దశాబ్దాలుగా రెండు జెండాల మధ్యే నలిగిపోతున్న తమిళనాడు రాజకీయాల్లో మార్పు ఎందుకు రాకూడదు? సగటు ఓటరుకు మూడో ప్రత్యామ్నాయం ఎందుకు దొరకకూడదు? సరిగ్గా ఈ ప్రశ్నలే ఇప్పుడు ద్రావిడ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయబోతున్నాయి. కేవలం వెండితెరపైనే కాదు, ప్రజాక్షేత్రంలోనూ ఒక పవర్‌ఫుల్ 'జననాయకుడు' పుట్టబోతున్నాడా? వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌లా బోర్లా పడతాడా.. లేక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లా సంచలనం సృష్టిస్తాడా? 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ప్రతి సామాన్యుడి గుండెల్లో మెదులుతున్న అసలు ఉత్కంఠ ఇదే!
ద్రవిడ కోటలో దళపతి.. త్రిముఖ సమరం షురూ!
తమిళనాడు రాజకీయం అనగానే 1967 నుంచి డీఎంకే లేదా అన్నాడీఎంకే.. ఈ రెండు పార్టీల చుట్టూనే అధికారం చేతులు మారుతూ వస్తోంది. ఎన్నో పార్టీలు ఉప్పెనలా పుట్టుకొచ్చినా, చివరకు ఆ రెండు ద్రావిడ పార్టీల పంచన చేరి కూటముల్లో కలవాల్సిందే. కానీ 2026 ఎన్నికల్లో చరిత్ర ఒక సరికొత్త మలుపు తిరిగింది. తొలిసారిగా తమిళ ఓటర్ల ముందుకు ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయం దూసుకొచ్చింది.
అదే దళపతి విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK). ఎన్నేళ్లుగానో ద్విముఖ పోరుగా ఉన్న తమిళ పాలిటిక్స్.. ఇప్పుడు విజయ్ రాకతో భీకరమైన త్రిముఖ పోరుగా మారింది. సినీ రంగాన్ని పూర్తిగా వదిలేసి రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్.. డీఎంకే, అన్నాడీఎంకేలకు తన టీవీకే (TVK) పార్టీ మాత్రమే అసలైన ప్రత్యామ్నాయమని నిరూపించేందుకు అహర్నిశలు శ్రమించాడు.
పీకేలా మిగిలిపోతాడా? కేజ్రీవాల్‌లా రికార్డు కొడతాడా?
రాజకీయాల్లోకి రావడం సులువే కానీ, నిలబడటమే అసలైన సవాల్! ఇందుకు దేశంలో రెండు ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అపారమైన అనుభవం ఉన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే).. 'జన్ సూరజ్' అనే పార్టీని స్థాపించి బీహార్ ఎన్నికల్లో బరిలోకి దిగారు. జేడీయూ, ఆర్జేడీలకు ప్రత్యామ్నాయంగా మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. పరిపాలనా వైఫల్యాలు, నిరుద్యోగం, వలసలను ఆయుధంగా చేసుకుని అక్కడ పాతుకుపోయిన కుల రాజకీయాలను సవాల్ చేశారు. కానీ ఆయన ప్రయత్నం దారుణంగా విఫలమై, ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు.
మరోవైపు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కథ మరోలా సాగింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఆయన.. తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) ప్రారంభించారు. తొలి ఎన్నికల్లోనే ఢిల్లీలోని 70 స్థానాలకు గాను ఏకంగా 28 సీట్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత కూడా ఆయన హవానే సాగింది. మరి ఇప్పుడు రెండు పెద్ద పార్టీల మధ్య అరంగేట్రం చేసిన విజయ్.. పీకేలా జీరో అవుతాడా? లేక కేజ్రీవాల్‌లా హీరో అవుతాడా? అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఆ 20 శాతం ఓటు బ్యాంకే విజయ్ అసలు టార్గెట్!
ఒకసారి గత ఎన్నికల లెక్కలను నిశితంగా పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడతాయి. 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే 40 శాతం ఓట్లతో ఏకంగా 134 సీట్లు గెలుచుకుని అధికార పీఠం ఎక్కగా.. డీఎంకే 32.1 శాతం ఓట్లతో 89 సీట్లతో సరిపెట్టుకుంది. మిగిలిన 20 శాతం ఓట్లు బీజేపీ, లెఫ్ట్ తదితర పార్టీలకు పడ్డాయి. ఇక 2021 ఎన్నికల విషయానికి వస్తే అన్నాడీఎంకే కూటమికి 39.71 శాతం ఓట్లు రాగా.. డీఎంకే కూటమికి 45 శాతం ఓట్లు వచ్చాయి.
ఈ గణాంకాలను బట్టి చూస్తే.. తమిళనాడులో సుమారు 15 నుంచి 20 శాతం ఓట్లు అటు డీఎంకే వైపు కానీ, ఇటు అన్నాడీఎంకే వైపు కానీ పడటం లేదు. ఈ 20 శాతం సైలెంట్ ఓటర్లు ఎప్పుడూ ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయం కోసమే ఎదురుచూస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ సస్పెన్స్.. మే 4న తేలనున్న భవితవ్యం!
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 20 శాతం ఓటర్లు కచ్చితంగా విజయ్ పార్టీ వైపే మొగ్గుచూపుతారని బల్లగుద్ది చెప్పలేకపోయినా.. ఎగ్జిట్ పోల్స్ మాత్రం అదే అంచనా వేస్తున్నాయి. మెజారిటీ సర్వేలు విజయ్ టీవీకే పార్టీకి 10 నుంచి 24 సీట్లు రావొచ్చని చెబుతుంటే.. 'యాక్సిస్ మై ఇండియా' (Axis My India) మాత్రం దళపతి సునామీ సృష్టించడం ఖాయమని, ఏకంగా 98 నుంచి 120 సీట్లు గెలుచుకుంటాడని సంచలన అంచనా వేసింది.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినిమా గ్లామర్‌తో ముడిపడే ఉంటాయి. ఎంజీఆర్, జయలలిత లాంటి దిగ్గజాలు ద్రావిడ గడ్డను ఏలిన చరిత్ర ఇక్కడుంది. రెండు పార్టీల కుటుంబ, అవినీతి రాజకీయాలతో విసిగిపోయిన సగటు సామాన్యుడికి, యువతకు ఇప్పుడు విజయ్ (TVK) ఒక బలమైన ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. మరికొద్ది గంటల్లో, అంటే మే నాలుగో తేదీన ఈవీఎంలు తెరుచుకున్నాక.. అతను కేవలం వెండితెర 'దళపతి'గా మిగిలిపోతాడా, లేక తమిళ ప్రజల గుండెల్లో శాశ్వత 'జననాయగన్'గా (ప్రజానాయకుడిగా) నిలిచిపోతాడా అన్నది తేలిపోతుంది!
Also Read:
Assembly Election Results 2026: 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్.. గెలుపెవరిది?Bengal Election Results: దీదీ మాస్టర్ వ్యూహం
ఢిల్లీలో హైడ్రామా: అరెస్ట్ భయంతో కారులో ఎస్కేప్ అయిన సందీప్ పాఠక్!
ముంబై మిస్టరీ: పుచ్చకాయ కాదు.. ప్రాణాలు తీసింది ఆ విషమేనా?
మమతా బెనర్జీకి సుప్రీం షాక్: కౌంటింగ్ సిబ్బంది నియామకంపై కీలక తీర్పు!

