సముద్రపు అలలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు తుపాకీ తూటాలు పేలుతున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్య, అగ్రరాజ్యాల పంతాలకు అమాయకపు నౌకా సిబ్బంది ప్రాణాలు పణంగా పెడుతున్నారు. భారత్‌లోని గుజరాత్ తీరానికి వస్తున్న ఒక భారీ వాణిజ్య నౌకను ఇరాన్ సాయుధ బలగాలు సముద్రం మధ్యలో అత్యంత నాటకీయంగా హైజాక్ చేయడం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది!
గుజరాత్‌కు వస్తున్న నౌక.. ఇరాన్ కబ్జా
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళం హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న రెండు భారీ వాణిజ్య నౌకలను అడ్డగించి, తమ ఆధీనంలోకి తీసుకుంది. ఎమ్మెస్సీ-ఫ్రాన్సెస్కా (MSC-FRANCESCA), ఎపామినోండెస్ (EPAMINONDES) అనే ఈ రెండు నౌకలను బలవంతంగా ఇరాన్ తీరానికి తరలించారు.
ఈ సంచలన విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ 'తస్నిమ్' (Tasnim) అధికారికంగా ధృవీకరించింది. సముద్ర మార్గాలను ట్రాక్ చేసే మెరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇందులో 'ఎపామినోండెస్' నౌక లైబీరియా జెండాతో దుబాయ్‌లోని జెబెల్ అలీ నుంచి నేరుగా మన గుజరాత్ తీరానికి వస్తోంది. అయితే, ఆ నౌకల్లో ఉన్న సరుకు ఏమిటి, వాటి యజమానులు ఎవరనే వివరాలను ఇరాన్ వార్తా సంస్థ గోప్యంగా ఉంచింది.
నావిగేషన్ సిస్టమ్స్ ట్యాంపరింగ్.. ఇరాన్ రెడ్ లైన్
అసలు ఈ నౌకలను ఎందుకు పట్టుకున్నారనే దానికి ఇరాన్ బలగాలు ఒక బలమైన వాదనను వినిపిస్తున్నాయి. ఈ నౌకలు హార్ముజ్ జలసంధిలో నావిగేషన్ నిబంధనలను, సముద్ర భద్రతను దారుణంగా ఉల్లంఘించాయని ఐఆర్జీసీ (IRGC) తీవ్రంగా ఆరోపిస్తోంది. నౌకల గుర్తింపు, వేగం, దిశను తీరప్రాంత అధికారులకు ఎప్పటికప్పుడు చేరవేసే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS) ను ఈ నౌకలు ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్ చేశాయని మండిపడుతోంది.
ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, అధికారుల కళ్లుగప్పి దొంగచాటుగా ఈ జలసంధిని దాటేందుకు ప్రయత్నించాయని ఇరాన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరుకైన హార్ముజ్ జలసంధిలో భద్రతను ఉల్లంఘించడం, ఇతర చమురు నౌకలకు ముప్పు కలిగించడం తమ 'రెడ్ లైన్' ను దాటడమేనని ఇరాన్ హెచ్చరించింది. ఇది కేవలం దాడి కాదని, సముద్ర చట్టాలను కాపాడే చట్టబద్ధమైన చర్య మాత్రమేనని టెహ్రాన్ వర్గాలు సమర్థించుకుంటున్నాయి.
సముద్రంలో తూటాల వర్షం.. దెబ్బతిన్న నౌకలు
ఈ రెండు నౌకల కబ్జా వెనుక ఒక భయంకరమైన దాడుల పరంపర దాగి ఉంది. ఈ ఘటన జరగడానికి కొద్ది గంటల ముందే, హార్ముజ్ జలసంధిలో కనీసం మూడు కంటైనర్ నౌకలపై ఇరాన్ బలగాలు విరుచుకుపడ్డాయి. ఒమన్ తీరానికి ఈశాన్యంగా 15 నాటికల్ మైళ్ల దూరంలో గ్రీకు కంపెనీకి చెందిన 'ఎపామినోండెస్' నౌకపై ఇరాన్ గన్‌బోట్ ఏకంగా కాల్పులు జరిపింది.
ఈ దాడిలో నౌకకు చెందిన బ్రిడ్జ్ భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) కేంద్రం అధికారికంగా నిర్ధారించింది. ఇదే సమయంలో యూఏఈ సంస్థకు చెందిన, పనామా జెండాతో వెళ్తున్న 'యూఫోరియా' (Euphoria) నౌకపైనా ఇరాన్‌కు పశ్చిమంగా 8 నాటికల్ మైళ్ల దూరంలో దాడి జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని యూకేఎంటీఓ (UKMTO) స్పష్టం చేసింది.
అమెరికాకు సవాల్.. ఆధిపత్య పోరులో మహా సంక్షోభం
ఈ వరుస దాడులు, నౌకల హైజాక్‌ల వెనుక అగ్రరాజ్యాల ఆధిపత్య పోరు దాగి ఉంది. ఈ ప్రాంతంలో అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని, మిలిటరీ ఉనికిని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాషింగ్టన్ తీరును సవాల్ చేస్తూనే, సముద్ర మార్గాల్లో తమ సత్తా చాటడానికే టెహ్రాన్ ఈ దాడులకు పాల్పడుతోందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం.. ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్‌ను నిలువునా వణికిస్తోంది.
రెండు దేశాల మధ్య రగులుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు సముద్రపు అలలను నెత్తురోడేలా చేస్తోంది. రాజకీయ పంతాలకు పశ్చిమాసియా జలాల్లో వాణిజ్య నౌకలు బలిపీఠం ఎక్కడం.. రాబోయే భయంకరమైన ఆర్థిక, భద్రతా సంక్షోభానికి ఒక సజీవ ప్రమాద ఘంటిక!
Also Read:
Lufthansa Flights Cancelled: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్, విమానాలు రద్దుUS Iran Ceasefire: ఇరాన్‌కు ట్రంప్ ఆఖరి ఛాన్స్
జనాభా లేక వణికిపోతున్న జపాన్.. యువత ఎందుకు పెళ్లికి దూరమవుతోంది?
Mossad Agent Death: ఇటలీలో బోటు ప్రమాదం.. వెలుగులోకి ఇజ్రాయెల్ మాజీ ఏజెంట్ స్టోరీ
US Iran Naval Blockade: దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్

