జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి జపనీస్ చిట్కాలు: మెదడును చురుగ్గా ఉంచే పద్ధతులు

 


ఈ రోజుల్లో చాలామందికి ఒక సమస్య ఉంది. అదేంటంటే, ఏం చేయాలో గుర్తుండదు. ఏదైనా చేద్దాం అనుకుని పనులు మొదలుపెట్టినా, మధ్యలోనే మర్చిపోవడం చాలా సాధారణమైపోయింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలే అయినా, మన మెదడును ఎప్పుడూ చురుగ్గా ఉంచుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా జపాన్ నుంచి వచ్చిన కొన్ని అద్భుతమైన జ్ఞాపకశక్తిని పెంచే చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే మన మెదడు మరింత చురుగ్గా మారి, విషయాలు మర్చిపోకుండా గుర్తుంచుకునే శక్తిని పెంచుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

కన్ సాట్సూ (Kansatsu)

ఈ పద్ధతిని జపాన్‌లో సన్యాసులు, కళాకారులు ఎక్కువగా ఉపయోగిస్తారు. కన్ సాట్సూ అంటే మన చుట్టూ ఉన్న విషయాలను నిశ్శబ్దంగా గమనించడం. మనం ఏమీ మాట్లాడకుండా, చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా గమనిస్తే, మెదడు సానుకూలంగా స్పందిస్తుంది. అది అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుంటుంది. ఇది ఒక రకమైన మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్.

శిసా కాన్కో (Shisa Kanko)

శిసా కాన్కో అంటే ఒక విషయాన్ని చూపిస్తూ బిగ్గరగా మాట్లాడటం. దీని అర్థం, శరీరాన్ని, మెదడును కలిపి పని చేసేలా మాటలు చెప్పడం. ఇలా చేయడం వల్ల మన దృష్టి పూర్తిగా ఆ విషయంపైనే ఉంటుంది. జపాన్‌లో రైలు నడిపే ఆపరేటర్లు ఈ విధానాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు.

నైకాన్ (Naikan)

కాలం గడిచే కొద్దీ మన జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ జపనీయులు నైకాన్ అనే పద్ధతిని పాటిస్తూ, మౌనంగా ఉండటం ద్వారా పాత జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని, "నేను ఎవరికీ ఏం ఇచ్చాను? ఎవరి నుంచి ఏం తీసుకున్నాను? ఎవరి వల్ల నాకు ఇబ్బంది కలిగింది?" వంటి ప్రశ్నలను మనలో మనం వేసుకుంటే, పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తాయని వారు చెబుతారు.

చిసోకు (Chisoku)

చిసోకు అనే ఈ పద్ధతి మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. అదేంటంటే, మనం నిరంతరం లక్ష్యాల వెంట పరుగులు పెట్టడం వల్ల వర్తమానాన్ని మర్చిపోతున్నాం. మనకు ఉన్నది ఈ క్షణమే. దానిపైనే పూర్తిగా దృష్టి పెడితే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అంటే, భవిష్యత్ గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుతం చేస్తున్న పనిపై దృష్టి పెట్టాలి. ఇది మన మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది.

గ్యో (Gyo)

గ్యో అంటే ఒకే పనిలో పూర్తిగా ఏకాగ్రతతో నిమగ్నం కావడం. ఉదాహరణకు, ఇల్లు శుభ్రం చేయడం, వస్తువులను క్రమబద్ధంగా సర్దడం వంటి సాధారణ పనులే అయినా, వాటిని ఏకాగ్రతతో చేస్తే మన మనసు స్థిరంగా ఉంటుంది. దీని వల్ల మన మెదడు దృఢంగా పని చేస్తుంది. తత్ఫలితంగా జ్ఞాపకశక్తి బలోపేతం అవుతుంది.

కొటోడమా (Kotodama)

జపనీయులు విశ్వసించే మరో శక్తివంతమైన టెక్నిక్ కొటోడమా. ఇది ఒక పదం లేదా వాక్యాన్ని పదే పదే పునరావృతం చేయడం. దీని వల్ల ఆ పదం మన మెదడులో స్థిరంగా నిలిచిపోతుంది. విద్యార్థులు లేదా ప్రసంగాలు ఇచ్చే వ్యక్తులు ఈ పద్ధతిని వాడితే జ్ఞాపకశక్తి బలపడుతుంది.

ఉకెటమో (Uketamo)

ఉకెటమో అనే ఈ భావన టొహౌకు అనే జపనీస్ మతపరమైన వర్గం నుండి వచ్చింది. దీని అర్థం "నిజాయితీగా అంగీకరిస్తాను". మనం ఏ అంశాన్నైనా హృదయపూర్వకంగా అంగీకరిస్తే మానసికంగా స్థిరంగా ఉండగలమని, అప్పుడు మన భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయని ఇది చెబుతోంది.

మీ జ్ఞాపకశక్తి బలపడాలని, మర్చిపోవడాన్ని తగ్గించాలని అనుకుంటే, జపనీయులు శతాబ్దాలుగా పాటిస్తున్న ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి. ఇవి ఖచ్చితంగా మీ మెదడును చురుగ్గా ఉంచి, మీరు మరిచిపోతున్న విషయాలను గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. మార్పును మీరే స్పష్టంగా గమనిస్తారు!