"రాబిన్ హుడ్ హీరో కాదు.. అతనే మొదటి టెర్రరిస్ట్!" ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్‌పై రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి.
‘ఐబొమ్మ’ (iBomma) వంటి పైరసీ వెబ్‌సైట్లపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు, ఇటీవల ఆ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో స్పందించారు. పైరసీ ఎప్పటికీ ఆగదని కుండబద్దలు కొడుతూనే, ప్రేక్షకులకు గట్టి చురకలు అంటించారు.
"పైరసీ ఆగదు.. రవి లాంటి వాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు"
ఆర్జీవీ తన ట్వీట్‌లో కఠిన వాస్తవాలను ప్రస్తావించారు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా, పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా.. సినిమాను ఉచితంగా చూడాలనే కోరిక ప్రేక్షకుల్లో ఉన్నంత కాలం పైరసీ ఆగదని స్పష్టం చేశారు. ఒక రవి జైలుకు వెళ్తే, లింకులు ఇచ్చే రవి లాంటి వాళ్లు మరొకరు పుట్టుకొస్తూనే ఉంటారని తేల్చిచెప్పారు.
"రాబిన్ హుడ్ హీరో కాదు.. టెర్రరిస్ట్!"
ఈ సందర్భంలో వర్మ చేసిన ఓ పోలిక ఇప్పుడు వైరల్ అవుతోంది. కొంతమంది ఐబొమ్మ రవిని ‘రాబిన్ హుడ్’తో పోల్చడాన్ని ఆయన తప్పుబట్టారు.
"రాబిన్ హుడ్ నిజమైన హీరో కాదు. ధనవంతులను దోచుకుని పేదలకు పంచిన మొదటి టెర్రరిస్ట్ లాంటి వాడు."
"ధనవంతులు చేసిన నేరం ఏంటంటే.. కష్టపడి డబ్బు సంపాదించడమే."
"దోపిడీని గొప్పగా చెబుతూ, దొంగను దేవుడిలా చూడటం ప్రజల అజ్ఞానం."
టికెట్ రేట్లు ఎక్కువైతే.. దొంగతనం చేస్తారా?
సినిమా టికెట్ రేట్లు, పాప్‌కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయనే సాకుతో పైరసీని సమర్థించడాన్ని వర్మ తీవ్రంగా ఖండించారు. "BMW కారు ఖరీదుగా ఉందని షోరూమ్ దోచేస్తారా? బంగారం రేటు ఎక్కువని జ్యువెలరీ షాప్ కొల్లగొట్టి అందరికీ పంచుతారా? ఇదంతా ఎంత అసంబద్ధమో, సినిమా పైరసీ కూడా అంతే" అని లాజికల్ పాయింట్ తీశారు.
పైరసీ ఆగాలంటే ఏం చేయాలి?
కేవలం సైట్ నడిపేవాళ్లను మాత్రమే కాదు, చూసేవాళ్లను కూడా నేరస్తులుగా చూడాలని వర్మ ఓ సంచలన పరిష్కారాన్ని సూచించారు:
పైరసీ సినిమా చూస్తున్న వారిని కూడా దొంగలుగానే పరిగణించాలి.
ఓ 100 మంది పైరసీ ప్రేక్షకులను ర్యాండమ్‌గా అరెస్ట్ చేయాలి.
వారి పేర్లను, ఫోటోలను పబ్లిక్‌గా మీడియాలో ప్రకటించాలి.
అప్పుడు ఒక్కసారి భయం పుడుతుంది, పైరసీ చూడటమంటే దొంగ సొత్తు కొనడమే అని జనాలకు అర్థమవుతుంది.

