భారత్ దెబ్బకు పాక్ ఇంకా కోలుకోలేదా?

naveen
By -

 భారత్ కొట్టిన దెబ్బకు ఆరు నెలలు గడిచినా పాకిస్తాన్ ఇంకా తేరుకోలేదు! ఆ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో తాజా శాటిలైట్ చిత్రాలు ఇప్పుడు బయటపెట్టాయి.


Pakistan still repairing bases after India's Operation Sindoor.


ఈ ఏడాది మే నెలలో భారత్ జరిపిన సైనిక దాడుల (ఆపరేషన్ సిందూర్) నుంచి పాకిస్తాన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని స్పష్టమవుతోంది. దాడులు జరిగి ఆరు నెలలు పూర్తయినా, దెబ్బతిన్న సైనిక స్థావరాల్లో మరమ్మతులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తాజా శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వివరాలను ప్రముఖ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) నిపుణుడు డేమియన్ సైమన్ 'X' వేదికగా వెల్లడించారు.


అణు స్థావరం దగ్గర.. కొత్త నిర్మాణం!

సైమన్ విశ్లేషణ ప్రకారం, రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత్ దాడి చేసిన ప్రదేశంలో పాకిస్తాన్ ఇప్పుడు ఒక కొత్త నిర్మాణాన్ని చేపట్టింది. పాక్ అణ్వాయుధాలను పర్యవేక్షించే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ (SPD) ప్రధాన కార్యాలయానికి ఈ ఎయిర్‌బేస్ చాలా దగ్గరగా ఉండటం గమనార్హం.


ఇంకా తెరుచుకోని హ్యాంగర్!

అదేవిధంగా, సింధ్‌లోని జేకబాబాద్ వైమానిక స్థావరంలో దెబ్బతిన్న హ్యాంగర్‌కు మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. అంతర్గత నష్టాన్ని అంచనా వేయడానికే హ్యాంగర్ పైకప్పును దశలవారీగా తొలగిస్తున్నట్లు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందని సైమన్ వివరించారు.


'ఆపరేషన్ సిందూర్' అంటే..

ఏప్రిల్‌లో జరిగిన పాక్ ప్రేరేపిత పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, మే నెలలో భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌పై మెరుపు దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో నూర్‌ఖాన్, జేకబాబాద్‌తో సహా మొత్తం 11 పాక్ సైనిక స్థావరాలను భారత దళాలు కచ్చితత్వంతో టార్గెట్ చేశాయి. ఈ దాడులతో పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని అప్పట్లో భారత వాయుసేన ప్రకటించింది.


భారత క్షిపణులు తమ సైనిక స్థావరాలను తాకినట్లు ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించడం తెలిసిందే. శాటిలైట్ చిత్రాల విశ్లేషణలో నిపుణుడిగా పేరుపొందిన డేమియన్ సైమన్ తాజా విశ్లేషణ, భారత్ జరిపిన దాడుల తీవ్రతను, పాకిస్తాన్ నెమ్మదించిన పునరుద్ధరణ పనులను మరోసారి ప్రపంచం ముందు ఉంచింది.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!