100 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదు! లంచ్‌కు ముందే 'టీ బ్రేక్' ఇవ్వబోతున్నారు.. బీసీసీఐ ఈ వింత ప్రయోగం ఎందుకు చేస్తోంది?
సాధారణంగా 90 ఓవర్ల పాటు సాగే టెస్టు మ్యాచ్‌లో లంచ్, టీ బ్రేక్స్ ఉంటాయి. ఉదయాన్నే మ్యాచ్ మొదలైన రెండున్నర గంటల తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు. కానీ, శతాబ్దంపైగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి బీసీసీఐ బ్రేక్ వేయనుంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే టెస్టులో తొలిసారిగా ఓ కొత్త ప్రయోగం చేస్తున్నారు.
ఈశాన్యం.. చీకటి.. ఇదే అసలు సమస్య!
ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు భారత్ పర్యటనలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 22 నుంచి అసోంలోని గువాహటిలో జరగనుంది. దేశ ఈశాన్య ప్రాంతంలో, అది కూడా శీతాకాలంలో ఈ మ్యాచ్ జరుగుతుండడమే ఈ మార్పునకు కారణం.
భారత దేశం అంతటా ఒకటే టైమ్ జోన్ (IST) ఉన్నా, ఈశాన్య రాష్ట్రాలకు, పశ్చిమాన ఉన్న ముంబైకి సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో చాలా తేడా ఉంటుంది. ఈశాన్యంలో శీతాకాలంలో సాయంత్రం 4 గంటలకే వెలుతురు మందగిస్తుంది. దీంతో పూర్తి ఓవర్ల ఆట సాధ్యం కాదు.
ఉదయం 8:30కే టాస్.. 4 గంటలకే క్లోజ్!
వెలుతురు సమస్యను అధిగమించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు మ్యాచ్‌ను సాధారణంగా 9.30కు బదులు, గువాహటిలో ఉదయం 8.30కే (టాస్) ప్రారంభిస్తారు. ఆట ఉదయం 9 గంటలకు మొదలవుతుంది.
లంచ్‌కు ముందు 'టీ బ్రేక్'.. ఇదే కొత్త ప్రయోగం!
కొత్త షెడ్యూల్ ప్రకారం, 9-11 గంటల మధ్య తొలి సెషన్ ఉంటుంది. ఆ తర్వాత 20 నిమిషాల 'టీ బ్రేక్' ఇస్తారు. రెండో సెషన్ అనంతరం, 'లంచ్ విరామం' మధ్యాహ్నం 1.20 నుంచి 2 గంటల మధ్య ఉంటుంది. ఆటను సాయంత్రం 4 గంటలకే ముగిస్తారు. అవసరమైతే అరగంట అదనపు సమయం కేటాయిస్తారు.
సాధారణంగా లంచ్ తర్వాత టీ బ్రేక్ వస్తుంది. కానీ, వెలుతురును సద్వినియోగం చేసుకోవడానికి, 90 ఓవర్ల ఆటను పూర్తి చేయడానికి బీసీసీఐ ఈ చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.

