అంగారకుడిపై నాసా రోవర్ కంటపడిన ఆ రాయి ఇప్పుడు శాస్త్రవేత్తలనే షాక్‌కు గురిచేస్తోంది! ఎర్ర గ్రహంపై ఉండకూడని ఆ వింత రాయి.. అసలు అక్కడికి ఎలా వచ్చిందనేది పెద్ద మిస్టరీగా మారింది.
అంగారక గ్రహంపై అన్వేషణ సాగిస్తున్న నాసా 'పర్సెవరెన్స్ రోవర్' (Perseverance Rover) కెమెరాకు చిక్కిన ఒక దృశ్యం ఇప్పుడు అంతరిక్ష పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది. జెజెరో క్రేటర్ సమీపంలోని వెర్నోడెన్ అనే ప్రాంతంలో ఒక వింత బండరాయిని రోవర్ గుర్తించింది. సుమారు 80 సెంటీమీటర్ల (31 అంగుళాలు) వెడల్పు ఉన్న ఈ రాయికి నాసా "ఫిప్సాక్స్‌లా" (Fipsakxla) అని విచిత్రమైన పేరు పెట్టింది. సెప్టెంబర్ 19, 2025న రోవర్‌లోని మాస్ట్‌క్యామ్-జెడ్ కెమెరా ఈ చిత్రాన్ని బంధించింది.
అక్కడి రాయి కాదు.. మరెక్కడిదో?
ఈ రాయిని మరింత లోతుగా విశ్లేషించిన మిషన్ బృందం, అది అక్కడి పరిసరాల్లోని సాధారణ రాళ్లకు పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు నిర్ధారించింది. రోవర్‌లోని అత్యాధునిక సూపర్‌క్యామ్ లేజర్, స్పెక్ట్రోమీటర్లతో జరిపిన ప్రాథమిక పరీక్షల్లో ఈ రాయి కూర్పు చాలా ప్రత్యేకంగా ఉన్నట్లు తేలింది.
ఈ రాయి ప్రత్యేకతలు ఇవే:
దీనిలో ఇనుము (Iron), నికెల్ (Nickel) మూలకాలు అత్యధిక సాంద్రతలో ఉన్నాయి.
సాధారణంగా అంగారకుడి ఉపరితలంపై ఈ రకమైన మూలకాలు కనిపించడం చాలా అరుదు.
ఇవి కేవలం గ్రహశకలాల (Asteroids) కేంద్ర భాగాల్లో ఏర్పడే ఉల్కలలోనే ఎక్కువగా ఉంటాయి.
సౌర కుటుంబం నుంచి వచ్చిన అతిథి?
ఈ సాక్ష్యాలను బట్టి చూస్తుంటే, ఈ రాయి అంగారకుడిపై పుట్టింది కాదని, సౌర వ్యవస్థలో మరెక్కడో ఏర్పడి ఉల్క (Meteorite) రూపంలో ఇక్కడ పడి ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు బలంగా భావిస్తున్నారు. అయితే, దీన్ని అధికారికంగా ఉల్కగా ప్రకటించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు.
గతంలో 'క్యూరియాసిటీ రోవర్' కూడా 2014లో "లెబనాన్", 2023లో "కోకో" అనే ఇలాంటి ఐరన్-నికెల్ ఉల్కలను గేల్ క్రేటర్‌లో గుర్తించింది. కానీ జెజెరో క్రేటర్ వద్ద పర్సెవరెన్స్‌కు ఇన్నాళ్లకు ఇలాంటి అరుదైన రాయి దొరకడం శాస్త్రవేత్తలకు ఊహించని పరిణామం.
ఎర్ర గ్రహం గుట్టు విప్పే క్రమంలో ఈ "ఫిప్సాక్స్‌లా" రాయి శాస్త్రవేత్తలకు కొత్త సమాచారాన్ని అందించే అవకాశం ఉంది. ఇది నిజంగా అంతరిక్షం నుంచి వచ్చిన ఉల్క అయితే, అంగారకుడి భౌగోళిక చరిత్రను అర్థం చేసుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

