ప్రపంచ పటంలో మరోసారి అణు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? పెట్రోల్ ధరలు కాస్త పెరిగితేనే బెంబేలెత్తిపోయే సామాన్యుడి జీవితం.. ఏకంగా అణ్వాయుధాల మోత మోగితే ఏమవుతుంది? అవును.. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య రగులుతున్న తాజా వివాదం యావత్ ప్రపంచాన్ని భయాందోళనల్లోకి నెట్టేస్తోంది. అహంకార పోరు అణు యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్న ఈ భయంకరమైన పరిస్థితుల వెనుక అసలేం జరుగుతోందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!
టార్గెట్ 90 శాతం.. ఇరాన్ భయంకరమైన వార్నింగ్!
అమెరికా లేదా ఇజ్రాయెల్ దళాలు తమపై మరోసారి దాడి చేసే సాహసం చేస్తే ఊరుకునేది లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఏకంగా తమ దేశంలోని యురేనియం నిల్వలను 90 శాతం స్వచ్ఛతకు.. అంటే, అత్యంత విధ్వంసకరమైన అణ్వాయుధాల తయారీకి అవసరమైన స్థాయికి శుద్ధి చేస్తామని సంచలన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కొత్త సైనిక చర్యలకు దిగబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ కామెంట్స్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
పార్లమెంట్‌లో నిర్ణయం.. ట్రంప్‌కు సవాల్
ఈ మేరకు ఇరానియన్ పార్లమెంటరీ కమిషన్ ప్రతినిధి ఎబ్రహీమ్ రెజాయ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బాంబు పేల్చారు. తమపై మరో దాడి జరిగితే ఇరాన్ ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం 90 శాతం సంపన్న యురేనియంను సిద్ధం చేయడమేనని, దీనిపై పార్లమెంటులో సమీక్షిస్తామని ఆయన బహిరంగంగానే అమెరికాకు సవాల్ విసిరారు.
అణు ధూళితో ఆటలొద్దు.. ట్రంప్ రివర్స్ కౌంటర్
ఇరాన్ హెచ్చరికలపై అగ్రరాజ్యాధినేత ట్రంప్ అంతే ధీటుగా స్పందించారు. సంపన్న యురేనియంను 'అణు ధూళి'గా అభివర్ణించిన ఆయన.. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ప్రకటించిన యుద్ధానికి ఇదే కీలక కారణమన్నారు. ఇరాన్ చేతికి అణ్వాయుధం చిక్కనివ్వబోనని పదేపదే స్పష్టం చేశారు. ఇరాన్ అణు నిల్వలను అమెరికా డేగకన్నుతో గమనిస్తోందని, ఎవరైనా ఆ స్థావరాలకు సమీపిస్తే పేల్చివేస్తామని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పైగా, మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ప్రమాదంలో పడిందని ఆయన నిన్ననే ప్రకటించడం మరింత ఆందోళన రేపుతోంది.
తిరస్కరణ.. సైన్యం రెడీ!
వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ఇరాన్ ఒక ప్రతిపాదన తెచ్చింది. తమ వద్ద ఉన్న అధిక సంపన్న యురేనియంను కొంతవరకు పలుచన చేసి, మిగిలిన భాగాన్ని మూడో దేశానికి తాత్కాలికంగా బదిలీ చేస్తామని చెప్పింది. కానీ ట్రంప్ ఆ ప్రతిపాదనను నిర్మొహమాటంగా తిరస్కరించారు. దీంతో ఇరాన్ సైన్యం ఎలాంటి దాడికైనా ఎదురుదెబ్బ తీయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైంది. తన మొదటి అధ్యక్ష పదవీ కాలంలోనే ట్రంప్ ఇరాన్ అణు ఒప్పందం నుంచి వాషింగ్టన్‌ను తప్పించారు. ఆ తర్వాత గత ఎనిమిదేళ్లలో ఇరాన్ ఏకంగా 22 వేల పౌండ్ల (11,000 కేజీలు) సంపన్న యురేనియాన్ని కూడబెట్టిందని 'న్యూయార్క్ టైమ్స్' నివేదిక గుట్టు విప్పింది.
60 శాతం సిద్ధం.. ఆయుధానికి ఒక్క అడుగే!
అసలు ఇరాన్ అణు చరిత్ర చూస్తే 2006లోనే పారిశ్రామిక స్థాయిలో యురేనియం శుద్ధిని ప్రారంభించింది. అప్పట్లో అది కేవలం శాంతియుత అవసరాలకే అని బుకాయించింది. కానీ ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థ (ఐఏఈఏ) నివేదికలు ఆ నిల్వలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని ఎప్పటికప్పుడు స్పష్టం చేశాయి. 2010లో పరిశోధనా రియాక్టర్ కోసమంటూ 20 శాతం శుద్ధి ప్రారంభించింది ఇరాన్. పౌర, సైనిక అవసరాల మధ్య అధికారిక విభజన రేఖ ఇదే.
ఐఏఈఏ లెక్కల ప్రకారం ఇరాన్ దగ్గర ప్రస్తుతం 440.9 కిలోగ్రాముల (972 పౌండ్లు) యురేనియం 60 శాతం స్వచ్ఛతతో సిద్ధంగా ఉంది. సాంద్రత పెరిగేకొద్దీ యురేనియం శుద్ధి మరింత సులభమవుతుంది. అంటే 60 శాతం నుంచి ఆయుధాలకు వాడే 90 శాతానికి చేరుకోవడం ఇరాన్‌కు కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే!
అగ్రరాజ్యాల అహంకార పోరాటంలో ఇరాన్ అణ్వాయుధాన్ని చేతబడితే.. మధ్యప్రాచ్యం అగ్నిగుండంగా మారడం ఖాయం. యురేనియం శుద్ధి 90 శాతానికి చేరుకుంటే, అది కేవలం ఇజ్రాయెల్ లేదా అమెరికాకే కాదు.. పెట్రోల్ ధరల భగ్గుమనే మంటలతో ప్రపంచంలోని ప్రతి సామాన్యుడి జేబుకూ ముప్పే! అణుబాంబు తయారీకి ఇరాన్ కొద్ది అడుగుల దూరంలో ఉంది. ఈ ఆధిపత్య పోరును ఏ పక్షమైనా పంతాలకు పోకుండా విరమించుకోకపోతే, మూడో ప్రపంచ యుద్ధం ముప్పు మన గుమ్మం దాకా రావడం ఖాయం!

