ట్రంప్ టారిఫ్‌ల మధ్య అమెరికా అనూహ్య చర్యలు: ఆసియాలో భారీ సైనిక మోహరింపు

naveen
By -

 వాషింగ్టన్: ప్రపంచం మొత్తం ట్రంప్ టారిఫ్‌ల గురించి చర్చిస్తున్న సమయంలో, అమెరికా ఊహించని చర్యలకు పాల్పడింది. ఆసియా ప్రాంతంలో రహస్యంగా భారీ స్థాయిలో సైనిక బలగాలను మోహరించింది.

ఈ చర్యలో భాగంగా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్ విమానాలను రంగంలోకి దించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బీ-2 స్టెల్త్ బాంబర్‌లు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక యుద్ధ విమానాలుగా పేరుగాంచాయి. అమెరికాలో ఇటువంటివి 20 ఉండగా, వాటిలో ఆరింటిని హిందూ మహాసముద్ర ప్రాంతంలోని యూఎస్-బ్రిటన్ మిలిటరీ స్థావరం డియాగో గార్సియా రన్‌వేపై మోహరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం బయటపడింది. అయితే, రాడార్ సిగ్నల్స్‌కు కూడా చిక్కకుండా షెల్టర్‌లో మరిన్ని బాంబర్‌లు ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా,

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కూడా యుద్ధ విమానాల గస్తీని అమెరికా పెంచాలని యోచిస్తోంది. ఇప్పటివరకు ఒక విమాన వాహక నౌకతోనే (అరేబియా సముద్రంలో యూఎస్‌ఎస్ హ్యారీ ఎస్. ట్రూమన్) గస్తీ నిర్వహిస్తుండగా, ఆ సంఖ్యను 3కి పెంచాలని భావిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా పశ్చిమ పసిఫిక్‌లో ఒక విమాన వాహక నౌకతో గస్తీ ఉంచాలని యోచిస్తోంది. అంతేకాకుండా, ఈ మోహరింపు భవిష్యత్తులో మరింత పెరగనుందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. అయితే, విశ్లేషకులు ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు.

హఠాత్తుగా ఎందుకంటే:

ఆయా ప్రాంతాలలో అమెరికా యొక్క రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఈ మోహరింపు అని పెంటగాన్ ప్రకటించింది. అదే సమయంలో, భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలో దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు మరియు వాటి కొనసాగింపుగా చెలరేగే ఉద్రిక్తతలను అరికట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.

అమెరికా ఏ దేశం లేదా సంస్థల పేర్లను ప్రకటించనప్పటికీ, మధ్యప్రాచ్యం మరియు దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఇరాన్ మరియు యెమెన్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే సైన్యాన్ని రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు.

హెచ్చరికలతో మొదలైనప్పటికీ:

గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే హౌతీలకు హెచ్చరిక జారీ చేశారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌ను మరియు వారికి మద్దతు ఇస్తున్న ఇరాన్‌ను హెచ్చరించారు. అలాగే, అణు ఒప్పందం విషయంలో కూడా ఇరాన్‌ను హెచ్చరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

అయితే, రక్షణ రంగ నిపుణులు మాత్రం బీ-2 లాంటి శక్తివంతమైన బాంబర్‌లను కేవలం హౌతీలు మరియు ఇరాన్ కోసమే మోహరించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యెమెన్‌పై దాడికి ఇది చాలా ఎక్కువ బలగం అనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే, దీని ద్వారా ఇరాన్ మిత్రపక్షాలైన చైనా మరియు రష్యాలకు కూడా ట్రంప్ హెచ్చరిక సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ మొదలైంది.

దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా పశ్చిమ పసిఫిక్‌లో యూఎస్‌ఎస్ నిమిట్జ్ క్యారియర్‌ను, మధ్యప్రాచ్యంలో యూఎస్‌ఎస్ కార్ల్ విన్‌సన్ వాహక నౌకను మోహరించడమే ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. దీంతో ట్రంప్ ఆలోచన అంతకు మించే ఉందనే చర్చ జరుగుతోంది.