సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. మతపరమైన నినాదాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తనదైన శైలిలో స్పందించిన ఆమె, తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు చెక్ పెడుతూ సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.
[FEATURED_IMAGE]తాను చేసిన వ్యాఖ్యలను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి, అసలు సందర్భాన్ని దాచిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని నిష్టగా పాటించే హిందువును తానని, తన విశ్వాసాలు, విలువల పట్ల తనకు ఎంతో నమ్మకం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఏ మతాన్ని లేదా వర్గాన్ని కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, ధర్మం నుంచే తాను నిజం వైపు నిలబడటం నేర్చుకున్నానని వెల్లడించారు.
తాను పరమ హనుమద్భక్తురాలినని, ఆ ఆంజనేయస్వామి ధైర్యమే తనకు అన్యాయాన్ని ప్రశ్నించే స్ఫూర్తినిస్తుందని అనసూయ పేర్కొన్నారు. సోషల్ మీడియా ముసుగులో అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ, వ్యక్తిగత దాడులకు దిగుతున్న సైబర్ బౌన్సర్లను ఉద్దేశించి మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె క్లారిటీ ఇచ్చారు. దాన్ని కొందరు కావాలనే ఒక మతానికి ఆపాదించి తనపై దుష్ప్రచారం చేయడం అత్యంత బాధాకరమని ఆమె వివరించారు.
ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు, సగం సమాచారంతో కూడిన పోస్టులు చూసి తన వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయవద్దని నెటిజన్లను కోరారు. పూర్తి సందర్భం తెలుసుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన సనాతన ధర్మంపై తనకు ఎంతో గర్వం ఉందని చెబుతూ.. తన పోస్ట్‌ను ‘జై శ్రీరామ్.. జై హనుమాన్’ అనే నినాదాలతో ముగించడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వివరణతోనైనా ఆమెపై వస్తున్న విమర్శలకు బ్రేక్ పడుతుందేమో చూడాలి.

