ఎన్నికల్లో ఓటమి.. ఆ కుటుంబంలో చిచ్చు రేపింది! తమ్ముడు ఏకంగా అక్కపై చెప్పు విసిరేంత గొడవ జరిగిందట!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో కుంపటి రాజేసింది. ఎన్నికల ఓటమిని కారణంగా చూపుతూ కుమారుడు తేజస్వి యాదవ్, కుమార్తె రోహిణి ఆచార్య మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఈ చిచ్చుపై ఎట్టకేలకు లాలూ స్పందించారు. ఇది తమ కుటుంబ అంతర్గత వ్యవహారమని, ఈ సమస్యను తానే స్వయంగా పరిష్కరిస్తానని ఆయన పార్టీ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
తేజస్వికి పట్టం.. రోహిణికి అవమానం?
సోమవారం జరిగిన ఆర్జేడీ ఎమ్మెల్యేల సమావేశంలో లాలూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమావేశంలో తేజస్వి యాదవ్‌ను శాసనసభాపక్ష నేతగా (CLP Leader) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొడుకును ప్రశంసించిన లాలూ.. ఎన్నికల కోసం తేజస్వి చాలా కష్టపడ్డాడని, పార్టీని అతడే ముందుకు నడిపిస్తాడని అన్నారు. ఈ భేటీకి లాలూ భార్య రబ్రీ దేవి, పెద్ద కుమార్తె మీసా భారతి హాజరయ్యారు.
"నీ వల్లే ఓడాం".. చెప్పు విసిరిన తేజస్వి!
అసలు గొడవకు కారణం ఫలితాల రోజేనని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు (శనివారం), తేజస్వి యాదవ్ తన సోదరి రోహిణి ఆచార్యతో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. "నీ వల్లే మనం ఎన్నికల్లో ఓడిపోయాం" అని ఆమెపై తేజస్వి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ క్రమంలోనే కోపంతో ఆమెపైకి చెప్పు విసిరి దుర్భాషలాడినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
"కుటుంబం వెలివేసింది": రోహిణి సంచలన పోస్ట్
ఈ అవమానం తర్వాత, రోహిణి ఆచార్య సోషల్ మీడియా 'X' వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. తనను కుటుంబం నుంచి వెలివేశారని, అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని ప్రకటించారు. తేజస్వి సన్నిహితులైన సంజయ్ యాదవ్, రమీజ్ నెమత్ ఖాన్‌ల ఒత్తిడితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. "నన్ను, నేను తండ్రికి దానం చేసిన కిడ్నీని కూడా కించపరిచేలా మాట్లాడారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం కలకలం రేపింది. ఈ వివాదంతో లాలూ కుమార్తెలు రాజలక్ష్మి, రాగిణి, చందా కూడా పట్నా నివాసం నుంచి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకవైపు తేజస్విని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూనే, మరోవైపు కుటుంబంలో ఈ స్థాయిలో గొడవలు జరగడం ఆర్జేడీ శ్రేణులను గందరగోళంలో పడేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ ఈ కుటుంబ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

