టాలీవుడ్‌లో ఫ్యాన్స్ మీట్ ట్రెండ్: ఫోటోలు హిట్ ఇస్తాయా?

naveen
By -
టాలీవుడ్‌లో కొత్త రోగం: హీరోలతో ఫోటో దిగితే సినిమా హిట్టేనా?

టాలీవుడ్‌లో ఇప్పుడు కొత్త ప్రమోషనల్ ట్రెండ్ నడుస్తోంది. సినిమా రిలీజ్‌కు ముందు ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కాకుండా 'ఫ్యాన్స్ మీట్'ల పేరుతో హీరోలు జనాలతో ఫోటోలు దిగుతూ హడావుడి చేస్తున్నారు. నాని, విజయ్ దేవరకొండ, తాజాగా విశ్వక్ సేన్ ఇదే బాట పట్టగా.. ఈవెంట్లలో తోపులాటలు జరగడం చర్చనీయాంశమైంది. అయితే, కేవలం సోషల్ మీడియా హైప్ కోసం దిగే ఈ ఫోటోలు నిజంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

[FEATURED_IMAGE]

ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ అంటే ప్రెస్‌మీట్ లేదా ఆడియో ఫంక్షన్. కానీ, ఇప్పుడు టాలీవుడ్ ప్రమోషన్ల రూటు పూర్తిగా మారిపోయింది. సినిమా థియేటర్లలోకి రావడానికి నాలుగైదు రోజుల ముందు ఫ్యాన్స్ మీట్ పేరుతో వేలాది మందిని పిలిపించి ఫోటోలు దిగడమే ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది.


హీరోలు వరుస ప్రాజెక్టులు చేయకపోవడం, ఒక్కో సినిమాకు రెండేళ్ల పైనే గ్యాప్ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో క్రేజ్ తగ్గుతుందనే భయం మేకర్స్‌లో కనిపిస్తోంది. అందుకే ఈ లాంగ్ గ్యాప్‌ను కవర్ చేయడానికి ఈ కొత్త స్ట్రాటజీని వాడుతున్నారు. హీరోతో దిగిన ఫోటోను అభిమానులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తుండటంతో సినిమాకు ఫ్రీగా డిజిటల్ ప్రచారం జరిగిపోతోంది.


ఇటీవల 'ది ప్యారడైజ్' కోసం నాని, 'రణబాలి' కోసం విజయ్ దేవరకొండ - రష్మిక ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. తాజాగా 'కల్ట్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా సారథి స్టూడియోస్‌లో ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. అయితే, ఊహించని స్థాయిలో జనం ఎగబడటంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుని కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.


అయితే, ఈ ఈవెంట్లలో పాల్గొంటున్న వారిలో నిజమైన అభిమానులు ఎంతమంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక హీరో మీట్‌కు వెళ్లిన వాళ్లే, మరుసటి రోజు మరో హీరో దగ్గర క్యూ కడుతున్నారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ డీపీలు మార్చుకోవడానికి, నెట్టింట లైకుల కోసమే వీరు ఎగబడుతున్నారనే విమర్శలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.


చివరికి ఈ ఫోటోల హంగామా ఫస్ట్ డే ఓపెనింగ్స్‌కు మాత్రమే పనికొస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు సినిమాను బ్రహ్మరథం పడతారు, లేదంటే ఎన్ని ఫోటోలు దిగినా లాభం లేదు. కేవలం సోషల్ మీడియా హైప్ కోసం కనీస భద్రతా ఏర్పాట్లు లేకుండా జనాన్ని రిస్క్‌లో పడేయడం మానేసి, దర్శకులు బలమైన కథల మీద ఫోకస్ పెడితే బాక్సాఫీస్ వద్ద అవే అసలైన విజయాలు సాధించిపెడతాయి.