కేవలం సినిమాలే అనుకుంటే పొరపాటే.. 'ఐబొమ్మ' వెనుక వందల కోట్ల చీకటి సామ్రాజ్యం ఉంది! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి అంతర్జాతీయ నేరస్తుడిగా మారిన రవి కథ.. పోలీసులనే విస్తుపోయేలా చేసింది.
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' (iBomma) వెనుక ఉన్న అసలు సూత్రధారి ఇమంది రవి అరెస్టుతో దిమ్మతిరిగే నిజాలు బయటపడుతున్నాయి. ఇది కేవలం సినిమా పైరసీ వ్యవహారం మాత్రమే కాదని, ఏకంగా 10 దేశాల్లో నెట్‌వర్క్ నడిపి, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా వందల కోట్ల రూపాయల అక్రమ దందా సాగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ భారీ ఆర్థిక లావాదేవీలను గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగి, కేసు వివరాలు కోరింది.
భార్య, అత్తమామల అవమానంతోనే..
ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన రవి, ఈ నేర ప్రపంచంలోకి ఎందుకు అడుగుపెట్టాడో విచారణలో బయటపెట్టాడు. తన జీతం సరిపోకపోవడం, దానికి తోడు ఇంట్లో భార్య, అత్తమామలు తనను చులకనగా మాట్లాడటంతో కసి పెంచుకున్నాడు.
సులభంగా, వేగంగా డబ్బు సంపాదించాలనే దురాశతో పైరసీ మార్గాన్ని ఎంచుకున్నాడు. "నేను ఒంటరిని, నన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి" అంటూ పోలీసులకే నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం అతని మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రాగానే, కూకట్‌పల్లిలోని నివాసంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సినిమాలు కాదు.. బెట్టింగ్ యాప్సే అసలు ఆదాయం!
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయం బయటపడింది. రవి సంపాదనలో సినిమా పైరసీ ద్వారా వచ్చేది కేవలం 20 శాతం మాత్రమేనట. మిగిలిన 80 శాతం భారీ ఆదాయం.. 'ఐబొమ్మ'కు వచ్చే యూజర్లను బెట్టింగ్ యాప్‌లకు మళ్లించడం (Traffic Diversion) ద్వారానే సంపాదించాడని తేలింది.
ఈ డబ్బునంతా క్రిప్టో కరెన్సీ, హవాలా మార్గాల్లో విదేశీ ఖాతాలకు తరలించాడు. ఇప్పటికే అతడి ఖాతాల్లోని రూ. 3.5 కోట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ నెట్‌వర్క్‌లో విదేశీయుల హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
జైల్లో మౌనవ్రతం.. లాయర్లతోనూ మాట్లాడట్లేదు!
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న రవి, ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తి ముభావంగా ఉంటున్నాడు. తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదులతో మాట్లాడేందుకు కూడా నిరాకరించడం గమనార్హం.
విదేశీ పౌరసత్వం ఉన్న రవి దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉండటంతోనే పోలీసులు అత్యవసరంగా అరెస్ట్ చేశారు. సినిమా పైరసీ ముసుగులో జరిగిన ఈ అంతర్జాతీయ బెట్టింగ్, హవాలా స్కామ్ మూలాలు ఇంకెంత లోతుగా ఉన్నాయో ఈడీ విచారణలో తేలనుంది.

