[FEATURED_IMAGE]
హీరో కోసం గంటల తరబడి వెయిటింగ్.. డైరెక్టర్ నిర్లక్ష్యం
షూటింగ్ సెట్స్‌లో హీరోయిన్ల కంటే హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తాప్సీ ఓపెన్ గా చెప్పేసింది. తాము షూటింగ్ కోసం గంటల ముందే సెట్‌కి వెళ్లి కూర్చోవాల్సి వచ్చేదని, హీరోయిన్ వచ్చిందని అసిస్టెంట్ ఫోన్ చేసి చెబితే తప్ప హీరోలు సెట్‌కి వచ్చేవారు కాదని ఆమె వివరించింది. అంతేకాదు, హీరోలకు, హీరోయిన్లకు కేటాయించే రూమ్స్‌లో కూడా చాలా వ్యత్యాసం చూపిస్తారని తెలిపింది.
ఇక కెరీర్ మొదట్లో తాను ఒక సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం, అందులో తన క్యారెక్టర్‌కి ఉన్న గ్రాండ్ ఇంట్రడక్షన్ సీన్ అని తాప్సీ చెప్పింది. ఆ సీన్ ఎంతో అద్భుతంగా షూట్ చేశారని, కానీ ఆ తర్వాత తన ప్రమేయం లేకుండానే అకస్మాత్తుగా దాన్ని మార్చేశారని వాపోయింది. హీరోకు ఇష్టం లేకపోవడం వల్లే ఆ సీన్ మార్చేశారని తర్వాత అర్థమైందని, ఇదే విషయంపై దర్శకుడిని ప్రశ్నిస్తే.. "అన్నీ మీకు చెప్పాలని నాకు తెలియదు" అంటూ చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని, అది విని తాను షాక్ అయ్యానని తాప్సీ గుర్తుచేసుకుంది.
ఒక్క డైలాగ్ కోసం వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్!
అదే సినిమాలో హీరో డామినేషన్ కు సంబంధించిన మరో వింత అనుభవాన్ని కూడా తాప్సీ పంచుకుంది. ఒక సీన్‌లో తాను హీరోను చూసి ఇంగ్లీష్ లో "గో టు హెల్" (Go to Hell) అని అనాలి. అయితే డబ్బింగ్ చెప్పే సమయంలో ఆ డైలాగ్‌ను "వాటెవర్" (Whatever) గా మార్చాలని దర్శకుడు అడిగాడట. ఎందుకని నిలదీస్తే.. ఆ డైలాగ్ వల్ల హీరోకు అభ్యంతరం ఉందని అసలు నిజం బయటపెట్టారు.
దీనికి తాప్సీ ఏమాత్రం ఒప్పుకోలేదు. "కావాలంటే ఆ డైలాగ్‌ను మ్యూట్ చేసుకోండి, కానీ నేను మాత్రం తప్పుగా డబ్బింగ్ చెప్పను" అని ధైర్యంగా ముఖం మీదే తేల్చి చెప్పేసింది. కట్ చేస్తే.. సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లో చూసుకుంటే, సినిమా అంతా తాప్సీ చెప్పిన డబ్బింగే ఉంది కానీ, కేవలం ఆ ఒక్క డైలాగ్ కోసం మాత్రం వేరొక ఆర్టిస్ట్‌ను పెట్టి వాయిస్ ఓవర్ చెప్పించారు. దీన్ని బట్టి సెట్స్‌లో హీరోల పంతం ఏ రేంజ్ లో నెగ్గుతుందో అర్థం చేసుకోవచ్చు.
సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ అనేది ఒకరి సొంతం కాదు, కానీ ఇండస్ట్రీలో హీరోల చుట్టూ జరిగే భజన ఎప్పుడూ చర్చనీయాంశమే. ఒక హీరోయిన్ చెప్పే డైలాగ్‌ను ఫేస్ చేయలేక హీరో అభ్యంతరం చెప్పడం, దానికి దర్శకులు వత్తాసు పలకడం చూస్తుంటే మేల్ డామినేషన్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. భయపడి సైలెంట్ గా ఉండకుండా, తాప్సీ లాంటి నటీమణులు ఇలాంటి విషయాలను ధైర్యంగా బయటపెట్టడం ద్వారా రాబోయే తరానికి కచ్చితంగా ఒక మార్పుకు పునాది వేసినట్లే అవుతుంది.

