కొత్త కరోనా వేరియంట్ JN.1 ఆందోళన కలిగిస్తుందా? మళ్ళీ లాక్‌డౌన్ పరిస్థితులు వస్తాయా? అనే భయాలు నెలకొన్నాయి. అయితే, అంతకంటే ముందు కోవిడ్ బూస్టర్ వ్యాక్సిన్ గురించి కొత్త సందేహాలు వస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్‌తో గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తుండటంతో, బూస్టర్ వేయించుకోవాలా వద్దా అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కరోనా కొత్త వేరియంట్ ప్రభావం
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19, ఇప్పుడు మళ్ళీ తన ఉనికిని చాటుతోంది. గత వారం రోజులుగా ఆసియా దేశాల్లో తీవ్రతను పెంచుతోంది. భారత్‌లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ కోవిడ్ భయాన్ని తిరిగి తీసుకువస్తోంది.
ప్రస్తుతం మన దేశంలో 250కి పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గతంలో లాగే ఈసారి కూడా కేరళలోనే కోవిడ్ భయం ఎక్కువగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని కేరళ ఆరోగ్య మంత్రి స్వయంగా హెచ్చరించారు. పుదుచ్చేరి, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, హర్యానా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాలను కూడా కోవిడ్ భయం అప్రమత్తం చేసింది. పొరుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడంతో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రత్యేక సలహా జారీ చేసింది.
* వీలైనంత వరకు పార్టీలు, ఫంక్షన్లు, ప్రార్థనలకు దూరంగా ఉండాలి.
* రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లు, ఎయిర్‌పోర్టుల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.
* 60 ఏళ్లు పైబడినవారు, గర్భిణులు ఇంటి నుంచి బయటకు రాకూడదు.
* తరచుగా చేతులు కడుక్కోవాలి.
* జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
* అనారోగ్యంగా ఉంటే బయటకు వెళ్లవద్దు.
అలాగే, పరీక్షల కోసం ల్యాబ్‌లను సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్యాధికారులను కూడా ఆదేశించారు.
కొత్త వేరియంట్ తీవ్రత
ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలో కోవిడ్ సంబంధిత సమస్యలతో ఇద్దరు మరణించారు. వారికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో అప్పట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, హాంకాంగ్‌లో 30 మందికి పైగా మరణించగా, థాయ్‌లాండ్‌లో ఏప్రిల్ నుంచే కోవిడ్ తీవ్రత ఉంది. ఒక్క బ్యాంకాక్‌లోనే ఆరు వేల కేసులు నమోదయ్యాయి. మన దేశ జనాభాతో పోలిస్తే ప్రస్తుత కేసుల సంఖ్య చాలా తక్కువ.
అయితే, కేవలం కేసుల సంఖ్య తక్కువగా ఉందని ఊపిరి పీల్చుకోకూడదు. ఎందుకంటే, కేసుల సంఖ్య టెస్టుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కోవిడ్ సంకేతాలు కనిపించిన వెంటనే టెస్టుల కోసం క్యూ కట్టే పరిస్థితి ఇంకా మన దేశంలో లేదు.
ప్రస్తుతం సర్క్యులేషన్‌లో ఉన్న వైరస్ ఒమిక్రాన్ ఫ్యామిలీలోని JN.1 అనే వేరియంట్ నుంచి వచ్చిన సబ్-వేరియంట్. అసలు వైరస్‌తో పోలిస్తే దీని తీవ్రత చాలా తక్కువ. థర్డ్ వేవ్‌లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కూడా అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి, తాజా వేరియంట్‌తో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. 100 మందికి వైరస్ సోకితే, ఐదుగురు కూడా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాదని అంచనా.
బూస్టర్ వ్యాక్సిన్‌పై కొత్త భయాలు
కోవిడ్ ఉనికి తీవ్రతను బట్టి దేశాలన్నీ వ్యాక్సిన్‌లను అందుబాటులో ఉంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే, కేవలం అందుబాటులో ఉన్నంత మాత్రాన బూస్టర్ వ్యాక్సిన్ వేసుకోవచ్చా అనేది కొత్తగా పుట్టిన భయం.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కోవిడ్ వ్యాక్సిన్ రెగ్యులేషన్స్‌ను మార్చింది. 65 ఏళ్లు పైబడిన వారు మాత్రమే బూస్టర్ షాట్స్ తీసుకోవడానికి అర్హులని స్పష్టం చేసింది. ఇంతకంటే భయపెట్టే విషయం ఏమిటంటే, వ్యాక్సినేషన్ తర్వాత గుండె సంబంధిత వ్యాధులు రావొచ్చని FDA హెచ్చరిస్తోంది. ఈ మేరకు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు లేబుల్‌పై వార్నింగ్ ఇవ్వాలని ఆదేశించింది. కాబట్టి, బూస్టర్ వ్యాక్సిన్ వేసుకుని కోవిడ్ బారి నుంచి తప్పించుకుందామని ఆశపడితే, గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!