Weather Report | తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం: ఉదయం ఎండ, సాయంత్రం వాన!

 

weather report

తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం ఎండ తీవ్రంగా ఉంటే, సాయంత్రానికి ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

ఉత్తర తెలంగాణలో అకాల వర్షాలు, ధాన్యం తడిసి ముద్ద

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. దీనితో ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం తడిసిపోయింది. ఉదయం ఎండలు మండిపోతుండగా, సాయంత్రానికి ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం రాశులపై టార్పాలిన్ కవర్లు కప్పినా, బలమైన గాలులకు అవి కొట్టుకుపోవడంతో వడ్లు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండు రోజులు వర్ష సూచన

వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 11 జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల మూడు రోజులపాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని ప్రకటించింది.

ఏపీలోనూ వానలు

ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఆగడం లేదు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఒకవైపు ఎండ, మరోవైపు వాన పడటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, గంగవరం మండలాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు