లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కుమార్తె, నటి అక్షర హాసన్ తన విద్యాభ్యాసం గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తాను టెన్త్ క్లాస్‌లో ఏకంగా మూడుసార్లు ఫెయిల్ అయ్యి చదువుకు స్వస్తి పలికానని, అయినా తల్లిదండ్రులు ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఓ పాడ్‌కాస్ట్‌లో నిర్మొహమాటంగా వెల్లడించింది. స్టార్ కిడ్ అయినా కెమెరా వెనుక కష్టాలు పడి పైకొచ్చిన ఈ భామ, భవిష్యత్తులో నటనకు గుడ్‌బై చెప్పి మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా సత్తా చాటుతానని ప్రకటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి రావడం, సక్సెస్ సాధించడం పూలపాన్పు లాంటి వ్యవహారం అని అంతా అనుకుంటారు. కానీ ఆ భ్రమలను పటాపంచలు చేస్తూ కమల్ హాసన్ ముద్దుల తనయ అక్షర హాసన్ తన రియల్ లైఫ్ స్ట్రగుల్స్‌ను బయటపెట్టింది. ఇటీవల ఓ ప్రముఖ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, విద్యాభ్యాసంలో తన వైఫల్యాలు, కెరీర్ తొలినాళ్లలో పడిన కష్టాల గురించి ఎవరూ ఊహించని షాకింగ్ నిజాలను పంచుకుని నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
హైస్కూల్ చదువుల్లో తాను ఎంత వెనుకబడ్డానో అక్షర ఏమాత్రం దాచుకోకుండా కుండబద్దలు కొట్టింది. పదో తరగతి పరీక్షల్లో ఏకంగా మూడుసార్లు ఫెయిల్ కావడంతో ఇక పాస్ కావడం తనవల్ల కాదని డిసైడ్ అయ్యి పుస్తకాలను పక్కన పెట్టేసిందట. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక తనను పల్లెత్తు మాట అనలేదని, తనకు నచ్చిన దారిలో వెళ్లే పూర్తి స్వేచ్ఛనిచ్చారని అక్షర ఎమోషనల్ అయ్యింది.
ఇంట్లో స్టార్స్ ఉన్నా ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా ఉంటాయని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. తెరపై తన యాక్టింగ్ బాగోలేకపోతే తల్లిదండ్రులు మొహం మీదే 'చాలా చెత్తగా నటించావు' అని కడిగేస్తారని, ఆ నిక్కచ్చి వాతావరణం వల్లే తాను ఈ రోజు గ్రౌండెడ్‌గా ఉన్నానని తెలిపింది. ఇతర స్టార్ కిడ్స్ లాగా అక్షర నేరుగా హీరోయిన్ అయిపోలేదు. ముందు డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి కిందిస్థాయి నుంచి కష్టపడింది.
ఆ తర్వాత రాహుల్ ధోలాకియా 'సొసైటీ', కమల్ హాసన్ 'శభాష్ నాయుడు' చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి సినిమా క్రాఫ్ట్‌పై పట్టు సాధించింది. అమితాబ్ బచ్చన్, ధనుష్ నటించిన 'షమితాభ్' సినిమాతో అనుకోకుండా హీరోయిన్‌గా మారిన అక్షర.. ఆపై అజిత్‌తో 'వివేగం', రీసెంట్‌గా 'సిమ్యులాక్రా' సినిమాల్లో మెరిసింది. సోదరి శృతి హాసన్ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నా, తన అసలు టార్గెట్ యాక్టింగ్ కాదని, త్వరలోనే డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టి ప్రేక్షకులకు సరికొత్త కథలు చూపిస్తానని అక్షర ప్రకటించడం విశేషం.

