేస్తుంది, సంక్లిష్టమైన ప్రక్రియలను స్వయంగా నిర్వహిస్తుంది.
ఇకపై ఏఐ ఏజెంట్లు కేవలం సలహాలు ఇవ్వడానికే పరిమితం కాకుండా, నిర్ణయాలు తీసుకుంటాయి, సేవలను నేరుగా ప్రజలకు అందిస్తాయి. "ఏఐ ఇకపై కేవలం ఒక పనిముట్టు కాదు.. అది రియల్ టైమ్‌లో స్వయంగా విశ్లేషిస్తుంది, నిర్ణయిస్తుంది, అమలు చేస్తుంది, తనను తాను మెరుగుపరుచుకుంటుంది" అని షేక్ మహ్మద్ బిన్ రషీద్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. సేవల వేగం పెంచడానికి, అత్యుత్తమ సామర్థ్యాన్ని వెలికితీయడానికి ఈ టెక్నాలజీ తమ 'ఎగ్జిక్యూటివ్ పార్టనర్' కాబోతోందని ఆయన ఉద్ఘాటించారు.
సామాన్యుడికి ఏంటి లాభం? ఇక రాజభోగమే!
దీనివల్ల అక్కడి ప్రజల జీవనశైలి సమూలంగా మారిపోనుంది. పౌరులు ఇకపై సిస్టమ్స్‌ను అర్థం చేసుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనే లేదు. కేవలం తమకు ఏం కావాలో ఫలితాన్ని అడిగితే చాలు, వెనక జరిగే సంక్లిష్టమైన ప్రాసెసింగ్ అంతా ఈ ఏఐ టెక్నాలజీనే చూసుకుంటుంది.
ఈ విప్లవాత్మక ప్రాజెక్టు వల్ల ప్రభుత్వ నిర్వహణ వ్యయం భారీగా తగ్గడంతో పాటు, ఉత్పాదకత అమాంతం పెరుగుతుంది. ప్రభుత్వ విధానాలు, విధివిధానాలను ఏఐ సామర్థ్యాలకు అనుగుణంగా పూర్తిగా రీడిజైన్ చేసి.. మరింత వేగవంతమైన, కచ్చితమైన సేవలను ఏ అడ్డంకులు లేకుండా ప్రజలకు అందించడమే దీని అసలు లక్ష్యం.
నిఘా మొదలైంది.. అధికారుల గుండెల్లో రైళ్లు!
ఈ మహా ప్రాజెక్టు అమలు బాధ్యతను ఉపాధ్యక్షుడు షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. క్యాబినెట్ వ్యవహారాల మంత్రి మహ్మద్ అల్ గెర్గావి నేతృత్వంలోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దీనికి మార్గదర్శనం చేయనుంది. మంత్రిత్వ శాఖలు, ఫెడరల్ సంస్థల్లో విడతల వారీగా దీనిని అమలు చేయనుండగా.. నిరంతర పనితీరు అంచనాల ద్వారా దీనిని మరింత విస్తరించనున్నారు.
ఇక్కడ మరో సంచలన నిర్ణయం ఏంటంటే.. ఈ టెక్నాలజీ వేగాన్ని తట్టుకుని నిలబడే అధికారులకే ఇకపై పదవులు! రాబోయే రెండేళ్లలో మంత్రులు, డైరెక్టర్ జనరల్స్, ప్రభుత్వ సంస్థల అధిపతుల పనితీరును వారు ఏఐ టెక్నాలజీని ఎంత వేగంగా అడాప్ట్ చేసుకున్నారు, కొత్త ప్రమాణాలను ఎంత త్వరగా అమలు చేశారు అన్నదానిపైనే అంచనా వేయనున్నట్లు ప్రభుత్వం తేల్చిచెప్పింది.
రెండు దశాబ్దాల డిజిటల్ విప్లవం.. ఇప్పుడు పతాక స్థాయికి!
యూఏఈ రాత్రికి రాత్రే ఈ స్థాయికి చేరలేదు. 2010లోనే ఇ-గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టిన ఆ దేశం, 2013లో 'స్మార్ట్ గవర్నమెంట్' పేరిట ప్రభుత్వ సేవలను మొబైల్ ఫోన్లకు చేర్చింది. 2015 నాటికి ఏకంగా 13 మిలియన్ల మంది యూజర్లు ఉన్న 'యూఏఈ పాస్' ప్లాట్‌ఫామ్ లాంటి అత్యున్నత డిజిటల్ ఐడెంటిటీ, పేమెంట్ సిస్టమ్‌లతో పటిష్టమైన పునాది వేసుకుంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 2017లో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రి'ని నియమించిన దేశం కూడా యూఏఈనే కావడం గమనార్హం! తమ 'ఏఐ స్ట్రాటజీ 2031'లో భాగంగా ఫెడరల్ ఉద్యోగులందరికీ ఏఐలో కఠినమైన శిక్షణ ఇచ్చి, ప్రపంచంలోనే అత్యుత్తమ ఏఐ ఎనేబుల్డ్ ప్రభుత్వ వర్క్‌ఫోర్స్‌గా మార్చేందుకు ఆ దేశం శరవేగంగా అడుగులు వేస్తోంది.
ఏఐ వస్తే మనుషుల ఉద్యోగాలు పోతాయా? అన్న భయాలకు యూఏఈ ప్రాక్టికల్‌గా ఒక గట్టి సమాధానం ఇస్తోంది. టెక్నాలజీని చూసి భయపడి తరిమికొట్టడం కాదు, దాన్ని మన సిస్టమ్‌లో భాగం చేసుకుని మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకోవడమే అసలైన భవిష్యత్తు! రాబోయే కొన్నేళ్లలో ఈ 'ఏజెంటిక్ ఏఐ' మోడల్ ప్రపంచ దేశాలన్నింటికీ ఒక రోల్ మోడల్‌గా మారబోతోంది. టెక్నాలజీ స్పీడ్‌ను అందుకోలేని నాయకులు, అధికారులు, సామాన్యులు ఎవరైనా సరే.. భవిష్యత్తు రేసులో వెనుకబడిపోవడం ఖాయం. ఆ డిజిటల్ విప్లవానికి మనమూ ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలి!
Also Read:
రియల్ లైఫ్ పబ్జీ: ఫోన్లలో కాదు, ఏకంగా షాపింగ్ మాల్స్‌లో ఆడేస్తున్నారు!క్షిపణి పడే ముందు రూ.3 కోట్ల బెట్టింగ్.. అమెరికా సైనికుడి మైండ్ బ్లోయింగ్ స్కామ్!
పాకిస్థాన్‌లో చర్చలు మా తప్పే.. ఏకపక్ష డిమాండ్లపై భగ్గుమన్న ఇరాన్
కభీ ఇండియా ఆకే దేఖో: ట్రంప్‌కు ఇరాన్ ఇచ్చిన దిమ్మతిరిగే కౌంటర్ ఇదే
IRGC Seizes Ships: గుజరాత్‌కు వస్తున్న నౌక హైజాక్

