ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్‌గా వెలుగొందిన ప్రియాంక చోప్రా, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే అగ్ర కథానాయికగా ఎదిగారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోలతో జత కట్టారు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్ నిక్ జోనాస్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్న ఆమె, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి పునరాగమనం చేస్తున్నారు.
సినిమాల్లోకి రీఎంట్రీ
నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకుని హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంక, చాలా చిత్రాలను వదులుకున్నారు. కొంతకాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఆమె ఒక కథానాయికగా నటిస్తున్నారు.
క్రిష్ 4లోనూ ఛాన్స్?
తాజాగా హిందీలో రాబోతున్న క్రిష్ 4లో కూడా ప్రియాంక కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, తెలుగు మరియు హిందీ భాషల్లో వరుస విజయాలతో రష్మిక ఫుల్ జోష్‌లో ఉన్న సమయంలో ప్రియాంక చోప్రా రీఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
రష్మిక జోరుకు బ్రేక్ పడుతుందా?
‘పుష్ప-2’, ‘యానిమల్’, ‘చావా’, ‘సికందర్’ వంటి చిత్రాల తర్వాత రష్మిక కెరీర్ గ్రాఫ్ చాలా వేగంగా పెరిగింది. దీంతో ఆమెకు హిందీలో మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. అయితే, ఈ సమయంలో ప్రియాంక చోప్రా తిరిగి రావడం, ఆమె ఒప్పుకున్న రెండు సినిమాలు విజయం సాధిస్తే, సినీ విశ్లేషకులు కొత్త అంచనాలు వేస్తున్నారు. నివేదికల ప్రకారం ప్రియాంక SSMB 29 కోసం రూ. 30 కోట్లు, క్రిష్ 4 కోసం రూ. 20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు.
అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్?
ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నిలుస్తారు. అలాగే, ఇప్పుడు వరుస హిట్‌లతో దూసుకుపోతున్న రష్మిక స్పీడ్‌కు కూడా బ్రేకులు పడవచ్చని అంటున్నారు. ప్రియాంక హిందీలో మరిన్ని అవకాశాలకు అంగీకారం తెలుపుతారా లేదా చూడాలి.