మన సినిమాలను కోట్లకి కోట్లు పెట్టి కొనే రోజులు పోయాయా? నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తోంది!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అస్సలు బాగాలేదు. మౌత్ టాక్ అదిరిపోతే తప్ప జనం థియేటర్లకు రావడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు శాటిలైట్ రైట్స్ రూపంలో భారీ డిమాండ్ ఉండేది, కానీ ఇప్పుడు టీవీ ఛానెళ్లు కూడా ముఖం చాటేస్తున్నాయి. పోనీ ఓటీటీలైనా ఆదుకుంటాయా అంటే, అక్కడ కూడా సీన్ రివర్స్ అయ్యింది. ఒకప్పుడు సినిమా బడ్జెట్‌లో సగం ఓటీటీ నుంచే వచ్చేది, కానీ ఇప్పుడు ఆ సంస్థలు కూడా ఆచితూచి అడుగులేస్తున్నాయి. చిన్న సినిమాలైతే కనీసం 'పే పర్ వ్యూ'కి కూడా తీసుకోవడం లేదు.
ముఖ్యంగా మార్కెట్ లీడర్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై దక్షిణాది సినిమాలను అధిక ధరలకు కొనుగోలు చేసి డబ్బు వృధా చేసుకోకూడదని ఆ సంస్థ గట్టిగా నిర్ణయించుకుంది. కేవలం స్టార్ హీరోల సినిమాలే కొంటున్నా, అవి థియేటర్లో ప్లాప్ అయితే.. ముందే ఒప్పందం చేసుకున్న రేటులో సగానికి పైగా కోతలు విధిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ కొత్త మాస్టర్ ప్లాన్ ఇదే:
సినిమాలను కొనడం తగ్గించి, సొంతంగా ఒరిజినల్ కంటెంట్ (Original Content) నిర్మించడం.
భారీ వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలపై ఎక్కువ ఫోకస్ పెట్టడం.
దీనికోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లో కొత్త ఆఫీస్ ఏర్పాటు చేయడం.
తెలుగు, తమిళం నుంచి నేరుగా క్వాలిటీ కంటెంట్ తయారు చేయించడం.
ఇతర ఓటీటీలతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ధరలు ఇస్తుందనే నమ్మకం నిర్మాతల్లో ఉండేది. కానీ ఈ కొత్త స్ట్రాటజీతో ఆ భారీ ఆదాయానికి గండి పడనుంది. దీంతో పెద్ద సినిమాలు తీసే నిర్మాతలు బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గక తప్పదు, లేదా స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్లు తగ్గించుకోవాల్సిందేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

.webp)