అన్నయ్యకు పెళ్లైతే దూరమవుతారని ఏడ్చేశా: చిరు బర్త్‌డే వేళ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్

naveen
By -
pawan kalyan tweet

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచుకున్న జ్ఞాపకాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం ఒక అన్నయ్యగా మాత్రమే కాకుండా, తన జీవితాన్ని ఆయన ఎలా ప్రభావితం చేశారో వివరిస్తూ పవన్ ఒక సుదీర్ఘమైన, భావోద్వేగ లేఖను పంచుకున్నారు. బాల్యం నుంచి మొదలుపెట్టి పద్మవిభూషణ్ గా ఎదిగిన ప్రయాణం వరకు, తను దగ్గరుండి చూసిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు.

[FEATURED_IMAGE]

బుల్లెట్ బండిపై హీరోలా.. నాటి రోజులు


చిన్నతనంలో అన్నయ్య కాలేజీ చదువు కోసం నరసాపురం వెళ్లినప్పుడు, సెలవులకు ఇంటికి వస్తుంటే అదొక పండుగలా ఉండేదని పవన్ గుర్తుచేసుకున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు ఇంట్లో వాతావరణం వెలవెలబోయేదని, ఆయన ఉన్నప్పుడే ఇల్లు కళకళలాడుతూ ఉండేదని తెలిపారు.


స్కూల్ రోజుల్లో తన తండ్రి 350 సీసీ బుల్లెట్ బండి మీద అన్నయ్య వెళ్తుంటే, ఆయన పక్కన నడవడం ఎంతో గర్వంగా అనిపించేదట. ఉంగరాల జుట్టు, ఎన్సీసీ క్యాడెట్ ఫిజిక్, బెల్ బాటమ్ ప్యాంట్, కళ్ళజోడు పెట్టుకుని అప్పట్లోనే ఆయన ఒక హీరోలా కనిపించేవారని పవన్ వివరించారు. సినిమాల్లోకి రాకముందే తన దృష్టిలో అన్నయ్య ఒక హీరో అని స్పష్టం చేశారు.


సింగపూర్ ట్రిప్ నుంచి తెచ్చిన బ్లూ బ్యాగ్


కెరీర్ ప్రారంభంలో అన్నయ్య మొదటిసారి సింగపూర్ వెళ్లినప్పుడు ఒక పెద్ద బ్లూ బ్యాగ్ తీసుకొచ్చారని పవన్ తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అందులో తన కోసం ఒక చిన్న లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్ బుక్స్ తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు.


వాటితో పాటు మ్యూజిక్ టేపులు, టేప్ రికార్డర్, యార్డ్లీ పౌడర్లు, సబ్బులు, పెర్ఫ్యూమ్స్ కూడా తెచ్చారట. ఆ విధంగా ఎప్పుడూ తమ చిన్న ఇంట్లోకి అన్నయ్య ఎన్నో నవ్వులు, సంతోషాన్ని మోసుకొచ్చేవారని పవన్ ఎమోషనల్ అయ్యారు.


పెళ్లి తర్వాత దూరమవుతారని కన్నీళ్లు పెట్టుకున్నా..


అన్నయ్యకి వివాహం జరిగినప్పుడు, ఆయన ఎక్కడ తమకు దూరమవుతారో అని భయపడి పవన్ ఒక గదిలో కూర్చుని ఏడ్చేశారట. అది చూసిన అన్నయ్య, వదిన సురేఖను తీసుకువచ్చి "రా.. నీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తాను" అని నవ్విస్తూ ఓదార్చారని ఆయన తన పోస్ట్ లో రాసుకొచ్చారు.


ఆ తర్వాత చెన్నై వెళ్లినప్పుడు అన్నయ్య, వదిన చూపించిన ప్రేమను మాటల్లో చెప్పలేనని పేర్కొన్నారు. చదువులో తాను ఫెయిల్ అవుతూ, జీవితంలో సరైన లక్ష్యం లేకుండా ఉన్న సమయంలో.. అన్నయ్య కష్టంతో తాను బతుకుతున్నానని గిల్టీగా ఫీల్ అయ్యేవాడినని, అయినా అన్నయ్య ఒక్క మాట కూడా అనలేదని పవన్ తెలిపారు.


చెమటతో తడిసిన బట్టలతో 18 గంటల శ్రమ


చెన్నై వాతావరణంలో రోజూ 18 గంటల పాటు కష్టపడి, చెమటతో తడిసిన బట్టలు, షూస్‌తో అర్ధరాత్రి ఇంటికి చేరుకునే చిరంజీవిని చూసి పవన్ ఆశ్చర్యపోయేవారట. కనీసం నిలబడటానికి ఓపిక లేకపోయినా ఆయన ఎప్పుడూ అలసిపోలేదని వివరించారు.


సౌత్, నార్త్ సినిమాలకు వారధిగా మారిన తీరు, రీసెంట్‌గా వెన్నెముక ఆపరేషన్ జరిగిన వెంటనే మళ్లీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసి తిరిగి పనిలోకి వెళ్లడం ఆయన డెడికేషన్‌కు నిదర్శనమన్నారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆయన ఎప్పటికీ తనకి ఒకే ఒక్క హీరో అని పవన్ కళ్యాణ్ తన లేఖను ముగించారు.