35 ఏళ్లుగా అమెరికానే తన ప్రాణంగా, దేశంగా భావించి బతికిన ఓ భారతీయ మహిళను ఏ కారణం లేకుండా అరెస్ట్ చేస్తే? ఆమె కన్న కొడుకు అమెరికా సైన్యంలో దేశం కోసం పోరాడుతుంటే.. ఆ తల్లి మాత్రం ఏ దేశమూ కాని పౌరురాలిగా జైలు గోడల మధ్య నరకం అనుభవిస్తే? ఇది కల్పిత కథ కాదు.. అగ్రరాజ్యం అమెరికాలో ఒక సామాన్య భారతీయ మహిళ ఒంటరిగా చేసిన గుండెలు పిండేసే న్యాయపోరాటం! ఆరు వారాల చీకటి తర్వాత వెలుగుచూసిన మీనూ బత్రా (Meenu Batra) కన్నీటి గెలుపు కథ ఇది.
ఏ దేశమేగినా.. ఎందుకింత నరకం?
వృత్తిరీత్యా కోర్టులో అనువాదకురాలు (ట్రాన్స్‌లేటర్). హిందీ, ఉర్దూ, పంజాబీ భాషల్లో ఎంతో నిష్ణాతురాలు. 53 ఏళ్ల మీనూ బత్రా దశాబ్దాలుగా ఎంతో ప్రశాంతంగా గడుపుతున్న జీవితంలో మార్చి 17వ తేదీ ఒక చీకటి అధ్యాయాన్ని లిఖించింది. పని నిమిత్తం టెక్సాస్ నుంచి విస్కాన్సిన్‌కు వెళ్లేందుకు వ్యాలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన ఆమెను అకస్మాత్తుగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు అడ్డుకున్నారు.
కనీస ముందస్తు సమాచారం లేదు.. తన తరపున వాదనలు వినిపించే అవకాశం అసలే ఇవ్వలేదు. "ఒక్కసారిగా నన్ను ఒక భయంకరమైన నేరస్తురాలిలా చూశారు.. నా జీవితంలో నేను అనుభవించిన అత్యంత దారుణమైన, అవమానకరమైన సమయం అది" అని ఆరు వారాల నిర్బంధం తర్వాత జైలు నుంచి బయటకొచ్చిన మీనూ కన్నీటిపర్యంతమయ్యారు.
అధికారుల ఉక్కుపాదం.. ఫెడరల్ కోర్టు తీర్పుతో చెక్!
పౌరసత్వం లేదన్న ఒకే ఒక్క సాకుతో, సరైన చట్టపరమైన ప్రక్రియ లేకుండా ఆమెను దేశం దాటించాలని అధికారులు కుట్ర పన్నారు. కానీ, ఆ కుట్రలను బద్దలుకొడుతూ ఫెడరల్ కోర్టు మీనూ బత్రా విడుదలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి రోలాండ్ ఒల్వెరా చేసిన వ్యాఖ్యలు అధికారుల తీరును ఎండగట్టాయి.
35 ఏళ్ల క్రితం భారతదేశంలో హింసను తట్టుకోలేక ప్రాణాలతో అమెరికాకు శరణార్థిగా వచ్చిన ఆ మహిళకు 'విత్‌హోల్డింగ్ ఆఫ్ రిమూవల్' (Withholding of Removal) హోదా ఉందని జడ్జి గుర్తుచేశారు. అంటే ఆమె అమెరికాలో స్వేచ్ఛగా ఉండి పని చేసుకోవచ్చు. ప్రభుత్వ చర్య వల్ల ఒక వ్యక్తి స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిందని, అరెస్ట్ చేసే ముందు కనీస విచారణ జరపలేదని న్యాయస్థానం ఐసీఈ అధికారులను తీవ్రంగా తప్పుబట్టింది.
సైనికుడి పోరాటం.. గ్రీన్ కార్డే అంతిమ లక్ష్యం!
మీనూ బత్రాకు నలుగురు సంతానం. వారిలో చిన్న కుమారుడు జాస్పర్ ప్రస్తుతం అమెరికా సైన్యంలో పని చేస్తున్నాడు. ఒకవైపు తాను అమెరికా దేశం కోసం పోరాడుతుంటే, తన తల్లి శాశ్వత నివాసం కోసం ప్రభుత్వంతో పోరాడాల్సిన దుస్థితి అతనికి ఎదురైంది. తన తల్లికి శాశ్వత నివాసం కల్పించి, ఈ అన్యాయాన్ని ఆపాలని అతను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు.
ఆమె లాయర్ దీపక్ అహ్లువాలియా కూడా ఇదే స్పష్టం చేశారు. "జైలు నుంచి బయటకు తీసుకురావడం మా తొలి విజయం మాత్రమే, పోరాటం ఇంకా ముగియలేదు. ఆమెను ఏ సంబంధం లేని మూడో దేశానికి పంపించే కుట్రలను మేం అడ్డుకుని తీరుతాం. అమెరికాలో శాశ్వతంగా ఉంచేలా గ్రీన్ కార్డ్ (Green Card) సాధించే వరకు మా న్యాయపోరాటం ఆగదు" అని ఆయన తేల్చి చెప్పారు.
ఒక సైనికుడి తల్లిని జైల్లో పెట్టి అగ్రరాజ్యం సాధించిందేంటి? శరణార్థిగా వచ్చిన వారిపట్ల కఠిన ఇమ్మిగ్రేషన్ చట్టాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి ఈ ఘటనే పచ్చి నిదర్శనం. ప్రస్తుతం మీనూ బత్రా తన కుటుంబంతో కలిసి ఉండటం అందరికీ ఊరటనిచ్చినా.. ఇది తాత్కాలికమే. వచ్చే 4 నుంచి 6 నెలల్లో తన తల్లికి శాశ్వత హోదా వస్తుందని ఆ కుమారుడు పెట్టుకున్న ఆశ నెరవేరేవరకు ఈ ఆరు వారాల జైలు భయం వాళ్లను వెన్నాడుతూనే ఉంటుంది.
Also Read:
ముగిసిన ఇరాన్ యుద్ధం: కాంగ్రెస్‌కు వైట్‌హౌస్ కీలక ప్రకటన, ముప్పు తప్పలేదన్న ట్రంప్!
హర్మూజ్ జలసంధిలో టెన్షన్: నౌకల రాకపోకలపై ఇరాన్ సంచలన నిర్ణయం
US Cuba Tensions: క్యూబాపై అమెరికా యుద్ధ ప్రకటన!
287 మందితో మహా సంగ్రామం.. ఈసారైనా ట్రంప్‌కు నోబెల్ దక్కేనా?

