హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో అద్దెకు తీసుకున్న కిల్లర్స్ రాజకీయ నాయకులను లేపేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ అదే సీన్ నిజ జీవితంలో, అదీ అగ్రరాజ్యం అమెరికా మాజీ సైనికుల చేతుల్లో జరిగితే ఎలా ఉంటుంది? ఒక సాధారణ పౌరుడిగా మనం గమనించాల్సిన భయంకరమైన వాస్తవం ఏంటంటే.. దేశ రక్షణ కోసం శిక్షణ పొందిన సైనికులు డబ్బు కోసం ప్రైవేట్ కిల్లర్స్‌గా మారితే, అది ప్రపంచ భద్రతకే అతిపెద్ద ముప్పు! ఏ దేశంలోనైనా రాజకీయ ప్రత్యర్థులను అంతం చేయడానికి కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కుదుర్చుకునేంత స్థాయికి ఈ మాఫియా ఎదిగిపోయింది. అచ్చం ఇలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం తరఫున ఒక అమెరికన్ మాజీ సైనికుడు సుపారీ కిల్లర్‌గా మారి యెమెన్ రాజకీయ నాయకులను మట్టుబెట్టేందుకు చేసిన భయంకరమైన ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అసోసియేటెడ్ ప్రెస్ సంచలన నివేదికతో ఈ చీకటి సామ్రాజ్యం గుట్టు రట్టయింది.
యూఏఈ భారీ కుట్ర.. బయటపడ్డ నెత్తుటి నిజాలు!
యెమెన్ దేశానికి చెందిన చట్టసభ సభ్యుడు అన్సాఫ్ అలీ మయో ఈ నెత్తుటి ఆట వెనుక ఉన్న భయంకరమైన నిజాలను ప్రపంచం ముందు ఉంచారు. 2015లో తనను దారుణంగా హత్య చేయడానికి అబ్రహామ్ గోలన్ అనే ఒక అమెరికా మాజీ సైనికుడ్ని యూఏఈ ప్రభుత్వం ఏకంగా కాంట్రాక్ట్ కిల్లర్‌గా నియమించిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తమకు ఎదురుతిరిగే రాజకీయ ప్రత్యర్థులను, వ్యతిరేక గళాలను శాశ్వతంగా అడ్డు తొలగించుకోవడానికి యూఏఈ పన్నిన ఈ కుట్ర.. అంతర్జాతీయ వేదికపై పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
కోట్ల రూపాయల డీల్.. ప్రైవేట్ సైన్యం ఎంట్రీ
ఇక కోర్టు డాక్యుమెంట్లు వెల్లడించిన వాస్తవాలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అబ్రహామ్ గోలన్.. మాజీ నేవీ అధికారి ఐజాక్ గిల్మోర్‌తో కలిసి అమెరికాలోని శాన్ డియాగో కేంద్రంగా 'స్పియర్ ఆపరేషన్స్ గ్రూప్' అనే ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్ట్ సంస్థను స్థాపించాడు.
అత్యంత విస్తుగొలిపే విషయం ఏంటంటే, ఇందులో పనిచేసే ఉద్యోగులంతా అమెరికా ప్రత్యేక దళాల్లో అత్యుత్తమ శిక్షణ పొందిన మాజీ అధికారులే! ఎమిరేట్స్ ప్రభుత్వం తరఫున 'కాంట్రాక్ట్ హత్యలు' చేయడానికి వీరంతా ఒక చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు.
యెమెన్‌లో విజయవంతంగా ఒక ప్రాణం తీస్తే భారీ బోనస్‌లతో పాటుగా, ఏకంగా నెలకు 1.5 మిలియన్ డాలర్ల (కోట్ల రూపాయల) పారితోషికం తీసుకున్నట్లు ఆ వ్యాజ్యంలో స్పష్టంగా వెల్లడించారు.
మేమే చంపాం.. ఇంటర్వ్యూలో పబ్లిక్ గా ఒప్పుకున్న కిల్లర్!
తన న్యాయపోరాటంలో భాగంగా.. ఇద్దరు మాజీ సైనికులు, ఈ స్పియర్ ఆపరేషన్స్ వ్యవస్థాపకుడిపై యుద్ధ నేరాలు, మానవత్వ వ్యతిరేక నేరాలు, హత్యాయత్నాల కింద తీవ్రమైన అభియోగాలు మోపారు మయో.
గోలన్, గిల్మోర్, అలాగే అమెరికా ఆర్మీ ప్రత్యేక దళానికి చెందిన డేల్ కోమ్‌స్టోక్.. వీరంతా మయోపై హత్యాయత్నం చేశామని, ఈ దారుణ నేరాల్లో తమ పాత్ర ఉందని స్వయంగా అంగీకరించడం గమనార్హం. అంతేకాదు, 2018లో బజ్‌ఫీడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోలన్ ఏకంగా తన నేరాలను గొప్పగా చెప్పుకున్నాడు.
"యెమెన్‌లో టార్గెట్ హత్యల ప్రోగ్రామ్ నడిచింది నిజమే.. అదంతా యూఏఈ అనుమతితోనే జరిగింది.. నేనే దానిని నడిపించాను, మేమే ఆ హత్యలు చేశాం" అని పబ్లిక్ గా ఒప్పుకున్నాడు. అయితే, యూఏఈ మాత్రం యెమెన్‌లో కేవలం ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకు మాత్రమే తాము మద్దతు ఇచ్చామని చెబుతూ, రాజకీయ నాయకులను టార్గెట్ చేశామన్న ఆరోపణలను మాత్రం తీవ్రంగా ఖండించింది.
విదేశీయుడికి అమెరికా కోర్టులో అండ.. నిపుణుల వార్నింగ్
బాధితుడు మయో అమెరికా పౌరుడు కాకపోయినా, ఆయన అమెరికా కోర్టులో ఎలా దావా వేశారంటే.. ఆ దేశ చట్టంలోని 'ఎలైన్ టోర్ట్ స్టాట్యూ' అనే ప్రత్యేక నిబంధన ఇందుకు దారి చూపింది. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరిగితే విదేశీయులు కూడా యూఎస్ కోర్టులో న్యాయపోరాటం చేయవచ్చు.
సెంటర్ ఫర్ జస్టిస్ట్ అండ్ అకౌంటబిలిటీ సంస్థ లీగల్ డైరెక్టర్ డానియల్ మెక్‌లాఫ్లిన్ దీనిపై స్పందిస్తూ.. అమెరికా మాజీ సైనికులు తమ అత్యున్నత శిక్షణను ఇలా డబ్బు కోసం దుర్వినియోగానికి పాల్పడితే దానికి వారే పూర్తి బాధ్యత వహించాల్సిందేనని ఈ కేసు స్పష్టం చేస్తోందన్నారు.
మాజీ సైనికులు తమ శిక్షణను రిటైర్మెంట్ తర్వాత ఎలా వాడుతున్నారో నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారు చట్టాలను ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉగ్రవాదులు కాదు.. రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్!
అసలు ఈ నెత్తుటి కథ ఎక్కడ మొదలైందంటే.. 2015లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ యెమెన్ రాజధాని సనా నగరంతో పాటు ఉత్తర ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో అక్కడ భయంకరమైన అంతర్యుద్ధం రగులుకుంది.
సరిగ్గా ఇదే క్రమంలో అమెరికా మద్దతుతో ఆ ప్రాంతీయ కూటమిలోకి యూఏఈ ఎంటర్ అయింది. అప్పుడే కాంట్రాక్ట్ కిల్లర్స్ తమ లక్ష్యం 'అల్ ఇస్లాహ్' అనే ఇస్లామిక్ సంస్థ నేత మయో అని బాంబ్ పేల్చారు. ఆ సంస్థను యూఏఈ ఒక ప్రమాదకరమైన ఉగ్రవాద గ్రూప్‌గా భావిస్తుండగా.. నిపుణులు మాత్రం అదొక సాధారణ రాజకీయ పార్టీ మాత్రమే అని తేల్చి చెబుతున్నారు.
పేలిన బాంబు.. ప్రాణభయంతో పదేళ్లుగా అజ్ఞాతంలో!
తాను ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో మయో వివరిస్తూ.. 2015 డిసెంబరు 29న స్పియర్ సంస్థకు చెందిన ఆ కాంట్రాక్ట్ కిల్లర్ అడెన్ నగరంలోని తన కార్యాలయంలో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను అమర్చాడని వెల్లడించారు.
అదృష్టవశాత్తూ తాను ఆ భవనం నుంచి బయటకు వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే ఆ భవనం కుప్పకూలేలా భారీ పేలుడు సంభవించిందని, తృటిలో తాను చావు బారి నుంచి బయటపడ్డానని ఆయన వణికిపోతూ వివరించారు. తన ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పు పొంచి ఉండటంతో సౌదీ అరేబియాకు పారిపోయి అక్కడ ఆశ్రయం పొందినట్టు పేర్కొన్నారు.
గత పదేళ్లుగా తనను అంతం చేయడానికి స్పియర్ సంస్థ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందని, తాను ప్రాణాలతో ఉన్నా కనీసం కన్నవాళ్లకు, కుటుంబానికి దగ్గర కాలేక పదేళ్లుగా అజ్ఞాతంలో బతుకుతున్నానని మయో ఆవేదన వ్యక్తం చేశారు.
తీర్పు చెప్పే గుణపాఠం..
సాధారణ పౌరులకు రక్షణ కవచంగా నిలవాల్సిన సైనికులే.. పదవీ విరమణ తర్వాత కోట్ల రూపాయల ఆశతో ఇలా ప్రైవేట్ కిల్లర్స్‌గా మారడం ప్రపంచ మానవాళికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు! ఇది కేవలం యెమెన్ లేదా యూఏఈకి పరిమితమైన సమస్య కాదు.
డబ్బుతో ఏ దేశ సార్వభౌమాధికారాన్నైనా గుప్పిట్లో పెట్టుకోగలమని విర్రవీగే ప్రైవేట్ సైన్యాలకు కళ్లెం వేయకపోతే.. రేపు ఏ దేశంలోనైనా రాజకీయ హత్యలు సర్వసాధారణంగా మారే ప్రమాదం ఉంది.
ప్రభుత్వాలు తక్షణం కళ్లు తెరిచి, తమ మాజీ సైనికుల కార్యకలాపాలపై నిఘా పెట్టి ఈ సుపారీ సంస్కృతిని వేర్లతో సహా పెకిలించకపోతే అంతర్జాతీయ ప్రజాస్వామ్యానికే చీకటి రోజులు తప్పవు!

