ఒక దేశ భవితవ్యం గాల్లో ఆడుతోంది.. క్షిపణులు దూసుకురావడానికి క్షణాల సమయం మాత్రమే ఉంది! కానీ, సరిగ్గా అదే సమయంలో అమెరికాకు చెందిన ఓ సైనికుడు మాత్రం దేశ భద్రతను పణంగా పెట్టి కళ్లు చెదిరే జూదం ఆడాడు. సైనిక ఆపరేషన్ రహస్యాలను అమ్ముకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు! వెనుజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్ వెనుక వెలుగుచూసిన ఈ హాలీవుడ్ రేంజ్ స్కామ్ ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది.
ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్.. తెరవెనుక భారీ స్కెచ్!
ఈ ఏడాది జనవరిలో వెనుజులాపై అమెరికా సైన్యం మెరుపు దాడులు చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను అత్యంత నాటకీయంగా నిర్బంధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ భారీ ఆపరేషన్‌కు అమెరికా సైన్యం 'ఆపరేషన్ ఆబ్జల్యూట్ రిజాల్వ్' (Operation Absolute Resolve) అని పేరు పెట్టింది.
గతేడాది డిసెంబరు 8 నుంచే దీనికోసం అత్యంత పకడ్బందీగా వ్యూహరచన చేశారు. అయితే, ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రత్యేక దళానికి చెందిన 'గ్యానన్ కెన్ వాన్ డైక్' (Gannon Ken Van Dyke) అనే సైనికుడి బుద్ధి వక్రమార్గం పట్టింది.
పాలిమార్కెట్‌లో పందెం.. రాత్రికి రాత్రే రూ. 3 కోట్లు!
మదురోను ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే అత్యంత సున్నితమైన, గోప్యమైన సమాచారం వాన్ డైక్‌కు ముందుగానే తెలిసిపోయింది. ఆ దేశ భద్రతా రహస్యాన్ని తన సొంత జేబులు నింపుకోవడానికి వాడుకున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్ అయిన 'పాలీమార్కెట్' (Polymarket) లో మదురో నిర్బంధంపై ఏకంగా పందెం కాశాడు.
ఎవరికీ తెలియని ఆ పక్కా సమాచారంతో అత్యంత సులభంగా 4 లక్షల డాలర్లు (అక్షరాలా రూ. 3 కోట్లకు పైగా) ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఎవరికీ కనీస అనుమానం రాకుండా ఆ భారీ మొత్తాన్ని సైలెంట్‌గా క్రిప్టో కరెన్సీ (Cryptocurrency) రూపంలోకి మళ్లించాడు.
క్షిపణి పడే క్షణాల ముందు.. కళ్లు చెదిరే లావాదేవీలు!
ఈ స్కామ్ ఎలా జరిగిందో చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. అమెరికా దళాలు వెనుజులా రాజధాని కారకాస్‌లోకి ప్రవేశించడానికి సరిగ్గా వారం రోజుల ముందు.. అంటే డిసెంబర్ 26న వాన్ డైక్ తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి 35,000 డాలర్లను ఒక క్రిప్టోకరెన్సీ ఖాతాలోకి పంపాడు.
మదురో ఎప్పుడు గద్దె దిగుతాడనే దానిపై డిసెంబర్ 30 నుంచి జనవరి 2 మధ్య సుమారు 32,500 డాలర్లకు పైగా పందేలు వేశాడు. అందులో అత్యధిక శాతం బెట్టింగ్‌లు.. కారకాస్‌పై తొలి క్షిపణి పడటానికి కేవలం కొన్ని గంటల ముందు జనవరి 2 రాత్రే జరగడం గమనార్హం!
దొరికిపోయిన దొంగ.. రంగంలోకి ఎఫ్‌బీఐ
ప్రపంచంలోనే అతిపెద్ద బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ అయిన పాలిమార్కెట్‌కు ఈ వ్యవహారంపై అనుమానం వచ్చింది. ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారంతో ఎవరో ట్రేడింగ్ చేస్తున్నారని గుర్తించిన ఆ సంస్థ, వెంటనే అమెరికా న్యాయ శాఖను అప్రమత్తం చేసి దర్యాప్తుకు పూర్తిగా సహకరించింది. దీంతో ఆ సైనికుడి బండారం కాస్తా బట్టబయలైంది.
ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ (Kash Patel) ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. "ఒక న్యాయమైన సైనిక చర్య నుంచి వ్యక్తిగత లబ్ధి పొందడానికి ఒక అమెరికా సైనికుడు తన పదవిని దారుణంగా దుర్వినియోగం చేస్తూ ఇందులో పాలుపంచుకున్నాడు" అని ఆయన మండిపడ్డారు.
కటకటాల వెనక్కి.. జీవితకాలం జైలుకేనా?
ప్రభుత్వ రికార్డుల్లో వాన్ డైక్ ఇచ్చిన టెలిఫోన్ నంబర్ ప్రస్తుతం పనిచేయడం లేదు. కనీసం కోర్టు పత్రాల్లో అతడి తరఫున వాదించడానికి ఇంకా ఏ లాయర్ పేరు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం అమెరికా అధికారులు వాన్ డైక్‌పై కొరడా ఝుళిపించారు.
వ్యక్తిగత లాభం కోసం ప్రభుత్వ రహస్య సమాచారాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం, బయటకు రాని రహస్యాలను తస్కరించడం, మోసం, వైర్ ఫ్రాడ్, చట్టవిరుద్ధమైన నగదు లావాదేవీలు.. ఇలా ఎన్నో భయంకరమైన అభియోగాలను న్యాయశాఖ అతడిపై మోపింది. ఈ సెక్షన్ల కింద అతడికి సంవత్సరాల తరబడి జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
దేశాన్ని కాపాడాల్సిన సైనికుడే దేశ భద్రతను కాసులకు అమ్ముకుంటే అంతకంటే ద్రోహం మరొకటి ఉండదు! టెక్నాలజీ ఎంత పెరిగినా, మనిషిలోని అత్యాశకు అడ్డుకట్ట వేయలేమని ఈ ఘటనే సజీవ సాక్ష్యం. కోట్లు సంపాదించాలన్న ఆ సైనికుడి దురాశ.. ఇప్పుడు అతడి జీవితాన్నే చీకటి గదిలోకి నెట్టేసింది!
Also Read:
పాకిస్థాన్‌లో చర్చలు మా తప్పే.. ఏకపక్ష డిమాండ్లపై భగ్గుమన్న ఇరాన్కభీ ఇండియా ఆకే దేఖో: ట్రంప్‌కు ఇరాన్ ఇచ్చిన దిమ్మతిరిగే కౌంటర్ ఇదే
IRGC Seizes Ships: గుజరాత్‌కు వస్తున్న నౌక హైజాక్
Lufthansa Flights Cancelled: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్, విమానాలు రద్దు
US Iran Ceasefire: ఇరాన్‌కు ట్రంప్ ఆఖరి ఛాన్స్

