సొంత ప్రభుత్వంపైనే ఓ ముఖ్యమంత్రి ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడం చాలా అరుదు. పాకిస్థాన్‌లో జరుగుతున్న ఈ పరిణామం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
పాకిస్థాన్ ప్రభుత్వంపై ఖైబర్ పఖ్తుంఖ్వా (KP) ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రావిన్స్‌లో పాకిస్థాన్ ప్రభుత్వమే స్వయంగా ఉగ్రదాడులు చేయిస్తోందని ఆయన బాంబు పేల్చారు. గత నెలలోనే సీఎం పగ్గాలు చేపట్టిన పీటీఐ నేత అఫ్రిది, ఇస్లామాబాద్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఆఫ్ఘనిస్థాన్‌తో దోస్తీ ఇష్టం లేకనే.."
పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌తో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు సత్సంబంధాలు నెలకొనడం ఇస్లామాబాద్‌కు ఏమాత్రం ఇష్టం లేదని అఫ్రిది మండిపడ్డారు. ఈ బంధాన్ని చెడగొట్టడానికే కేంద్ర ప్రభుత్వం తమ ప్రావిన్స్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. శాంతి ప్రయత్నాలను, చర్చలను అడ్డుకోవడమే ఈ దాడుల వెనకున్న అసలు కుట్ర అని ఆయన విమర్శించారు.
"ఉగ్రవాదం ముసుగులో సామాన్యుల హత్యలు"
పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో సైనిక బలగాలు సామాన్యులను టార్గెట్ చేస్తున్నాయని సీఎం అఫ్రిది ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల ఏరివేత సాకుతో సైనికులు సామాన్యులపై దౌర్జన్యాలకు దిగుతున్నారని, సొంత ప్రజలనే పొట్టనబెట్టుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల పష్తూన్ తహాఫుజ్ మూమెంట్ (PTM) సభ్యుల కిడ్నాప్‌ను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు.
తిరా లోయలో నరమేధం..
ఈ సందర్భంగా, ఇటీవల పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని తిరా లోయలో పాక్ వైమానిక దాడుల విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఆ దాడిలో 30 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన వార్తలను ప్రస్తావిస్తూ, సొంత ప్రజలపైనే పాక్ సైన్యం బాంబులు వేయడం దారుణమన్నారు. శాంతికి భంగం కలిగించే ఎవరినైనా ఉమ్మడి శత్రువుగా చూస్తామని హెచ్చరించారు.
ఓ వైపు ఉగ్రవాదంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లో, ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే కేంద్ర ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఆ దేశంలోని అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతోంది.

