బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో తెలుగు సినిమా, కేజీఎఫ్ 2 తో కన్నడ పరిశ్రమ అవలీలగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరిపోయినా.. తమిళ ఇండస్ట్రీకి మాత్రం ఆ కల ఇంకా తీరలేదు. రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్ లాంటి కళ్లు చెదిరే స్టార్లు ఉన్నప్పటికీ కోలీవుడ్ బాక్సాఫీస్ వెయ్యి కోట్ల మార్కును అందుకోవడంలో తడబడుతోంది. భారీ అంచనాలతో వచ్చిన లియో, కూలీ సినిమాలు సైతం ఈ మ్యాజిక్ ఫిగర్‌ను మిస్సవగా.. ఇక రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చే భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ మాత్రమే కోలీవుడ్ 1000 కోట్ల లోటును భర్తీ చేస్తుందనే ఆసక్తికర చర్చ మొదలైంది.
[FEATURED_IMAGE]దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు బాక్సాఫీస్ లెక్కల గురించే ఎక్కడ చూసినా హాట్ టాపిక్ నడుస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించి తెలుగు సినిమా సత్తాను గ్లోబల్ రేంజ్లో చాటాయి. అటు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 కూడా కన్నడ ఇండస్ట్రీకి ఏకంగా 1000 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించిపెట్టింది. కానీ, దశాబ్దాల ఘన చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా అపారమైన మార్కెట్ ఉన్న తమిళ చిత్రసీమ మాత్రం ఈ మ్యాజిక్ ఫిగర్ దగ్గర చతికిలపడుతోంది.
రజనీకాంత్, కమల్ హాసన్, దళపతి విజయ్ లాంటి తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు.. శంకర్, అట్లీ, లోకేశ్ కనగరాజ్ వంటి మాస్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ కోలీవుడ్ కలెక్షన్లు రూ.600 నుంచి రూ.800 కోట్ల దగ్గరే బ్రేకులు వేసుకుంటున్నాయి. లోకేశ్ - విజయ్ కాంబినేషన్లో వచ్చిన 'లియో' చిత్రం తమిళనాట తొలి వెయ్యి కోట్ల సినిమా అవుతుందని అంతా ఆశించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' సినిమాపైనా ఆకాశమంత అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఈ రెండు సినిమాలు కూడా ఆ బెంచ్‌మార్క్‌ను అందుకోలేక ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేశాయి.
ప్రస్తుతం తమిళ ప్రేక్షకులు, ట్రేడ్ పండితుల ఆశలన్నీ రజనీకాంత్ రాబోయే 'జైలర్ 2' పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు ఎంత బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు మించి వసూలు చేయడం కష్టమనే విశ్లేషణలు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తమిళ సినిమాలకు ఇతర భాషల్లో పాన్ ఇండియా ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే సరైన ప్రమోషన్స్ కొరవడటమే ఈ వెనుకబాటుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కోలీవుడ్‌కు ఇప్పుడు ఒకే ఒక్క బ్రహ్మాస్త్రం కనిపిస్తోంది. అదే సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో రాబోయే భారీ మల్టీస్టారర్. భారతీయ చలనచిత్ర సీమలోని ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే స్క్రీన్‌ను పంచుకుంటే ఆ హైప్ పాన్ ఇండియా స్థాయిలో ఊహకు అందనంతగా ఉంటుంది. సరైన యూనివర్సల్ కథతో ఈ ప్రాజెక్ట్ పడితే, తమిళ సినిమాకున్న వెయ్యి కోట్ల కల సునాయాసంగా నెరవేరుతుందని బాక్సాఫీస్ పండితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

